పథకం రద్దయినా ప్రమోషన్లు  | Promotions to Canceled scheme Saakshar Bharat | Sakshi
Sakshi News home page

పథకం రద్దయినా ప్రమోషన్లు 

Published Tue, Jun 4 2019 5:16 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 AM

Promotions to Canceled scheme Saakshar Bharat - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల్లో లబ్దిపొందేందుకు చంద్రబాబు ప్రభుత్వం అన్ని రకాల అడ్డదారులూ తొక్కింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమైపోతే నాకేంటి... అన్న చందంగా అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంది. అవసరంలేని ఉద్యోగాలకు డెప్యుటేషన్‌పై పంపడమే కాదు.. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి మరీ వారికి పదోన్నతులు కల్పించింది. ఏడాదికి పైగా వారిని కూర్చోపెట్టి కోట్లాది రూపాయల జీతాలను చెల్లించింది.  

అవసరం లేకున్నా కొలువులు... 
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయాలన్న లక్ష్యంతో సాక్షర భారత్‌ 2010 సెప్టెంబర్‌లో ప్రారంభమై 2018 మార్చిలో నిలిచిపోయింది. దీనిద్వారా విద్యా బోధనకు రాష్ట్ర వ్యాప్తంగా 20,061 మంది మండల, విలేజి కో–ఆర్డినేటర్లు ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమం ఆగిపోవడంతో వీరందరినీ ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాక్షర భారత్‌ కార్యక్రమం పర్యవేక్షణకు డెప్యుటేషన్‌పై ఉపాధ్యాయులను సూపర్‌వైజర్లుగా నియమిస్తారు. సాక్షర భారత్‌ నిలిచిపోవడంతో మండల, విలేజి కో–ఆర్డినేటర్ల మాదిరిగానే ఈ సూపర్‌వైజర్ల అవసరం కూడా లేకుండాపోయింది. దీంతో వీరిని వారి మాతృసంస్థకు పంపేయాల్సి ఉంది. అలా చేయకపోగా అదనంగా సూపర్‌వైజర్లను నియమించారు.

ప్రాజెక్టు నిలిచిపోయిన నాటికి రాష్ట్రంలో సూపర్‌వైజర్లు, ఏపీవోలు, పీవోలు, అసిస్టెంట్‌ డైరెక్టర్లు మొత్తం 166 మంది ఉన్నారు. వీరిలో 46 మంది సూపర్‌వైజర్లున్నారు. మిగిలిన వారు వయోజన విద్యాశాఖ నుంచి వచ్చిన వారు. తాజాగా మరో 13 మందిని కొత్తగా తీసుకున్నారు. ఈ 46 మందిలో చిత్తూరు జిల్లాలో 12 మంది, అనంతపురం జిల్లాలో 14, నెల్లూరు జిల్లానుంచి 10మంది ఉన్నారు. ఈ సూపర్‌వైజర్లకు అనతికాలంలోనే ఏపీవోలు, పీవోలు, ఏడీలుగా అడ్డదారిలో పదోన్నతులూ కల్పించారు. ఇటీవల ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా ఈ పదోన్నతులివ్వడం విశేషం! ఇలా ఈ 166 మందికి గడచిన 14 నెలలుగా సాక్షర భారత్‌ లేకపోయినా కూర్చోబెట్టి చంద్రబాబు ప్రభుత్వం రూ.14.72 కోట్లు జీతాల రూపంలో చెల్లించింది. ఈ వ్యవహారంలో త్వరలో పదవీ విరమణ చేయనున్న వయోజన విద్య రాష్ట్ర డైరెక్టర్‌ పాత్ర ఉందని చెబుతున్నారు.  

కాలక్షేపం ఉద్యోగాలు... 
సాక్షర భారత్‌ సూపర్‌వైజర్‌ పోస్టుల్లోకి డెప్యుటేషన్‌పై వెళ్లడానికి ఉపాధ్యాయులు ఉబలాటపడటానికి కారణాలున్నాయి. బడిలో రోజూ పాఠాలు చెప్పే పనుండదు. డివిజన్‌ స్థాయిలో ఒకరిద్దరు మాత్రమే ఉంటారు. జిల్లాస్థాయి ఉన్నతాధికారులతో సమీక్షల్లో పాల్గొనడంతో పాటు నెలకు పర్యటనలు పేరిట రూ.10 వేల వరకు జీతానికి అదనంగా వస్తుండడంతో ఈ పోస్టులకు ఆసక్తి చూపుతారు.  

ఎన్నికల ఎత్తుగడ... 
తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల వేళ మండల, విలేజి కోఆర్డినేటర్లు, ఆ కుటుంబాల ఓట్ల కోసం గాలం వేసింది. తొలగించిన 20,061 మందిని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చింది. వారిలో నమ్మకం కుదర్చడానికి అవసరం లేకపోయినా మండల కోఆర్డినేటర్లకు శిక్షణ ఇచ్చేందుకు రెండు నామమాత్రపు మెమోలు (600/బి2/డిఏఈ/2017ఃతేది 3.4.19, 15.4.19) కూడా జారీ చేసింది. శిక్షణకయ్యే ఖర్చు మొత్తాన్ని జిల్లా సాక్షరత సమితి నిధుల నుంచి విడుదల చేయాలని ఆయా కలెక్టర్లకు సూచించింది. కొన్ని జిల్లాల కలెక్టర్లు నిధులు విడుదల చేసినా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల కలెక్టర్లు ఇది ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తుందంటూ తిరస్కరించారు. మిగిలిన జిల్లాల్లో కోట్లాది రూపాయలు అవసరం లేకున్నా కట్టబెట్టారు.  

వెలుగులోకి వచ్చిందిలా... 
ఈ వ్యవహారాన్ని ఆర్టీఐ యాక్ట్‌ అండ్‌ కన్సూ్మర్‌ అఫైర్స్‌ స్టేట్‌ రిసోర్స్‌ పర్సన్‌ కాండ్రేగుల వెంకటరమణ సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి తెచ్చారు. న్యాయ విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, బదిలీలు, పదోన్నతులను రద్దు చేయాలని, పర్యవేక్షకులను వారి మాతృ సంస్థలకు పంపాలని, ఖాళీగా ఉన్న వయోజన విద్యాశాఖ ఉద్యోగుల సేవలను ఇతర శాఖలకు ఉపయోగించాలని వెంకటరమణ కోరుతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితరులకు ఫిర్యాదు చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement