
ఆధ్యాత్మికానందం
శ్రీవారితో పాటు పద్మావతీ అమ్మవారిని,
కపిలేశ్వరుడిని దర్శించుకున్న ప్రణబ్‌ముఖర్జీ
టీటీడీ ఆతిథ్యానికి పులకించిన ‘దాదా’
అన్ని కార్యక్రమాల్లో పాలుపంచుకున్న గవర్నర్, సీఎం
తిరుమల: రాష్ట్రపతి తిరుమల పర్యటనలో భాగంగా ఆధ్యాత్మిక ఆనందం పొందారు. ఆయన శ్రీవారితో పాటు తిరుచానూరు పద్మావతీ అమ్మవారిని, తిరుపతిలోని కపిలేశ్వర స్వామిని దర్శించుకుని పరవశించారు. ఈ సందర్భంగా టీటీడీ చేసిన ఘనమైన ఏర్పాట్లతో ప్రణబ్ ముఖర్జీ పరవశించి ఆనందంగా తిరుగుప్రయాణమయ్యారు.
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. ఈవో దొండపాటి సాంబశివరావు నేతృత్వంలో తిరుమలలో జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, తిరుపతిలో జేఈవో పోలా భాస్కర్ బృందాలు వేర్వేరుగా ఏర్పాట్లు చేశాయి. విమానం దిగిన తర్వాత తిరుచానూరుకు చేరుకున్నప్పటి నుంచి రాష్ట్రపతితోపాటు గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబుకు ఎక్కడా కూడా చిన్నలోటులేకుండా ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనం, ఆ తర్వాత కపిలేశ్వర స్వామి దర్శనం, తిరుమలకు చేరుకున్న తర్వాత అతిథిగృహంలో లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేశారు. ధరించేందుకు పట్టువస్త్రాల నుంచి తిరిగి వెళ్లే సమయంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల వరకు అన్నీ కూడా ముందస్తుగానే సిద్ధం చేశారు.
ఉత్తరాది వంటకాల వడ్డింపు
రాష్ట్రపతి పర్యటన ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీటీడీ ఆ మేరకు ఆహార ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించింది. రాష్ట్రపతి, గవర్నర్, సీఎంకు వేర్వేరుగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతికి ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం ఆయన వ్యక్తిగత వ ంటమనిషి (చెఫ్) ఉత్తరాది వంటకాలు సిద్ధం చేశారు. ఇక గవర్నర్, సీఎంకు టీటీడీ తయారు చేసిన పదార్థాలు వడ్డించారు. ఇదే తరహాలో వారి వెంట వచ్చిన మంత్రులు, సీఎస్, డీజీపీతోపాటు రాష్ట్రపతి భవన్, రాజ్‌భవన్, సీఎం పేషీ అధికార యంత్రాంగానికి సకల సదుపాయాలు సమకూర్చారు.
టీటీడీ, రెవెన్యూ, విజిలెన్స్, పోలీసుల సమన్వయం
టీటీడీ, రెవెన్యూ, విజిలెన్స్, పోలీసు విభాగాలు గతంలో ఎన్నడూ లేనివిధంగా సమన్వయ సహకారంతో పనిచేశాయి. అన్ని విభాగాలను, అధికారులందరినీ ఒకే తాటిపై తీసుకురావటంలో టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు పర్యవేక్షణలో టీటీడీ విభాగాలు, కలెక్టర్ సిదార్థ్‌జైన్, అనంతపురం రేంజ్ డీఐజీ సత్యనారాయణ, తిరుపతి అర్బన్‌జిల్లా ఎస్‌పీ గోపీనాథ్‌జెట్టి పర్యవేక్షణలో రెవెన్యూ, పోలీసు విభాగాలు పనిచేశాయి. సీవీఎస్‌వో నాగేంద్రకుమార్ పర్యవేక్షణలో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది విధులు పంచుకుని సమర్థవంతంగా పనిచేశారు. రాష్ర్టపతి పర్యటన తీర్థయాత్ర మొత్తం ఏడున్నర గంటలు సాగింది. ఉదయం 10.30 గంటలకు తిరుపతి విమానాశ్రయం దిగిన తర్వాత తిరిగి సాయంత్రం 5 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్నారు.
భక్తులకు 4 గంటలపాటు దర్శనం నిలిపివేత
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సామాన్య భక్తులతోపాటు రూ.300 టికెట్ల భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించలేదు. సుమారు నాలుగుగంటల తర్వాత స్వామివారి దర్శనానికి అనుమతించారు. మధ్యాహ్నం 12 గంటలకే ఆలయం వద్ద ఏ ఒక్క భక్తుడు రాకుండా చూసుకున్నారు. ఆలయంలో కల్యాణోత్సవం ముగిసిన తర్వాత కూడా వారికి దర్శనం కల్పించి, వెలుపలకు పంపారు. ఆలయ ప్రాంతంలోనూ భక్తులను కట్టడి చేశారు.
సమష్టిగా పనిచేశారు : టీటీడీ ఈవో కితాబు
టీటీడీతోపాటు రెవెన్యూ, పోలీసు విభాగాలు సమష్టిగా పనిచేశాయని ఈవో దొండపాటి సాంబశివరావు మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వ ప్రోటోకాల్ నిబంధనలు, భద్రతా కారణాలను కూడా పరిగణలోకి తీసుకుని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే ఏర్పాట్లు చేశామన్నారు.