- 25 నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు
- కూచిపూడి, మంగినపూడి, భవానీద్వీపంలలో ప్రదర్శనలు
- సబ్ కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడి
విజయవాడ : పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు జిల్లా వ్యాప్తంగా మూడురోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సబ్ కలెక్టర్, జిల్లా పర్యాటక శాఖ అధికారిణి ఎస్.నాగలక్ష్మి తెలిపారు. ఆమె శుక్రవారం తన కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 25 నుంచి మూడురోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
25న మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలో ప్రఖ్యాతి గాంచిన కూచిపూడి నాట్య ప్రదర్శనలు, జిల్లాలోని అన్ని పర్యాటక కేంద్రాల్లో పర్యాటక రంగంపై అవగాహన కల్పించే ప్రచార బ్యానర్లు, బెలూన్ల ప్రదర్శనలు, మంగినపూడి బీచ్‌లో పర్యాటకుల కోసం కనీస సౌకర్యాలు కల్పించి భవన ప్రారంభోత్సవం, కోలాట మహోత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 26న ఇబ్రహీంపట్నం, కొండపల్లి బొమ్మల తయారీ కాలనీలో కొండపల్లి బొమ్మల తయారీ ప్రదర్శన ఏర్పాటు చేస్తామన్నారు.
విజయవాడ, మచిలీపట్నంలలో పోస్టర్ పెయింటింగ్ పోటీలు, భవానీ ద్వీపం, మంగినపూడి బీచ్‌లలో ప్రత్యేక ప్రదర్శనలు ఉంటాయని వివరించారు. 27న భవానీ ద్వీపంలో డప్పుల విన్యాసం, సాంస్కృతిక ప్రదర్శనలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు, హరిదాసుల సాంస్కృతిక కార్యక్రమాలు, గంగిరెద్దుల విన్యాసాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు విజయవాడ బందరు రోడ్డులోని హోటల్ డీవీ మేనర్ వద్ద నుంచి హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థులతో పర్యాటక నడక, పరుగు ఉంటాయన్నారు.
అనంతరం ముగింపు కార్యక్రమంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు, సర్టిఫికెట్లు అందజేస్తామని సబ్ కలెక్టర్ తెలిపారు. సమావేశంలో డీపీఆర్‌వో కె.సదారావు, డివిజనల్ టూరిజం మేనేజర్ బాపూజీ, డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ టీఎస్ బాబు, సహాయ టూరిజం అధికారి జి.రామలక్ష్మణరావు, హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పట్టాభి పాల్గొన్నారు.