
కొండను తవ్వి.. ఏం చేసినట్లు?
సాక్షి, చిత్తూరు: ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడంపై పోలీసు, అటవీ అధికారులు నిర్వహించిన సెమినార్ కొండ ను తవ్వి.. ఎలుకను పట్టాం అన్న చందాన ముగిసింది. అన్నిశాఖల సహకారంతోనే ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టగలమని, అందుకు అందరూ చిత్తశుద్ధితో పని చేయాలని ఈ సెమినార్ తేల్చిచెప్పింది. చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో శని, ఆదివారాలు రెండు రోజులపాటు ‘ఎర్రచందనం అక్రమ రవాణా నివారణ- సవాళ్లు’ అనే అంశంపై జరిగిన సదస్సులో రాయలసీమ ఐజీ వేణుగోపాలకృష్ణ, ఇతర పోలీసు అధికారులు, అటవీ, న్యాయశాఖ అధికారులు పాల్గొన్నారు. రెండు రోజులపాటు సుధీర్ఘంగా చర్చించిన అధికారులు అన్ని శాఖల సమన్వయంతో గ్రీన్‌ఫోర్స్ పేరిట ప్రత్యేక దళం ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఇదే విషయమై ప్రభుత్వానికి ప్రతిపాదించాలని నిర్ణయించారు.
అయితే...
ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వం ఆ పని చిత్తశుద్ధితో చేస్తోందా?అధికారుల ఏంచేయాలి? చట్టాలు కఠినంగా లేని పరిస్థితిలో వారు చేయగలిగిందెంత? అధికార పార్టీ ఒత్తిళ్లు నేపథ్యంలో ఎంతమంది అధికారులు చిత్తశుద్ధితో పనిచేయగలుగుతున్నారు? అటవీ, సివిల్ పోలీసుల మధ్య సమన్వయం తదితర సవాలక్ష ప్రశ్నలకు సెమినార్‌లో సమాధానం దొరకలేదు. ఉన్నతాధికారుల సంగతి పక్కనబెడితే చందనం అక్రమ రవాణా విషయంలో కింది స్థాయి సిబ్బంది మధ్య సమన్వయం లేదన్నది సుస్పష్టం.
సమస్యలు అనేకం
కొంతమంది అటవీ, పోలీసు అధికారులకు చందనం ఆదాయ వనరుగా మారిందన్న విమర్శలూ ఉన్నాయి. దీంతో రెండు వర్గాల మద్య విబేధాలు పొడచూపినట్లు తెలుస్తోంది. ఈ విషయం సదస్సులో పాల్గొన్న కొందరు అధికారులు బహిరంగంగానే చెప్పడం తెలిసిందే. ఇటీవల నెల్లూరు జిల్లాలో రెండు విభాగాలు పరస్పర దాడులకు దిగి కత్తులతో పొడుచుకుని కేసులు కూడా పెటుకున్న విషయం తెలిసిందే. ఏకంగా చందనం స్మగ్లింగ్‌లో భాగస్తులయ్యూరన్న ఆరోపణలతో కొద్దికాలం క్రితం వైఎస్‌ఆర్ జిల్లాలో పాతిక మంది వరకూ అటు అటవీ, ఇటు సివిల్ పోలీసు అధికారులు, సిబ్బందిపై ఒకేసారి వేటువేశారు.
అధికార పార్టీ ఒత్తిళ్లతో చాలామంది పోలీసులు చందనం స్మగ్లింగ్ చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారన్న ఆరోపణలు కూడా అనేకం ఉన్నాయి. కొందరు పోలీసులు కేసుల పేరుతో బెదిరింపులకు దిగి అందినకాడికి దండుకుంటున్నారన్న విమర్శలూ లేకపోలేదు. ముఖ్యంగా చందనం అక్రమ రవాణా అరికట్టాలంటే ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. చట్టాలను కఠినతరం చేయాలి. అధికారులకు భరోసా కల్పించాలి.
చంద్రబాబు ఎన్నికలకు ముందు చందనం స్మగ్లింగ్‌పై హడావుడి చేశారు. ఎర్రదొంగలంతా ప్రతిపక్ష పార్టీలవారేనంటూ గవర్నర్ వద్ద పంచాయితీ పెట్టారు. ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు. చందనం స్మగ్లింగ్‌ను అరికట్టే పవరూ ఉంది. మరెందుకు ఆలస్యం. సదస్సులో ఓ ఫారెస్ట్ అధికారి చెప్పినట్లు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కఠిన చట్టాలకోసం చంద్రబాబు ప్రభుత్వం కేబినెట్ తీర్మానం చేసి అధికారులకు భరోసా కల్పించాల్సి ఉంది. తొలుత ఇది జరిగితే సదస్సుల వల్ల ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది.