ఖేల్ ఖతమ్! | Promotion of sports that do not match | Sakshi
Sakshi News home page

ఖేల్ ఖతమ్!

Published Tue, Mar 8 2016 12:50 AM | Last Updated on Sun, Sep 3 2017 7:12 PM

ఖేల్ ఖతమ్!

ఖేల్ ఖతమ్!

ప్రోత్సాహం లేని పైకా క్రీడలు
కేవలం 11 మండలాల్లోనే అమలు
నిధులున్నా ప్రయోజనం శూన్యం
అటకెక్కిన కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం
 

మచిలీపట్నం : గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహించి వారిని అత్యుత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ఏర్పాటుచేసిన రాజీవ్‌గాంధీ ఖేల్ అభియాన్ కార్యక్రమం జిల్లాలో అంతంతమాత్రంగానే అమలవుతోంది. ఏటా ఆగస్టులో ప్రారంభమై జనవరితో ముగిసే పైకా క్రీడల పోటీల నిర్వహణ ఆశించిన స్థాయిలో జరగడం లేదని క్రీడాకారులంటున్నారు. జిల్లా స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ, పీఈటీల మధ్య సమన్వయం కొరవడడంతో క్రీడాకారులను వెలికితీసే కార్యక్రమం ముందడుగు వేయని పరిస్థితి నెలకొంది. రాజీవ్‌గాంధీ ఖేల్ అభియాన్ కార్యక్రమం జిల్లాలోని 11 మండలాల్లోని 129 పంచాయతీల్లో అమలుచేస్తున్నారు. యూపీఏ ప్రభుత్వం రూపొందించిన ఈ కార్యక్రమం కింద ఒక్కొక్క పంచాయతీకి రూ. 10 వేల  నిధులు విడుదల చేయాల్సి ఉంది.  ఆటస్థలం లేదని, పీఈటీలు లేరనే కారణం చూపి క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వని పరిస్థితి ఏర్పడింది.క్రీడాపరికరాలకు సంబంధించి బ్రాండెడ్ కంపెనీ  పరికరాలు పంపిణీ  చేసినా అవి పాఠశాలల్లో అటక దిగని పరిస్థితి నెలకొంది. సర్వశిక్షాభియాన్ ద్వారా ఈ పంచాయతీలకు నిధులు విడుదలవుతున్నా ఎక్కడ ఖర్చు చేస్తున్నారో, ఎలాంటి క్రీడలు నిర్వహిస్తున్నారో తెలియని పరిస్థితి ఉంది.

పది క్రీడాంశాలు....
రాజీవ్‌గాందీ ఖేల్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 16 సంవత్సరాల్లోపు క్రీడాకారులను గుర్తించి వారికి సరైన శిక్షణ ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం పాఠశాలలతో పాటు వివిధ క్రీడల్లో నిష్ణాతులుగా ఉన్న వారికి శిక్షణ ఇవ్వాల్సి ఉంది. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, హాకీ, ఫుట్‌బాల్ వంటి క్రీడలతో పాటు బాక్సింగ్, ఆర్చరీ, తైక్వాండో, వెయిట్‌లిఫ్టింగ్, ఇతర అథ్లెటిక్స్ విభాగాల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉంది. క్రీడలకు సంబంధించిన పరికరాలను కొనుగోలు చేయాలి. ఒక్కొక్క పంచాయతీ నుంచి 15 మంది లేదా మండలస్థాయిలో 30 నుంచి 50 మంది మెరికల్లాంటి క్రీడాకారులను ప్రోత్సాహించాలి. అయితే ఇది ఎక్కడా అమలుచేయడం లేదనే విమర్శలొస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 9 నుంచి 12వ తేదీ వరకు గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్రస్థాయి పైకా పోటీలను నిర్వహించారు.
 
ఇండోర్, అవుట్‌డోర్ స్టేడియాల నిర్మాణానికి ప్రతిపాదనలు ....
జిల్లాలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు 11 మండలాలను ఎంపిక చేశారు. ఒక్కొక్క మండలంలో ఆరు నుంచి ఏడు ఎకరాల భూమి కేటాయిస్తే ఇండోర్, అవుట్‌డోర్ స్టేడియాలు నిర్మించాల్సి ఉంది. ఇండోర్ స్టేడియానికి రూ. 80 లక్షలు, అవుట్‌డోర్ స్టేడియంకు రూ. 80 లక్షలతో పాటు మరో 15 లక్షల విలువైన క్రీడా పరికరాలను రాజీవ్‌గాంధీ ఖేల్ అభియాన్ పథకం ద్వారా కేటాయించే ప్రతిపాదన ఉంది. జిల్లాలోని 11 మండలాల నుంచి ఈ ప్రతిపాదనలను పంపారు. వీటికి అనుమతులు వస్తే ఒక్కొక్క స్టేడియంలో ముగ్గురు పీఈటీలను ప్రత్యేకంగా నియమించి వివిధ విభాగాల క్రీడాకారులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంది.
 
సద్వినియోగం చేసుకోవాలి
కేంద్రం ప్రవేశపెట్టిన పథకం ఉద్దేశం బాగానే ఉన్నా ఈ ఫలాలు క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా లేని పరిస్థితి. కొన్ని పాఠశాలల్లో పీఈటీలు లేరు. ఇలాంటి చోట్ల స్థాని కంగా ఉన్న క్రీడాకారులను విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా నియమించాల్సిన అవసరం ఉందని క్రీడానిపుణులు చెబుతున్నారు.  పైకా క్రీడలకు సంబంధించిన అధికారులు, పీఈటీలు సమన్వయంతో పనిచేస్తే గ్రామస్థాయిలో ఉన్న క్రీడాకారులకు ప్రోత్సాహం అందించినట్లుగా ఉంటుందని పలువురు క్రీడాకారుల అభిప్రాయంగా ఉంది. గ్రామీణ స్థాయిలో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పీఈటీల సహకారం తీసుకుంటున్నట్లు డీఎస్‌డీవో రామకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement