ప్రధాని మోడీ నిర్ణయం హర్షణీయం
పోలవరం ముంపు గ్రామాలపై ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం
భీమవరం అర్బన్, న్యూస్‌లైన్ : పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలైన ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ రాష్ట్రపతి ఆర్డినెన్స్‌కు అనుకూలంగా కేంద్ర కేబినెట్ తొలి భేటీలోనే ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని బీజేపీ రాష్ట్ర నాయకుడు పాకా వెంకట సత్యనారాయణ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
1956లో భద్రాచలం ప్రాంతం తూర్పుగోదావరి జిల్లాలో ఉండేదని, అయితే పరిపాలనా సౌలభ్యం కోసం 1959లో ఖమ్మం జిల్లాలో కలిపారని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించాలని టీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న డిమాండ్లను వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రాజెక్టు మదింపు అనేది రాజకీయనాయకులకు సంబంధంలేని విషయమని, సాంకేతికంగా తలెత్తే ఇబ్బందులను ఇంజినీరింగ్ అధికారులు వివరిస్తారని, సెంటర్ వాటర్ కమిషన్ సూచనల మేరకే విధివిధానాలను రూపొందిస్తారన్నారు.
పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలన్నారు. త్వరలో తమ నేత వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి మోడీని కలిసి ఈ విషయమై కోరతామన్నారు. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేయాలని, దేశ సమగ్రత దెబ్బతినే ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. పార్టీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, అడ్డగర్ల ప్రభాకర గాంధీ పాల్గొన్నారు.