అసెంబ్లీ సమావేశాలకు విపక్షం సిద్ధమవుతోంది.
అసెంబ్లీ సమావేశాలకు విపక్షం సిద్ధమవుతోంది. శనివారం నుంచి ప్రారంభమయ్యే రాష్ట్ర శాసన సభ సమావేశాల్లో ప్రధానంగా ‘రాజధాని దురాక్రమణ’పై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అస్త్రశస్త్రాలను సమకూర్చుకుంది. పేద రైతుల పొట్టకొట్టి సంపాదించిన డబ్బుతోనే అధికార తెలుగుదేశం విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టటమే తన ప్రధాన ఎజెండా అని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి స్పష్టం చేశారు. తాగునీటి సమస్యపై ప్రస్తావిస్తానని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా చెబుతున్నారు. రాజధాని భూములను గద్దల్లా తన్నుకుపోయిన ప్రభుత్వ పెద్దల అవినీతిపై నిలదీయనున్నట్టు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఉద్ఘాటించారు. పల్నాడులో కరువుపై సభలో ప్రస్తావించనున్నట్టు మాచర్ల ఎమ్మెల్యే పీఆర్కే తెలిపారు.
ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన ఎజెండా
కోన రఘుపతి, ఎమ్మెల్యే, బాపట్ల
బాపట్ల : ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టటమే ప్రధాన ఎజెండా. కేంద్ర బడ్జెట్‌లో అన్యాయం జరిగింది. రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు కూడా సక్రమంగా లేవు. ఖరీఫ్, రబీలో రైతులు తీవ్రంగా నష్టపోగా, కరువు మండలాల జాబితాకు సంబంధించి బాపట్ల నియోజకవర్గంలోని కేవలం ఒక మండలానికే చోటు కల్పించి, మరో రెండు మండలాలను వదిలి వేయడంపై ప్రధానంగా చర్చిస్తా. టీడీపీ అధికారంలోకి వచ్చేటప్పుడు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. పాలన చేపట్టిన రెండేళ్ళు కావస్తున్నప్పటికి స్పందించకపోవటం విచారకరం. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తా.
నియోజకవర్గ సమస్యలపై చర్చిస్తా
షేక్ మొహమ్మద్ ముస్తఫా, ఎమ్మెల్యే, గుంటూరు తూర్పు
పట్నంబజారు (గుంటూరు) : నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా. ముఖ్యంగా వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరతా. కృష్ణా నీటి నిల్వలు తగ్గిపోతున్న క్రమంలో నియోజకవర్గంలో నీటి సమస్య జఠిలం కానుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నీటి ఇబ్బందులు ఉన్నాయి. వీటిని అధిగమించి ప్రజలకు తాగునీటిని అందజేయాల్సిన బాధ్యతను ప్రభుత్వానికి గుర్తు చేస్తా. డ్రైనేజీ, కాల్వలు వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై చర్చిస్తాం. నియోజకవ ర్గంలోని పలు ప్రాంతాల్లో కాలనీలు ఏర్పడి దశాబ్దాలు గడుస్తున్నా సరైన రోడ్లు లేవు, వీటిని నిర్మించడానికి ప్రభుత్వం చొరవ చూపాలని తెలియజేస్తా. గుంటూరు నగరంలో నానాటికీ తీవ్ర సమస్యగా మారుతున్న ట్రాఫిక్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిసారిస్తా. వీటితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముస్లిం మైనారిటీలపై పెడుతున్న అక్రమ కేసులపై మాట్లాడతా.
ప్రభుత్వ తీరును ఎండగడతా
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
మాచర్ల : ప్రజలు కరువు, మంచినీటి సమస్యతో అల్లాడుతుంటే ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఫిరాయింపులను ప్రోత్సాహిస్తూ రాజధాని భూములను కొనుగోలు చేసిన అధికార పార్టీ దుర్నీతిపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తా. పల్నాడులో కరువు, నీటి సమస్యతో ఇబ్బందిపడుతున్న విషయాన్ని అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్తా. పంటలు పండక, నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడుతుంటే ఇంత వరకు కరువు సాయం, పశుగ్రాసం, నీటి సరఫరాకు చర్యలు తీసు కోక పోవటం దారుణం. ఇటువంటి వాటిని పట్టించుకోకుండా ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులను అధికార పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నిస్తూ దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్న టీడీపీ సర్కారును నిలదీస్తా. రాజధాని భూ కుంభకోణం అవినీతి చర్యలపై ప్రభుత్వ తీరును ఎండగడతా. పల్నాడులో చేపట్టాల్సిన మంచినీటి పథకాలు, వరికపూడిశెల, దుర్గి మిర్చి యార్డు, ఆయా సమస్యలను ప్రస్తావిస్తా.
రాజధాని దురాక్రమణపై నిలదీస్తా
ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే)
మంగళగిరి : రాజధాని పేరుతో మంత్రులు, అధికార పార్టీ నేతలు చేసిన భూ దురాక్రమణపై ప్రభు త్వాన్ని నిలదీస్తా. పేద రైతుల కడుపులు కొట్టి అధికార పార్టీ నేతలు భూములతో వ్యాపారం చేసి కోట్లాది రూపాయలు ఆర్జించి అవినీతికి పాల్పడ్డారు. రైతులకు న్యాయం చేసేందుకు అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తుతా. నదీ తీరాన ఆక్రమణలు, అక్రమ కట్టడాలపై ప్రశ్నిస్తా. ముఖ్యంగా నియోజకవర్గంలోని గ్రామాలతో పాటు మంగళగిరి, తాడేపల్లి మున్సిపాల్టీలలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేస్తా. చేనేత సహకార సంఘాలతో పాటు చేనేత కార్మికుల సమస్యలు, రుణమాఫీ తదితర అంశాలను ప్రస్తావిస్తా. రాజధాని గ్రామాలలో భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వం ఇస్తున్న ఫించన్లు అర్హులైన పేదలకు అందడం లేదు, తెలుగు తమ్ముళ్ల కారణంగా అసలైన లబ్ధిదారులు నష్టపోతున్నారనే అంశాన్నీ అసెంబ్లీలో లేవనెత్తి అర్హులైన పేదలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తా. బకింగ్‌హామ్ కాలువపై వంతెనలు, తాడేపల్లి, రేవేంద్రపాడు వంతెనల స్థానంలో నూతన వంతెనలు, తెనాలి రోడ్ విస్తరణ అంశాలను సభ దృష్టికి తీసుకువస్తా. రాజధాని భూ సమీకరణ గ్రామాలలో సీఆర్‌డీఏ డిప్యూటీ కలెక్టర్లు అధికారుల అవినీతి కారణంగా ప్రభుత్వ, అన్‌నోన్‌భూములను కొల్లగొట్టిన విషయాన్ని సభ దృష్టికి తీసుకువచ్చి అసలైన రైతులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరతా. రాజధానిలో సంపూర్ణ రుణమాఫీ, ఉపాధి, నిరుద్యోగ భృతి, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, రుణమాఫీ అంశాలను ప్రస్తావిస్తా.
రైతు రుణమాఫీ పై నిలదీస్తాం
డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే, నరసరావుపేట
నరసరావుపేటవెస్ట్ : తెలుగుదేశం వాగ్దానాల్లో భాగమైన రైతు రుణమాఫీలో రెండో ఫేజ్ ఎప్పుడు అమలు చేస్తారనే విషయమై ప్రభుత్వాన్ని నిలదీస్తాం. రాష్ట్ర బడ్జెట్‌లో రైతు రుణమాఫీ రెండో విడతకు ఎంత కేటాయిస్తున్నారనే విషయాన్ని లేవనెత్తుతా. అలాగే మెడికల్ అండ్ హెల్త్ విభాగంలో తెలు గుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు నియామకాలు చేపట్టలేదు.ఇప్పుడు కాంట్రాక్ట్ పద్ధతిపై తీసుకుంటామనే వార్తలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఇక రాజధాని భూముల విషయంలో ముఖ్యమంత్రి, అతని బినామీలు, మంత్రులు వారి బినామీలు చేసిన దురాక్రమణపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తాం. లోకేష్, నారాయణ ఇద్దరూ కలిసి 3వేల ఎకరాలకు పైగా భూములను కొనుగోలు చేశారనే విషయం తేటతెల్లమైంది. దీంతో ప్రభుత్వ వెబ్‌సైట్‌ను నిలిపివేయించటం పెద్ద నేరం. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. రాజధాని భూములతో వచ్చిన డబ్బుతోనే రాష్ట్రంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను రూ. 20 కోట్ల నుంచి రూ.30 కోట్లకు కొని ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేసింది.