వ్యవసాయం తర్వాత చేనేత వృత్తికే ప్రాధాన్యత
► కలిసికట్టుగా ఉంటూ ముందుకెళ్లాలి
► కురుహీనశెట్టి సమాజాభివృద్ధికి కృషి చేస్తా
► కర్నూలు లోక్‌సభ సభ్యురాలు బుట్టా రేణుక
సాక్షి, బళ్లారి : భారత దేశంలో వ్యవసాయం తర్వాత చేనేత వృత్తికి ఎంతో ప్రాధాన్యత ఉందని కర్నూలు లోక్‌సభ సభ్యురాలు బుట్టా రేణుక పేర్కొన్నారు. ఆమె ఆదివారం బళ్లారి నగరంలోని రాఘవ కళామందిరంలో శ్రీనీలకంఠేశ్వర స్వామి ఆలయ 9వ వార్షికోత్సవ సందర్భంగా బళ్లారి నగర చేనేత కురుహీన శెట్టి సమాజ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. కురుహీన శెట్టి సమాజంలో పుట్టినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. అన్నం పెట్టే అన్నదాత చేసే వ్యవసాయం ఎంత గొప్ప పనో చేనేత పనికి కూడా అంతే ప్రాధాన్యత ఉందన్నారు. అన్నదాత రైతన్న అన్నం పెడితే చేనేతన్న మనిషికి కట్టుకునే బట్టలను తయారు చేస్తారని కొనియాడారు. అలాంటి కులంలో పుట్టిన మనందరం గర్వపడాల్సిన అవసరం ఉందన్నారు.
చేనేత సమాజాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. బళ్లారికి పిలిపించి తనకు పెద్ద ఎత్తున సన్మానం చేయడం మరిచిపోలేని రోజన్నారు. రెండు సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి రాకమునుపు తనకు రాజకీయాల గురించి ఏమి తెలియదని, అయితే లోక్‌సభ మెంబరు అయిన తర్వాత రాజకీయ అనుభవం నేర్చుకుని పది మందికి సాయపడాలనే తత్వం ఏర్పరుచుకున్నానని గుర్తు చేశారు. కలిసికట్టుగా ఉంటూ సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పాటునందించాలని పేర్కొన్నారు. మాజీ మంత్రి మల్లికార్జున నాగప్ప మాట్లాడుతూ భారత దేశంలో చేనేత కురుహీన శెట్టి సమాజానికి చెందిన మహిళ బుట్టా రేణుక ప్రప్రథమంగా లోక్‌సభ సభ్యురాలు అయ్యారని కొనియాడారు. చేనేత వర్గాల అభివృద్ధికి అమె తన వంతు సహకారం అందిస్తాననడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తాము కొప్పళ జిల్లా గంగావతికి కూడా బుట్టా రేణుకను పిలిపించి సన్మానిస్తామన్నారు.
కాగా అంతకు ముందు బళ్లారి నగర కురుహీన శెట్టి చేనేత సమాజం ఆధ్వర్యంలో నగరంలోని శ్రీనీలకంఠేశ్వర దేవస్థాన ం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, బళ్లారి విధాన పరిషత్ సభ్యుడు కేసీ కొండయ్య, ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంలను కురుహీనశెట్టి సమాజ ప్రముఖులు ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో 1008 జగద్గురు శ్రీనీలకంఠేశ్వర పట్టాధార్య మహాస్వామీజీ, విధాన పరిషత్ సభ్యుడు కేసీ కొండయ్య, కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, కురుహీన శెట్టి సమాజ ప్రముఖులు బీ.నాగప్ప, మాచాని ప్రభాకర్, చంద్రశేఖర్, నీలకంఠప్ప, బళ్లారి జిల్లా కురుహీన శెట్టి సంఘం అధ్యక్షుడు దొడగట్ట శివప్ప, బళ్లారి జిల్లా చేనేత వర్గాల సమూహం అధ్యక్షుడు సీ.దేవానంద్, తరుణ సంఘం అధ్యక్షుడు తుక్కా రాజేష్ పాల్గొన్నారు.
రాజకీయ కుటుంబాన్ని ఓడించిన బుట్టా రేణుక
కర్నూలు జిల్లాలో 50 సంవత్సరాలుగా అపార రాజకీయ అనుభవం కలిగి ఎన్నో ఉన్నత పదవులను అలకంరించిన కుటుంబాన్ని ఓడించిన ఘనత చరిత్ర వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన లోక్‌సభ సభ్యురాలు బుట్టా రేణుకకు ఉందని కర్నూలు జిల్లా ఆలూరు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు.