
పురిటిగడ్డపై మమకారం
- విదేశాల్లో ఉంటూ సొంతగడ్డలో సేవలు
- ప్రవాసీ భారతీయ దివస్’ ప్రత్యేక కథనం
- వృత్తి రీత్యా విదేశాల్లో..
- సొంతగడ్డపైనే సేవా కార్యక్రమాలు
- మంచి నీటి ఎద్దడిపై ప్రత్యేక దృష్టి
- విద్యార్థులకు చేయూత
- నేడు ప్రవాసీ భారతీయ దివస్
వృత్తి రీత్యా విదేశాల్లో స్థిరపడినా పురిటిగడ్డను మరువడం లేదు మెతుకుసీమ బిడ్డలు. డాక్టర్లుగా, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా అమెరికా, లండన్ తదితర ప్రాంతాల్లో స్థిరపడిన జిల్లా వాసులు తమ సొంతగడ్డపై సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. మంచినీటి ఎద్దడిని తీర్చడం, పేద విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేయడం, ఫర్నిచర్, కంప్యూటర్లు అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎవరి స్థాయిని బట్టి వారు నిధులను సమకూరుస్తూ సొంతగడ్డపై ఉన్న మమకారాన్ని చాటిచెబుతున్నారు. నేడు ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా పలువురి సేవా కార్యక్రమాలు ఇలా...
- న్యూస్‌లైన్ నెట్‌వర్క్
నీటి కష్టాలకు చెక్
వెల్దుర్తి: మండలం మాసాయిపేట గ్రామ మాజీ సర్పంచ్, మెదక్ సమితి ఉపాధ్యక్షుడు చిన్నచౌదరిగారి పెద్ద విఠల్‌రెడ్డి స్మారకార్థం ఆయన కుమారులు డాక్టర్ జీవన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, రామచంద్రారెడ్డిలు మూడేళ్లుగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. జీవన్‌రెడ్డి లండన్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కూడా తనవంతు సహాయాన్ని అందజేస్తున్నారు. పెద్ద విఠల్‌రెడ్డి పేరిట వీరు ఇప్పటివరకు రూ.40 లక్షలతో వాడవాడలా 36 మినీ నీటి ట్యాంకులను ఏర్పాటుచేసి, మూడు బోర్లు వేసి, మోటార్లను బిగించి మహిళల నీటి కష్టాలను తీర్చారు. పశువుల ఆసుపత్రి భవన నిర్మాణానికి రూ.5 లక్షల విలువ గల స్థలాన్ని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ భవనం కోసం రూ.4 లక్షల విలువ చేసే స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. స్థానిక లైబ్రరీకి రూ.10 వేల విలువ గల ఫర్నిచర్‌ను సమకూర్చారు. పాఠశాల లో విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులు సమకూరుస్తూ క్రీడలు నిర్వహిస్తుంటారు. ఏటా విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందజేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు జీవన్‌రెడ్డితోపాటు అతని సోదరులు.
ఉజ్వల్‌రెడ్డి.. ఉత్తమ సేవలు
జహీరాబాద్: వృత్తి రీత్యా దేశం కాని దేశానికి వెళ్లి స్థిరపడిన ప్రవాస భారతీయుడు ఎస్.ఉజ్వల్‌రెడ్డి తాను పుట్టిన ఊరిని మరువలేదు. జహీరాబాద్ మండలం చిరాగ్‌పల్లి గ్రామానికి చెందిన ఈయన రెండు దశాబ్దాల క్రితం వైద్యుడిగా అమెరికాలో స్థిరపడ్డారు. అయినప్పటికీ అడపాదడపా స్వగ్రామానికి వస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. స్థానికులతో కలుపుగోలుగా ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అతని సేవలను చిరాగ్‌పల్లి గ్రామస్థులు అభినందిస్తున్నారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు గత వేసవిలో రెండు బోర్లు వేయించారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో వేసవిలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయిస్తున్నారు. గ్రామానికే పరిమితం కాకుండా జహీరాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ మంచినీటి సమస్య ఎదురైనా అక్కడికి నీటిని పంపించేందుకు వీలుగా ప్రత్యేకంగా ట్యాంకర్‌ను సమకూర్చారు. అందోల్ నియోజకవర్గంలోని మునిపల్లి మండలానికి సైతం ప్రత్యేకంగా ఓ ట్యాంకర్‌ను కేటాయించారు. మూడు ట్యాంకర్ల ద్వారా ఆయా ప్రాంతాల వారికి మంచి నీటిని అందిస్తున్నారు.
చిరాగ్‌పల్లిలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల సౌకర్యార్థం మూడు కంప్యూటర్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, 120 బెంచీలను అందజేసి గ్రామానికి, విద్యార్థులపై తనకున్న మమకారాన్ని చాటుకున్నారు. యువత, విద్యార్థులకు వాలీబాల్ మెటీరియల్‌తోపాటు ఇతర ఆటల సామగ్రిని సమకూర్చారు. ఇటీవల గ్రామంలో నిర్వహించిన వైద్య శిబిరంలో రెండు వేల మందికి వైద్య సేవలందించడంతోపాటు పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. హోతి(కె) గ్రామంలో సైతం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయించారు. రక్తానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని గ్రామంలో ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఇలా పలు రకాల సేవలను కొనసాగిస్తున్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తారని ఉజ్వల్‌రెడ్డి సన్నిహితులు తెలిపారు.
విద్యార్థులకు అండగా ఎన్‌ఆర్‌ఐ ఇంజనీర్లు
వెల్దుర్తి: మండలంలోని మాసాయిపేట గ్రామానికి చెందిన వీరన్నగారి లింగారెడ్డి, పద్మ దంపతుల కుమారులు హరీష్‌రెడ్డి, రాకేష్‌రెడ్డిలు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. సుమారు ఏడేళ్లుగా అక్కడే ఉంటున్న వారు పురిటి గడ్డను మరువకుండా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వీరు అప్పట్లో పదోతరగతి వరకు మాసాయిపేట ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసాన్ని సాగించారు. తాము చదువుకున్న పాఠశాలకు గుర్తింపు తేవాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే పదోతరగతిలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.5 వేలు, ద్వితీయ స్థానంలో వచ్చిన వారికి రూ.3 వేలు, తృతీయ స్థానం సాధించిన వారికి రూ.2 వేల చొప్పున నగదు ప్రోత్సాహాన్ని ఏటా అందిస్తున్నారు. వీరు సొంతగడ్డకు రాకపోయినా అమెరికా నుంచే డబ్బులు పంపిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. ఏటా స్వాతంత్య్ర దినోత్సవం రోజున తమ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా విద్యార్థులకు నగదు ప్రోత్సాహాన్ని అందిస్తుంటారు.