
క్వార్టర్లలో సమస్యల తిష్ట
తాగునీటికి ఇక్కట్లు
కాలువల్లో పేరుకుపోయిన పూడిక
క్వార్టర్లపై కూలిన వృక్షాలను తొలగించని అధికారులు
గోపాలపట్నం : స్థానిక నార్త్ రైల్వే క్వార్టర్లలో పలు సమస్యలు తిష్ట వేశాయి. ఇక్కడ దాదాపు 300 కుటుంబాలకు వీలుగా క్వార్లర్లు నిర్మించారు. ఇక్కడ ప్రధానంగా కొన్నేళ్లుగా తాగునీటి సమస్య వేధిస్తోంది. ఇక్కడ స్థానిక బావి నుంచి ట్యాంకరుకి ఎక్కించి క్వార్టర్లకు నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే ఈ నీటిలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉండడంతో తాగేందుకు ఎవరూ సాహించడం లేదు. ఎక్కడో దూరానున్న జీవీఎంసీ కుళాయిల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. అంతదూరం వెళ్లలేని వారు ఆర్థిక భారమైనా సరే నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. పదేళ్ల క్రితం తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఉద్యోగులు ఆందోళన చేస్తే చాలామందిని ఉన్నతాధికారులు బదిలీ చేశారే తప్ప వారి సమస్యలు పరిష్కారం చేయలేదు.
అధ్వానంగా డ్రైనేజీ వ్యవస్థ
ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉంది. కాలువల్లో మురుగునీరు నిలిచిపోతుండడంతో దుర్వాసనను భరించలేకపోతున్నామని స్థానికులు వాపోతున్నారు. పైగా దోమలు విజృంభిస్తున్నాయి.
తొలగించని వృక్షాలు...
ఇక్కడ రెండునెలల క్రితం హుద్‌హుద్ తుపానుకి భారీ వృక్షాలు కూలాయి. వీటిని ఇంకా క్వార్టర్లపై నుంచి తొలగించకపోవడం, సదుపాయాలు లేక భరించలేక కొందరు ఇప్పటికే క్వార్టర్లు ఖాళీ చేసివెళ్లిపోయారు. ఇదిలావుండగా, ఇటీవల ఇక్కడ వనమహోత్సవం పేరిట జీవీఎంసీ అధికారులు గోతులు తవ్వించి చేతులుదులిపేసుకున్నారు. తర్వాత ఒక్కమొక్కయినా నాటలేదు.
శిథిలబడిలో చదువులు...
ఇక్కడ క్వార్టర్లు రైల్వేవయినా ఉద్యోగుల పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నిర్వహిస్తోంది. ఇక్కడ భవనం శిధిలావస్థకు చేరింది. గోడలు ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి. విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పైగా ఇక్కడ విద్యుత్తు సదుపాయం లేకపోవడం, ఇటీవల తరగతి గదుల కిటికీలను కొందరు ఆకతాయిలు ధ్వంసం చేయడంతో మధ్యాహ్న భోజన పథకం సామగ్రి చోరుల పాలైందని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే గణబాబు, అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.