దొంగనోట్ల ముద్రణదారుల అరెస్టు
Published Sun, Jan 26 2014 3:24 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్: నకిలీ నోట్లు ముద్రించి చెలామణి చేస్తున్న ఇద్దరిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను శనివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీసీఎస్ సీఐ సోమశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం... విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చిన్నముషిడివాడకు చెందిన పరపతిరాంరెడ్డి ప్రింటింగ్ ప్రెస్‌తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. రియల్ ఎస్టేట్‌లో నష్టాల పాలై అప్పుల్లో కూరుకుపోయాడు. దీంతో ప్రింటింగ్‌లో తనకున్న నైపుణ్యాన్ని వినియోగించుకుని నకిలీ వెయ్యి రూపాయల నోట్లను ముద్రించడంప్రారంభించాడు. విశాఖపట్నం పెద్దవాల్తేరు మండలం ప్రశాంతినగర్ కాలనీకి చెందిన ఎన్నేటి సునీల్‌కుమార్ సహకారంతో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొంతమంది ద్వారా నకిలీ నోట్ల చెలామణి ప్రారంభించారు.
వాటిలో 20 వెయ్యి రూపాయల నోట్లను నరసన్నపేటకు చెందిన కుంచ శ్రీనివాసరావు గత ఏడాది అక్టోబర్‌లో శ్రీకాకుళం పట్టణంలోని ఎస్‌బీఐ బ్యాంకు నగదు డి పాజిట్ మెషిన్ ద్వారా డిపాజిట్ చేశాడు. దీంతో శ్రీనివాసరావుకు ఆ నోట్లు ఇచ్చిన కాకర్ల అనిల్‌కుమార్ సీసీఎస్ పోలీసులకు చిక్కాడు. వారిద్దరూ ఇచ్చిన సమాచారం ప్రకారం పలాసకు చెందిన అంబటి సంతోష్, ఇంజా విశ్వనాథం, మోహనరావును పోలీసులు అరెస్టు చేసి విచారణ జరిపారు. విశాఖపట్నం నుంచి సునీల్‌కుమార్ ద్వారా రాంరెడ్డి నోట్లను సరఫరాచేస్తున్నట్లు వెల్లడించారు. అప్పటి నుంచి వారిపై నిఘా వేసిన శ్రీకాకుళంలో పోలీసులు శ్రీకాకుళంలోని పీఎన్ కాలనీ కూడలి వద్ద అరెస్టు చేశారు. రాంరెడ్డివద్ద ఉన్న 25 నకిలీ వెయ్యి రూపాయల నోట్లను, సునీల్‌కుమార్ వద్ద ఐదు నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
కొన్నే సరఫరా చేశా
ఈ సందర్భంగా రాంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను రూ.5 లక్షల నోట్లు ముద్రించానని, వాటిలో కొన్ని సరఫరా చేసి మిగిలినవి కాల్చేశానని చెప్పాడు. సీసీఎస్ సీఐ సోమశేఖర్ మాట్లాడుతూ రాంరెడ్డిపై గతంలో విశాఖపట్నంలో రెండు కేసులు, విజయనగరంలో రెండు కేసులు నమోదై ఉన్నాయన్నారు. వీరిని పట్టుకున్న ఏఎస్సై కృష్ణారావు, హెచ్‌సీ శ్రీనివాసరావు, పీసీ గోవిందరాజుల కృషి అభినందనీయమన్నారు.
Advertisement
Advertisement