ఇడుపుల పాయ వద్ద సభా వేదిక ఏర్పాటు గురించి పార్టీ నేతలకు సూచనలు ఇస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నుంచి ప్రారంభించనున్న ప్రజాసంకల్ప పాదయాత్రకు ఇడుపులపాయలో ఏర్పాట్లు జోరందుకున్నాయి. సోమవారం ఉదయం 9.45 గంటలకు వైఎస్సార్ ఘాట్ నుంచి ఆయన పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా 180 రోజులు మూడువేల కిలోమీటర్లు సాగే ప్రజాసంకల్ప పాదయాత్రకు స్థానిక నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
వైఎస్సార్ జిల్లాలో ఇడుపులపాయ నుంచి దువ్వూరు దాకా పాదయాత్రకు స్వాగతం పలుకుతూ పెద్దసంఖ్యలో ఫ్లెక్సీలు, ఆర్చీలు ఏర్పాటు చేశారు. బహిరంగసభ వేదిక ఏర్పాటు పనులు శనివారం ప్రారంభమయ్యాయి. వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శి, జిల్లా ఇన్‌చార్జ్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్‌రెడ్డి, వైఎస్ కొండారెడ్డి, జెడ్పీటీసీ ప్రవీణ్‌తో పాటు పలువురు నాయకులు సభావేదిక, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి ఈ బాధ్యతలు చూస్తున్న నేతలకు సూచనలు ఇచ్చారు. ఉదయం 9.40 గంటల్లోగా దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించి 9.45 గంటలకు వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి నేరుగా బహిరంగసభ వేదికకు చేరుకుని అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు, కార్యకర్తల కోసం వైఎస్ మనోహర్‌రెడ్డి నేతృత్వంలోని బృందం భోజన ఏర్పాట్లు చేస్తోంది. శనివారం నుంచి ఇడుపులపాయలో సందడి ప్రారంభమైంది.
నేడు జగన్ రాక...
ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభం కోసం ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి పులివెందులకు వెళ్లి మధ్యాహ్నం 3.30 గంటలకు సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి బయల్దేరి సాయంత్రం ఆరు గంటలకు కడప పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని తిరిగి ఇడుపులపాయకు వెళతారు. రాత్రికి అక్కడే బస చేసి సోమవారం ఉదయం ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment