
‘ప్రజా’పాలన షురూ
ఏలూరు (ఆర్‌ఆర్ పేట), న్యూస్‌లైన్ : ఆం ధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుతీరడంతో ఆరు నెలలుగా కొనసాగుతున్న రాష్ట్రపతి పాలనకు తెరపడింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు, కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడంతో ప్రజాపాలన మొదలు కానుంది. దీంతో పాలన గాడిన పడనుంది. కొత్త ప్రజాప్రతినిధులు ఎప్పుడు వచ్చి తమ సమస్యలు పరిష్కరిస్తారని ఆశగా ఎదురుచూసిన జిల్లా ప్రజల కోరిక నెరవేరనుంది. గతేడాది రాష్ట్ర విభజన పరిణామాలతో ఆరు నెలలకు పైగా పాలన స్తంభించగా ప్రజలు ఇబ్బంది పడ్డారు. మరలా ఈ ఏడాదిలో ప్రాదేశిక, మునిసిపల్, సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కారణంగా గత మూడు నెలలుగా ప్రజలకు పూర్తిస్థాయిలో అధికారులు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో పలు కార్యక్రమాలు నిలిచి ప్రజలు అవస్థలు పడ్డారు. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రభుత్వం కొలువు తీరడంతో తమ సమస్యలను పరిష్కరించే నాథులు కనిపించారనే ఆనందంలో ప్రజలు ఉన్నారు.
మంత్రులదే అభివృద్ధి బాధ్యత
రాష్ట్ర కేబినెట్‌లో జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కేటాయించడంతో జిల్లాలో అభివృద్ధిపై ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా రాష్ట్ర విభజన అనంతరం పదవి చేపడుతున్న నూతన ప్రభుత్వానికి ఎదురుకానున్న సవాళ్లకు జిల్లా మంత్రులు ఏవిధంగా స్పందిస్తారోనని ఎదురుచూస్తున్నారు. జిల్లాకు సమీపంలోని విజయవాడ-గుంటూరు మధ్య రాష్ట్ర రాజధాని ఏర్పాటులో జిల్లా మంత్రులు తమ వాణిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి వినిపించి ఆ మేరకు సఫలీకృతం కావాలని కోరుకుంటున్నారు. త ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో జిల్లా మంత్రులు కీలక పాత్ర పోషిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.