Renuka butta
-
ఇలాగైతే స్మార్ట్ సిటీ సాధ్యమేనా
► పందుల సమస్య తీవ్రం అంతటా పారిశుద్ధ్య లోపం ► కల్లూరును విస్మరిస్తున్నారు మున్సిపల్ అధికారులపై ► ఎంపీ బుట్టా, ఎమ్మెల్యే గౌరు చరిత ఆగ్రహం కర్నూలు(టౌన్): ‘కర్నూలు నగరంలో పందుల సమస్య తీవ్రంగా ఉంది.. పందుల నిర్మూలన అధికార యంత్రాంగానికి పట్టడం లేదు.. ఎక్కడా చూసినా పారిశుద్ధ్య లోపమే.. ఇక స్మార్ట్ సిటీ ఎలా సాధ్యం’ అంటూ కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం స్థానిక నగరపాలక కమిషనర్ చాంబర్ లో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డితో కలిసి మున్సిపల్ అధికారులు, వివిధ విభాగాల సెక్షన్ సూపరింటెండెంట్లతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో బుట్టా అధికారుల తీరును ఎండగ్టారు. ‘కర్నూలు నగరంలో పందుల సమస్య తీవ్రంగా ఉంది. మనుషుల ప్రాణాలు ముఖ్యం. సమస్యను లైట్‌గా తీసుకున్నారు. నేను ఉన్న ప్రాంతంలో వాణిజ్య నగర్ పార్కు అభివృద్ధి చేయాలని ఒకటిన్నర సంవత్సరం క్రితం చెప్పా.. అయినా పట్టించుకోలేదు. ఎంపీ చెప్పినా పనులు కాకపోతే ఇక ప్రజల సమస్యలు ఎలా పరిష్కారమవుతాయి’ అంటూ మండిపడ్డారు. వివిధ పథకాలు, స్కీమ్‌ల ద్వారా నగరపాలక సంస్థకు రూ. 200 కోట్లు వచ్చాయని, ఈ నిధులతో చేస్తున్న అభివృద్ధి వివరాలను తెలియజేయాలన్నారు. పనులు వేగవంతం చేయాలని, జాప్యం తగదన్నారు. -
వ్యవసాయం తర్వాత చేనేత వృత్తికే ప్రాధాన్యత
► కలిసికట్టుగా ఉంటూ ముందుకెళ్లాలి ► కురుహీనశెట్టి సమాజాభివృద్ధికి కృషి చేస్తా ► కర్నూలు లోక్‌సభ సభ్యురాలు బుట్టా రేణుక సాక్షి, బళ్లారి : భారత దేశంలో వ్యవసాయం తర్వాత చేనేత వృత్తికి ఎంతో ప్రాధాన్యత ఉందని కర్నూలు లోక్‌సభ సభ్యురాలు బుట్టా రేణుక పేర్కొన్నారు. ఆమె ఆదివారం బళ్లారి నగరంలోని రాఘవ కళామందిరంలో శ్రీనీలకంఠేశ్వర స్వామి ఆలయ 9వ వార్షికోత్సవ సందర్భంగా బళ్లారి నగర చేనేత కురుహీన శెట్టి సమాజ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. కురుహీన శెట్టి సమాజంలో పుట్టినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. అన్నం పెట్టే అన్నదాత చేసే వ్యవసాయం ఎంత గొప్ప పనో చేనేత పనికి కూడా అంతే ప్రాధాన్యత ఉందన్నారు. అన్నదాత రైతన్న అన్నం పెడితే చేనేతన్న మనిషికి కట్టుకునే బట్టలను తయారు చేస్తారని కొనియాడారు. అలాంటి కులంలో పుట్టిన మనందరం గర్వపడాల్సిన అవసరం ఉందన్నారు. చేనేత సమాజాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. బళ్లారికి పిలిపించి తనకు పెద్ద ఎత్తున సన్మానం చేయడం మరిచిపోలేని రోజన్నారు. రెండు సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి రాకమునుపు తనకు రాజకీయాల గురించి ఏమి తెలియదని, అయితే లోక్‌సభ మెంబరు అయిన తర్వాత రాజకీయ అనుభవం నేర్చుకుని పది మందికి సాయపడాలనే తత్వం ఏర్పరుచుకున్నానని గుర్తు చేశారు. కలిసికట్టుగా ఉంటూ సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పాటునందించాలని పేర్కొన్నారు. మాజీ మంత్రి మల్లికార్జున నాగప్ప మాట్లాడుతూ భారత దేశంలో చేనేత కురుహీన శెట్టి సమాజానికి చెందిన మహిళ బుట్టా రేణుక ప్రప్రథమంగా లోక్‌సభ సభ్యురాలు అయ్యారని కొనియాడారు. చేనేత వర్గాల అభివృద్ధికి అమె తన వంతు సహకారం అందిస్తాననడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తాము కొప్పళ జిల్లా గంగావతికి కూడా బుట్టా రేణుకను పిలిపించి సన్మానిస్తామన్నారు. కాగా అంతకు ముందు బళ్లారి నగర కురుహీన శెట్టి చేనేత సమాజం ఆధ్వర్యంలో నగరంలోని శ్రీనీలకంఠేశ్వర దేవస్థాన ం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, బళ్లారి విధాన పరిషత్ సభ్యుడు కేసీ కొండయ్య, ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంలను కురుహీనశెట్టి సమాజ ప్రముఖులు ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో 1008 జగద్గురు శ్రీనీలకంఠేశ్వర పట్టాధార్య మహాస్వామీజీ, విధాన పరిషత్ సభ్యుడు కేసీ కొండయ్య, కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, కురుహీన శెట్టి సమాజ ప్రముఖులు బీ.నాగప్ప, మాచాని ప్రభాకర్, చంద్రశేఖర్, నీలకంఠప్ప, బళ్లారి జిల్లా కురుహీన శెట్టి సంఘం అధ్యక్షుడు దొడగట్ట శివప్ప, బళ్లారి జిల్లా చేనేత వర్గాల సమూహం అధ్యక్షుడు సీ.దేవానంద్, తరుణ సంఘం అధ్యక్షుడు తుక్కా రాజేష్ పాల్గొన్నారు. రాజకీయ కుటుంబాన్ని ఓడించిన బుట్టా రేణుక కర్నూలు జిల్లాలో 50 సంవత్సరాలుగా అపార రాజకీయ అనుభవం కలిగి ఎన్నో ఉన్నత పదవులను అలకంరించిన కుటుంబాన్ని ఓడించిన ఘనత చరిత్ర వైఎస్ఆర్సీపీకి చెందిన లోక్‌సభ సభ్యురాలు బుట్టా రేణుకకు ఉందని కర్నూలు జిల్లా ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. -
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించండి
ప్రధానికి ఎంపీ బుట్టా రేణుక లేఖ కర్నూలు (ఓల్డ్‌సిటీ): రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో పేర్కొన్న విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. వ్యవస్థీకరణ బిల్లులో పేర్కొన్న మేరకు ట్యాక్స్ మినహాయింపు, సబ్సిడీ, ఇన్సెంటీవ్స్, కొత్త ప్యాకేజీలు, ప్రాజెక్టుల ఏర్పాటు వంటి అంశాలను వెంటనే పరిశీలించి రాష్ట్రానికి తగిన న్యాయం చేయాలని కోరారు. వీటిని ఐదేళ్ల పాటు కొనసాగించాలన్నారు. ఫిబ్రవరి బడ్జెట్లో ట్యాక్స్ ఇన్సెంటివ్స్, ట్యాక్స్ హాలిడేస్, కొత్త ప్రాజెక్ట్స్ ప్యాకేజీలు ప్రకటించాలని, రాయలసీమను వెనుకబడిన ప్రాంతంగా గుర్తించి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ముఖ్యంగా కర్నూలు పార్లమెంటు పరిధిలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పెట్టేందుకు అనేక మంది ఔత్సాహికులు ముందుకు వస్తున్నారని, అయితే ప్రభుత్వ రాయితీల కోసమే వారు నిరీక్షిస్తున్నారని తెలియజేశారు. లేఖ ప్రతిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జెట్లీకి కూడా పంపారు. -
కర్నూలులో ఎయిమ్స్, కృష్ణా వాటర్ బోర్డును ఏర్పాటు చేయండి
సాక్షి, కర్నూలు: వెనుకబడిన రాయలసీమ జిల్లాల్లో ఒకటైన కర్నూలులో ఎయిమ్స్ కళాశాల, కృష్ణా వాటర్ బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతిని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక పార్లమెంట్ హౌస్‌లో శుక్రవారం విడివిడిగా కలిసి విజ్ఞప్తి చేశారు. కర్నూలులో ఎయిమ్స్ కళాశాల ఏర్పాటు చేయడం వల్ల సీమ ప్రజలకు వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని, వైద్య రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, అలాగే రూ. 250 కోట్లతో కర్నూలు మెడికల్ కళాశాలతోపాటు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆధునిక వైద్య సదుపాయాలు కల్పించాలని, మరో రూ.30 కోట్లతో ఆర్పీఎన్సీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ను కోరుతూ వినతి పత్రం సమర్పించారు. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతిని కలిసిన సందర్భంలో కృష్ణా వాటర్ బోర్డును కర్నూలులోనే ఏర్పాటు చేయాలని, అలాగే తుంగభద్ర, వేదావతి నదులపై సాగునీటి ప్రాజెక్టులను నిర్మించేందుకు సహకరించాలని ఎంపీ బుట్టా రేణుక విజ్ఞప్తి చేశారు. -
గీత దాటితే వేటు
సాక్షి పతినిధి, కర్నూలు: అధికార పగ్గాలు చేపట్టక మునుపే ఇచ్చిన హామీలను అమలు చేయలేక అడ్డదారులకు తెరతీసిన టీడీపీ వ్యూహం బెడిసికొట్టింది. హామీల అమలుపై ప్రజల పక్షాన పోరాడతామని బలమైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన హెచ్చరిక నేపథ్యంలో ఆ పార్టీలో ప్రకంపన మొదలైంది. ఆలోగా పార్టీని బలహీనపర్చే ఉద్దేశంతో తమ్ముళ్లు సాగించిన కుట్రలు ఫలించలేదు. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం వైఎస్ఆర్సీపీకి గుర్తింపునిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో టీడీపీ శ్రేణులను నిరాశకు గురిచేసింది. టీడీపీ ప్రలోభాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ గుర్తుపై గెలిచిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవడం తెలిసిందే. అదేవిధంగా కర్నూలు ఎంపీ బుట్టా రేణుక భర్త నీలకంఠంను జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు ‘మీ వ్యాపారాలు బాగుపడాలంటే టీడీపీలో చేరాలని.. మీరు చేరితేనే మాకు రాజకీయంగా బాబు వద్ద బలం పెరుగుతుంది’ అని ఒత్తిడి చేసి బలవంతంగా పచ్చ కండువా కప్పించారు. అదేవిధంగా ఎంపీ బుట్టా రేణుకపైనా ఒత్తిడి తేవడంతో వైఎస్సార్సీపీలోనే కొనసాగుతూ.. టీడీపీ అనుబంధ సభ్యురాలిగా ఉంటానని ప్రకటించి తనకు ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం లేదని నిరూపించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కైనా.. వైఎస్సార్సీపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరే పోరాడి అధిక స్థానాలను సాధించి స్వల్ప తేడాతో అధికారానికి దూరమై బలమైన ప్రతిపక్షంగా నిలబడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రిజిష్టర్డ్ పార్టీ కావడంతో గుర్తింపు లేకపోవటంతో ఇదే అదనుగా భావించి తమ హామీలను అమలు చేయలేకపోతే ప్రశ్నించేందుకు ప్రతిపక్షమే లేకుండా చేయాలని బాబు కోటరీ చేసిన ప్రయత్నాలకు గండిపడింది. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులందరికీ విప్ జారీ చేస్తే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వేటుపడనుంది. తన వ్యాపార ప్రయోజనాల కోసం ప్రజాతీర్పును ఫణంగా పెట్టి పార్టీ మారిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డిపై మొదట వేటు పడనుంది. దీంతో నంద్యాల పార్లమెంట్‌కు ఉప ఎన్నిక తప్పదని న్యాయనిపులు స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా కర్నూలు ఎంపీ బుట్టా రేణుక చేరికపై స్పష్టత లేకపోయినప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది. తనకు అవగాహన లేకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఎంపీ బుట్టా రేణుక మదనపడుతున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఒకవేళ వేటుపడితే కర్నూలు పార్లమెంట్‌కూ ఉప ఎన్నిక తప్పదని తెలుస్తోంది. ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా సంతలో పశువులను కొనుగోలు చేసినట్లుగా అధికారం వచ్చిందనే కావరంతో టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతూ జెడ్పీటీసీ సభ్యులను తమవైపునకు తిప్పుకోవాలని చేసిన ప్రయత్నాలు సైతం ఫలించలేదు. వైఎస్సార్సీపీకి గుర్తింపు రావడంతో తమ్ముళ్లు డీలాపడ్డారు. టీడీపీకి ఉన్న జెడ్పీటీసీ సభ్యులు జారుకోకుండా జాగ్రత్త పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే టీడీపీలో కీలకమైన ఇద్దరు నేతలకు అనుచరులుగా కొనసాగుతున్న నలుగురు జెడ్పీటీసీ సభ్యులు తమకు ఆ పార్టీలో ప్రాధాన్యత లేదు.. మీ పార్టీలో చేరుతామంటూ సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కలిసి మద్దతు తెలియజేయటం గమనార్హం.