ప్రిన్సిపాల్ వీర్రాజు
వడ్డించేవాడు మనోడైతే ఎక్కడ కూర్చుంటే ఏముందన్నట్టుగా ఈ ప్రిన్సిపాల్ వ్యవహారం తయారైంది. విద్యా సంస్థకు అధినేతగా ఉండి కూడా పలు అక్రమాలకు పాల్పడుతూ అప్పటి టీడీపీ నేతల అండతో చెలరేగిపోయాడు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడంతోనే ఈయన అరాచకాలకు చెక్ పడింది.
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ‘నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్కపెను తుపాన్‌కు నేలకూలిపోతుంద’నే సామెత రాజమహేంద్రవరం ప్రభుత్వజూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విషయంలో నిజమైంది. చంద్రబాబు ప్రభుత్వంలోరెండున్నరేళ్లు అవినీతి అక్రమాలతో చెలరేగిపోయిన ప్రిన్సిపాల్ కొత్తపల్లి వీర్రాజుపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు మంగళవారం ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ విషయం ముందస్తుగానే ఊహించిన నిందితుడు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోవడంతో సస్పెన్షన్ ఉత్తర్వులను ప్రిన్సిపాల్ ఇంటి గోడకు అతికించారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...అక్రమాలకు పాల్పడినా అధికార పార్టీ అండదండలుంటే తాత్కాలికంగా తప్పించుకోవచ్చు కానీ, నిరంతరం వ్యవస్థలను మేనేజ్ చేయడం అన్ని సమయాల్లో కలిసి రాదు. జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ కొత్తపల్లి వీర్రాజు మహిళా అధ్యాపకులపై వేధింపులు, విద్యార్థుల ఫీజులలో మోసాలు, యూనిఫారాల విక్రయాల్లో లొసుగులు, లక్షలు విలువైన రంగూన్ టేకు కలపను గుట్టుచప్పుడు కాకుండా విక్రయం...తదితర అక్రమాలపై ఫిర్యాదులు వచ్చినా అప్పటి టీడీపీ నేతల అండదండలతో వాటిని తొక్కిపెట్టేయడంతో బాధితులు కూడా మౌనం వహించారు. టీడీపీ హయాంలో మహిళా అధ్యాపకులు పోరాడుతున్నా ‘పచ్చ’ నేతల ప్రోద్బలంతో ప్రిన్సిపాల్ బయటపడుతూ వచ్చారు.
ఇక్కడ జరుగుతున్న అక్రమాలు, లోపాయికారీ వ్యవహారాలపై ‘సాక్షి’ దృష్టిపెట్టి గత నెలలో ‘వేధింపుల్లో ప్రిన్సిపాల్’, ‘ఈయనో ప్రిన్సిఫ్రాడ్’, ‘ప్రిన్సిపాల్‌పై సీరియస్’, ‘యథానేత...తథామేత’, ‘ఉచ్చు బిగుస్తోంది’ తదితర శీర్షికలతో ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించడంతో సంబంధితాధికారుల్లో కదలిక వచ్చింది. స్త్రీ,శిశు సంక్షేమ, విద్యాశాఖా మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురేష్‌లు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రిన్సిపాల్‌పై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా నియమితులైన ఇంటర్మీడియట్ బోర్డు రాజమహేంద్రవరం రీజనల్ జాయింట్ డైరక్టర్ నగేష్‌కుమార్ ప్రిన్సిపాల్ వీర్రాజుపై కాలేజీలోని సెమినార్ హాలులో నాలుగు గోడల మధ్య 14 అంశాలతో కూడిన ప్రశ్నావళిని అందజేసి చాలా గోప్యంగా విచారణ జరిపారు. దళిత సామాజికవర్గానికి చెందిన కాంట్రాక్ట్ అధ్యాపకురాలు ఉదయశాంతిపై ప్రిన్సిపాల్ వేధింపులకు పాల్పడ్డ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారని కక్షకట్టి ఆమెకు మద్దతుగా నిలిచిన మహిళా అధ్యాపకులను వేధించడం ప్రారంభించారు. ఈ క్రమంలో అధ్యాపకులంతా ఆర్‌జేడీ విచారణలో ప్రిన్సిపాల్ బాగోతాలను ఒక్కొక్కటిగా పూసగుచ్చినట్టు చెప్పుకున్నారు. ఓ వైపు వేధింపు ఫిర్యాదులపై విచారిస్తునే కాలేజీలో ఎస్సీ, బీసీ విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన ఫీజులు, రూ.500లుండే యూనిఫారాన్ని తన బినామీల ద్వారా కాలేజీ ఆవరణలోనే రూ.800 నుంచి రూ.900లకు అధిక ధరలకు విక్రయించడం, కాలేజీలో బ్రిటిష్ హయాంలో నిర్మించిన పాత అతిథి గృహానికి సంబంధించిన రూ.50 లక్షలు విలువైన రంగూన్ కలప అక్రమంగా అమ్మకాలు...వీటిలో ఏ ఒక్కదానికీ రికార్డులు లేకపోవడంపై విచారణ జరిపిన నగేష్ కుమార్ 10, 12 పేజీల సమగ్ర నివేదికలో ‘అవన్నీ వాస్తవాలే’నని తేల్చి ఆ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు జాయింట్ డైరక్టర్ అప్పలనాయుడుకు నివేదించారు. నివేదికను కొత్తగా వచ్చిన కమిషనర్ రామకృష్ణకు వెళ్లడంతో ప్రభుత్వం నుంచి ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. మొత్తం మీద మహిళా అధ్యాపకుల రెండున్నరేళ్ల పోరాటం ఎట్టకేలకు ప్రిన్సిపాల్ సస్పెన్షన్‌తో సుఖాంతమైంది.
Comments
Please login to add a commentAdd a comment