మానని గాయం.. అందని సాయం | Preposterous Help for 17 students families | Sakshi
Sakshi News home page

మానని గాయం.. అందని సాయం

Published Wed, Dec 25 2013 2:13 AM | Last Updated on Fri, Nov 9 2018 4:14 PM

Preposterous Help for 17 students families

 ‘తప్పిదం జరిగింది.. దానిని సరిదిద్దుకుంటాం.. అన్ని మేమే చూసుకుంటాం. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం..’ అంటూ హడావుడి చేసి.. హామీలిచ్చిన అధికారులు.. నాయకులు పత్తాలేకుండా పోయారు. సాయం సంగతి దేవుడెరుగు.. కనీసం ఓదార్చే వారు కరువై ఒక్కటికాదు రెండు కాదు.. ఏకంగా 17 మంది విద్యార్థుల కుటుంబాలు విలవిలలాడుతున్నాయి. ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతో కన్నొకరు.. కాలొకరు.. చేయొకరు పోగొట్టకున్న ఆ విద్యార్థులను ఆదుకునేవారు కరువయ్యారు. పిల్లలను కాపాడుకునేందుకు ఆ పేద కుటుంబాలు తాహతుకు మించి అప్పు చేస్తున్నారు. ప్రమాదం జరిగాక హడావుడి చేసిన అధికారులు.. నాయకులు ఇప్పుడు తమకేమీ సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తుండడం బాధిత కుటుంబాలను కలవరపెడుతోంది.
 
 స్కాలర్‌షిప్ పొందాలంటే బ్యాంకు ఖాతా తప్పనిసరి కావడంతో గత నెల 30న బస్వాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు కోహెడకు బయల్దేరారు. అయితే ఉపాధ్యాయులు ట్రాలీఆటోలో సామర్థ్యానికి మించి విద్యార్థులను కుక్కారు. అదుపుతప్పిన ఆటో బోల్తాపడి విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 17 మందికి కాళ్లు, చేతులు విరిగాయి. ఆ సమయంలో విద్యార్థులకు వైద్యం అందిస్తామని హడావుడి చేసిన అధికారులు ఇప్పుడు పట్టించుకోవడం లేదు. దీంతో ఆ పేద కుటుంబాలే అప్పులు చేసి తమ పిల్లలకు వైద్యం అందించుకుంటున్నారు. వారిలో కొందరి దీన పరిస్థితి..   
 - న్యూస్‌లైన్, హుస్నాబాద్
 
 ప్రథమ చికిత్సకే పరిమితం
 ఈ ఫొటోలోని చిన్నారి రోజారాణి. తొమ్మిదో తరగతి చదువుతోంది. ప్రమాదంలో తల, చెవులు, దవడకు తీవ్రగాయాలయ్యాయి. ప్రభుత్వం నుంచి ప్రథమ చికిత్స తప్ప ఇప్పటివరకు ఎలాంటి సహాయమూ అందలేదు. హైదరాబాద్‌కు రెఫర్ చేయగా.. ఓప్రైవేట్ ఆసుపత్రిలో స్కానింగ్ తీయించారు. చెవిలో రక్తం గడ్డ కట్టిందని, పళ్లు దెబ్బతిన్నాయని వైద్యులు నిర్ధారించారు. పరీక్షలు.. ఇతరత్రా రూ.20 వేల వరకు ఖర్చు చేసిన ఆ కుటుంబం చెవి నిపుణుడికి చూపించే స్థోమతలేక మిన్నకుండిపోయారు. చిన్న శబ్ధమైనా భారీగా వినిపిస్తోందని, తలనొప్పిగా ఉందంటూ రోజారాణి ప్రతిరోజూ ఏడుస్తోంది. అయినా ఈ కుటుంబాన్ని ఆదుకునేవారు కరువయ్యారు.
 
 చేతిలో చిల్లిగవ్వలేక నాటువైద్యం
 ఈ ఫొటోలో కనిపిస్తున్నది లింగాల బాలయ్య, యాదమ్మ దంపతులు కుమారుడు ప్రదీప్. పదేళ్లక్రితం హైదరాబాద్‌కు వలస వెళ్లిన ఈ కుటుంబం అక్టోబర్‌లోనే సొంత గ్రామానికి చేరింది. ప్రదీప్‌ను బడిలోచేర్చి నెల రోజులైనా కాలేదు. అంతలోనే ప్రమాదం జరిగి ప్రదీప్ రెండు చేతులు విరిగిపోయాయి. కూలీ పనులు చేస్తూ జీవించే ఆ కుటుంబానికి ప్రదీప్ పరిస్థితి క న్నీరు పెట్టిస్తోంది. ప్రమాద సమయంలో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా చేతికి కట్లు సరిగా కట్టకుండానే పంపించారు. మరో ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో నాటు వైద్యాన్ని నమ్ముకున్నాడు.
 
 ఈ విద్యార్థికి చూపునిచ్చేదెవరు..?
 ఈ ఫొటోలోని విద్యార్థి శివరాత్రి శ్రీనివాస్, లక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు చంద్రశేఖర్. పదో తరగతి ఆటోట్రాలీ బోల్తాపడిన సంఘటనలో కన్నుకు తీవ్రగాయమైంది. హు స్నాబాద్ నుంచి వరంగల్‌కు.. అక్కడినుంచి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలిం చారు. వైద్య సహాయం పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని నాయకులు, అధికారులు ఆ కుటుంబానికి హామీఇచ్చారు. నిమ్స్‌లో కంటి వైద్యులు లేరంటూ ఎల్‌వీ.ప్రసాద్ ఆసుపత్రి కి పంపగా.. అక్కడ స్పెషలిస్టు లేడంటూ తిరి గి నిమ్స్‌కు చేర్చారు. అక్కడ కేవలం స్కానిం గ్ మాత్రమే తీసి నోవా ఆసుపత్రికి రెఫర్ చేశారు. వారు పట్టించుకోకపోవడంతో డెక్క న్ ఆసుపత్రికి పంపారు. ఇలా తిరిగేందుకే ఆ కుటుంబం రూ.70 వేల వరకు ఖర్చుచేసింది.
 
 అక్కడ పరీక్షించిన వైద్యులు చంద్రశేఖర్ కనురెప్పలు దెబ్బతిన్నాయని, ఆపరేషన్‌కు రూ. రెండు లక్షలు అవుతాయని తెలిపారు.
 పేద కుటుంబం కాళ్లావేళ్లా పడితే రూ. 1.50 లక్షలకు అంగీకరించారు. తెలిసిన వారి వద్ద అప్పు చేసి అంతమొత్తం చెల్లించారు. ముందుగా వాపు తగ్గాలని, అనంతరం ఆపరేషన్ చేస్తేగానీ.. చూపు వస్తుందా..?రాదా? చెప్పలేమని వైద్యులు అంటున్నారు. ఇప్పటికే రూ.రెండు లక్షల వరకు ఖర్చు పెట్టుకున్న ఆ కుటుంబానికి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి నయాపైసా అందలేదు. ఓవైపు అప్పు బాధలు.. మరోవైపు కుమారుడి పరిస్థితి ఆ కుటుంబాన్ని తీరని వేధనకు గురిచేస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement