నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: ధనార్జనే ధ్యేయంగా దూరప్రాంతాలకు ప్రైవేటు బస్సులు నడుపుతున్న పలు సంస్థలు ప్రయాణికుల భద్రతను గాలికొదిలేశాయి. అరకొర అనుభవం ఉన్న సిబ్బందితో రాత్రి వేళలో వందలాది కిలోమీటర్ల దూరం బస్సులు నడుపుతూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. నిషేధిత వస్తువులను సైతం యథేచ్ఛగా రవాణా చేస్తూ నిబంధనలకు నీళ్లు వదిలేస్తున్నాయి. ఘోర ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా వారిలో మార్పు కరువైంది. ఏదేని ఘటన జరిగిన సమయంలో నాలుగు రోజుల పాటు తనిఖీల పేరుతో హడావుడి చేసే అధికారులు
అనంతరం మామూళ్ల మత్తులో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోరప్రమాదంలో 45 మంది సజీవదహనమైన నేపథ్యంలో ప్రైవేటు బస్సుల్లోని భద్రతాలోపం మరోసారి బయటపడింది. ఈ ప్రమాదంతో అందరిలో మరోసారి ఆందోళన మొదలైంది. జిల్లా వాసులు సైతం వివిధ ప్రాంతాలకు పయనించేందుకు ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు.
రైళ్లలో రిజర్వేషన్ దొరకడం కష్టమవుతుండటంతో అధిక చార్జీలు చెల్లించైనా ఈ బస్సుల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. నెల్లూరు నుంచి రోజూ హైదరాబాద్‌కు 40, బెంగళూరుకు 11 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇవిగాక విజయవాడ-బెంగళూరు, విశాఖపట్టణం-బెంగళూరు, చెన్నై- హైదరాబాద్, చెన్నై-విశాఖపట్టణం బస్సులు నెల్లూరు మీదుగా నడుస్తున్నాయి. వీటిలో నిత్యం మూడు వేల మంది వరకు రాకపోకలు సాగిస్తున్నారు. బస్సుల్లో పైపై సోకులు చేస్తున్న పలు ప్రైవేటు సంస్థలు ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. నెల్లూరులోని మినీబైపాసురోడ్డు, రైల్వేస్టేషన్ రోడ్డు ప్రైవేటు వాహనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.
భద్రతా ప్రమాణాలకు తిలోదకాలు
ప్రైవేటు బస్సుల నిర్వాహకులు భద్రతా ప్రమాణాలకు తిలోదకాలిస్తున్నారు. నిబంధనల ప్రకారం దూరప్రాంతాలు, ఘాట్‌రోడ్డుల్లో రాకపోకలు సాగించే బస్సుల్లో తప్పనిసరిగా ఇద్దరు డ్రైవర్లు ఉండాలి. 12 ఏళ్ల అనుభవం ఉన్న డ్రైవర్లతోనే బస్సులు నడపాలి. బస్సులు బయలుదేరే సమయంలో కచ్చితంగా బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్ష నిర్వహించారు. ఒక వేళ డ్రైవర్ మద్యం సేవించి ఉంటే విధుల్లోకి అనుమతించకూడదు. 24 గంటల పాటు బస్సులో గడిపిన డ్రైవర్‌కు తర్వాత రోజూ పూర్తిగా విశ్రాంతినివ్వాలి. అయితే ప్రస్తుతం ప్రైవేటు బస్సుల్లో పూర్తిగా భిన్నంగా జరుగుతోంది. అరకొర అనుభవం ఉన్న డ్రైవర్లతోనే దూరప్రాంతాలకు బస్సులు నడుపుతున్నారు. యజమానుల పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది సంపాదనే ధ్యేయంగా నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. రూ.200 సమర్పిస్తే బైక్‌లను సైతం బస్సులో రవాణా చేస్తున్నారు. అందులో పెట్రోలు ఉన్నా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు.
టూల్ బాక్సుల్లో లగేజీ రవాణా
కాసులకు కక్కుర్తిపడుతున్న ట్రావెల్ సంస్థల మేనేజర్లు, సిబ్బంది భారీగా లగేజీని ఓల్వో బస్సుల టూల్ బాక్సుల్లో రవాణా చేస్తున్నారు. వీటిలో నిషేధిత వస్తువులు ఉండటం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. ద్విచక్ర వాహనాలతో పాటు కెమికల్స్, టైర్లు, టూర్ ప్యాకేజీలకు వెళ్లినప్పుడు గ్యాస్ సిలిండర్లు, వంటసామగ్రిని అనుమతిస్తున్నారు. ఏదేని ప్రమాదం జరిగిన సమయంలో వీటి కారణంగా ప్రమాదతీవ్రత పెరుగుతోంది. అత్యవసర సమయాల్లో ఉండాల్సిన ప్రథమచికిత్స పెట్టె, ఫైర్ ఎగ్జ్వింషర్, అత్యవసర ద్వారా వద్ద ఉండాల్సిర రబ్బరు సుత్తులు ఏ బస్సులోనూ కనిపించవు.
లోపించిన పర్యవేక్షణ
ప్రైవేటు బస్సుల రాకపోకలపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. గతంలో షిరిడీకి వెళుతున్న ఓ బస్సు ప్రమాదానికి గురైన సమయంలో అధికారులు కొద్దిరోజుల పాటు హడావుడి చేశారు. అనంతరం తనిఖీలు మానేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అటు రవాణా శాఖాధికారులతో పాటు ఇటు పోలీసులు తనిఖీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూసి ప్రమాదాలను నిరోధించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
భద్రత డొల్లే!
Published Thu, Oct 31 2013 3:21 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement