
‘విభజన’ సమాచారాన్ని సిద్ధం చేయండి: సీఎస్
ఒకవైపు విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చల రచ్చ కొనసాగుతుండగానే.. మరోవైపు విభజన ప్రక్రియను పూర్తి చేయడానికి అవసరమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చల రచ్చ కొనసాగుతుండగానే.. మరోవైపు విభజన ప్రక్రియను పూర్తి చేయడానికి అవసరమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి బుధవారం సచివాలయంలో 20 ప్రధాన శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర పునర్విభజన బిల్లులోని షెడ్యూళ్లను లోతుగా పరిశీలించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి అధికారులను ఆదేశించారు. విభజన చేయాల్సి వస్తే బిల్లులోని అంశాల వారీగా ఏయే శాఖలు ఏ చర్యలు చేపట్టాల్సి వస్తుందనే వివరాలను రూపొందించాలని సూచించారు. బిల్లులో పేర్కొన్నట్లుగా ఆస్తులు, అప్పులతో పాటు అన్ని అంశాల్లో జిల్లాల వారీగా పూర్తి సమాచారాన్ని సిద్ధం చేయాల్సిందిగా పేర్కొన్నారు.
విభజన బిల్లులోని షెడ్యూళ్లలో ఏవైనా తప్పులు, లోపాలుంటే వాటిని గుర్తించి.. శాఖల వారీగా నోట్‌లను సిద్ధం చేయాలని మహంతి అధికారులకు సూచించారు. రాష్ట్ర విభజనకు సంబంధించి రాష్ట్రం నుంచి కేంద్రానికి పంపిన సమాచారం ఏమిటి? బిల్లులో పేర్కొన్న సమాచారం ఏమిటి? అనే అంశాలను పరిశీలించి ఏవైనా వ్యత్యాసాలుంటే వాటిని పొందుపరుస్తూ నోట్‌ను రూపొందించాలని సూచించారు. ఈ మేరకు 20 ప్రధాన శాఖల ఉన్నతాధికారులకు విభజన బిల్లు ప్రతులను సీఎస్ అందజేశారు. బిల్లులోని షెడ్యూళ్లను లోతుగా అధ్యయనం చేయాలని ఆయా శాఖల ఉన్నతాధికారులకు సూచించారు. కేంద్ర హోంశాఖ పంపిన విభజన బిల్లులో అంశాలను రాష్ట్ర ప్రభుత్వం సవరించడం సాధ్యం కాదని.. అలా చేస్తే ప్రివిలేజ్ మోషన్ కిందకు వస్తుందని సీఎస్ పేర్కొన్నారు. అలాంటి వాటిని గుర్తిస్తే సీఎం, మంత్రులు సభలో చెబుతారని.. అలాగే కేంద్ర ప్రభుత్వానికి విడిగా నోట్ ద్వారా తెలియజేయాల్సి ఉంటుందని సీఎస్ స్పష్టం చేశారు. కాగా.. బిల్లులోని పలు అంశాలు అసమగ్రంగా ఉన్నాయని.. వాటిని అమలు చేస్తే ఉత్పన్నమయ్యే పర్యవసానాల సమాచారం ఇవ్వాలని తెలుగుదేశం సభ్యులు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కోరారు. దాంతో ఆ అంశాలపై వివరాలను సిద్ధం చేయాల్సిందిగా స్పీకర్ మనోహర్ సీఎస్‌కు సూచించారు. మొత్తం సమాచారాన్ని ఈ నెల 20వ తేదీలోగా అన్ని శాఖలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.