ఏపీకి ప్రత్యేక హోదా కల్పించండి
ప్రధానికి ఎంపీ బుట్టా రేణుక లేఖ
కర్నూలు (ఓల్డ్‌సిటీ): రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో పేర్కొన్న విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. వ్యవస్థీకరణ బిల్లులో పేర్కొన్న మేరకు ట్యాక్స్ మినహాయింపు, సబ్సిడీ, ఇన్సెంటీవ్స్, కొత్త ప్యాకేజీలు, ప్రాజెక్టుల ఏర్పాటు వంటి అంశాలను వెంటనే పరిశీలించి రాష్ట్రానికి తగిన న్యాయం చేయాలని కోరారు. వీటిని ఐదేళ్ల పాటు కొనసాగించాలన్నారు.
ఫిబ్రవరి బడ్జెట్‌లో ట్యాక్స్ ఇన్సెంటివ్స్, ట్యాక్స్ హాలిడేస్, కొత్త ప్రాజెక్ట్స్ ప్యాకేజీలు ప్రకటించాలని, రాయలసీమను వెనుకబడిన ప్రాంతంగా గుర్తించి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ముఖ్యంగా కర్నూలు పార్లమెంటు పరిధిలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పెట్టేందుకు అనేక మంది ఔత్సాహికులు ముందుకు వస్తున్నారని, అయితే ప్రభుత్వ రాయితీల కోసమే వారు నిరీక్షిస్తున్నారని తెలియజేశారు. లేఖ ప్రతిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జెట్లీకి కూడా పంపారు.