సాక్షి పతినిధి, కర్నూలు: అధికార పగ్గాలు చేపట్టక మునుపే ఇచ్చిన హామీలను అమలు చేయలేక అడ్డదారులకు తెరతీసిన టీడీపీ వ్యూహం బెడిసికొట్టింది. హామీల అమలుపై ప్రజల పక్షాన పోరాడతామని బలమైన ప్రతిపక్షంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన హెచ్చరిక నేపథ్యంలో ఆ పార్టీలో ప్రకంపన మొదలైంది. ఆలోగా పార్టీని బలహీనపర్చే ఉద్దేశంతో తమ్ముళ్లు సాగించిన కుట్రలు ఫలించలేదు. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం వైఎస్‌ఆర్‌సీపీకి గుర్తింపునిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో టీడీపీ శ్రేణులను నిరాశకు గురిచేసింది.
టీడీపీ ప్రలోభాల నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సీపీ గుర్తుపై గెలిచిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవడం తెలిసిందే. అదేవిధంగా కర్నూలు ఎంపీ బుట్టా రేణుక భర్త నీలకంఠంను జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు ‘మీ వ్యాపారాలు బాగుపడాలంటే టీడీపీలో చేరాలని.. మీరు చేరితేనే మాకు రాజకీయంగా బాబు వద్ద బలం పెరుగుతుంది’ అని ఒత్తిడి చేసి బలవంతంగా పచ్చ కండువా కప్పించారు. అదేవిధంగా ఎంపీ బుట్టా రేణుకపైనా ఒత్తిడి తేవడంతో వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతూ.. టీడీపీ అనుబంధ సభ్యురాలిగా ఉంటానని ప్రకటించి తనకు ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం లేదని నిరూపించుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కైనా.. వైఎస్సార్‌సీపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరే పోరాడి అధిక స్థానాలను సాధించి స్వల్ప తేడాతో అధికారానికి దూరమై బలమైన ప్రతిపక్షంగా నిలబడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రిజిష్టర్డ్ పార్టీ కావడంతో గుర్తింపు లేకపోవటంతో ఇదే అదనుగా భావించి తమ హామీలను అమలు చేయలేకపోతే ప్రశ్నించేందుకు ప్రతిపక్షమే లేకుండా చేయాలని బాబు కోటరీ చేసిన ప్రయత్నాలకు గండిపడింది. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులందరికీ విప్ జారీ చేస్తే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వేటుపడనుంది.
తన వ్యాపార ప్రయోజనాల కోసం ప్రజాతీర్పును ఫణంగా పెట్టి పార్టీ మారిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డిపై మొదట వేటు పడనుంది. దీంతో నంద్యాల పార్లమెంట్‌కు ఉప ఎన్నిక తప్పదని న్యాయనిపులు స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా కర్నూలు ఎంపీ బుట్టా రేణుక చేరికపై స్పష్టత లేకపోయినప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది. తనకు అవగాహన లేకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఎంపీ బుట్టా రేణుక మదనపడుతున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఒకవేళ వేటుపడితే కర్నూలు పార్లమెంట్‌కూ ఉప ఎన్నిక తప్పదని తెలుస్తోంది.
ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా సంతలో పశువులను కొనుగోలు చేసినట్లుగా అధికారం వచ్చిందనే కావరంతో టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతూ జెడ్పీటీసీ సభ్యులను తమవైపునకు తిప్పుకోవాలని చేసిన ప్రయత్నాలు సైతం ఫలించలేదు. వైఎస్సార్‌సీపీకి గుర్తింపు రావడంతో తమ్ముళ్లు డీలాపడ్డారు. టీడీపీకి ఉన్న జెడ్పీటీసీ సభ్యులు జారుకోకుండా జాగ్రత్త పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే టీడీపీలో కీలకమైన ఇద్దరు నేతలకు అనుచరులుగా కొనసాగుతున్న నలుగురు జెడ్పీటీసీ సభ్యులు తమకు ఆ పార్టీలో ప్రాధాన్యత లేదు.. మీ పార్టీలో చేరుతామంటూ సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కలిసి మద్దతు తెలియజేయటం గమనార్హం.
గీత దాటితే వేటు
Published Tue, May 27 2014 12:49 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement