సాక్షి, కర్నూలు: పురపాలక సంఘాల్లో ఆన్‌లైన్ ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. కార్యాలయాలకు వెళ్లి క్యూలలో నిల్చోవాల్సిన అవసరం లేకుండా ఈ ప్రక్రియ రూపుదిద్దుకుంది. మొదట ఆస్తి పన్ను చెల్లింపునకు అవకాశం కల్పించినా.. త్వరలోనే తాగునీటి బిల్లులనూ ఆన్‌లైన్ పరిధిలోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. తద్వారా సేవలు సులభతరం కానుండగా.. సిబ్బంది చేతివాటానికీ తెరపడనుంది. నూతన విధానాన్ని పురపాలక శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి గత శనివారం నాంది పలకగా.. జిల్లాలోనూ అదే రోజు నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. జిల్లాలో కర్నూలు కార్పొరేషన్‌తో పాటు డోన్, ఎమ్మిగనూరు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, నందికొట్కూరు పురపాలక సంఘాలు ఉన్నాయి.
నివాస, వాణిజ్య భవనాల నుంచి ఆస్తి పన్ను రూపంలో కర్నూలులో రూ.28 కోట్లు, నంద్యాలలో రూ.7 కోట్లు, ఆదోనిలో రూ.3.5 కోట్లు, ఎమ్మిగనూరులో రూ.1.48 కోట్లు, డోన్‌లో రూ.81.52 లక్షలు, నందికొట్కూరులో రూ.45 లక్షలు, ఆళ్లగడ్డలో రూ.44 లక్షల దాకా వసూలు కావాల్సి ఉంది. పన్నులను ఆరు నెలలకోసారి చెల్లించాల్సి ఉండగా.. ప్రజలు సకాలంలో స్పందించకపోవడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. అదేవిధంగా కార్యాలయాల వద్దకు వెళ్లి చెల్లించడం కష్టతరమవుతోంది. మొండి బకాయిల కోసం బిల్ కలెక్టర్లు వీటి కోసం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నా ప్రయోజనం లేకపోతోంది. ఈ నేపథ్యంలో అందుబాటులోకి వచ్చిన ఆన్‌లైన్ సౌకర్యంతో పన్నుల చెల్లింపు మెరగయ్యే అవకాశం ఉంటుందని పురపాలక శాఖ ప్రాంతీయ సంచాలకులు పీవీవీఎస్ మూర్తి తెలిపారు. పన్నులను www.cdma.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెల్లించాల్సి ఉంది. అసెస్‌మెంట్ నంబర్‌ను యజమాని పేరు, ఇంటి నంబర్ నమోదుతో తెలుసుకునే వీలు కల్పించారు.
ఇదే సమయంలో ఇంటింటికి వెళ్లి పన్ను వసూలు చేసేందుకు వీలుగా పురపాలక సంఘాలకు అవసరమైన హ్యండ్ మిషన్లను యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు సమకూర్చనున్నాయి. ఆన్‌లైన్‌లో డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా పన్ను చెల్లిస్తే 0.65 శాతం, ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా అయితే రూ. 3 చొప్పున రుసుము వసూలు చేయనున్నారు. ఇదిలాఉండగా పురపాలక సంఘాల సంస్కరణ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పురపాలక సంఘాలు, కార్పొరేషన్లలో మూడున్నరేళ్లుగా ప్రత్యేక పాలన సాగుతోంది. ఫలితంగా కర్నూలు కార్పొరేషన్‌తో పాటు మిగిలిన మున్సిపాలిటీల్లో మౌలిక వసతులు మృగ్యమయ్యా యి. మరోవైపు బాకాయిలు పేరుకుపోతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం పన్నుల వసూలును వేగవంతం చేసేందుకు నిర్ణయించింది. అందులో భాగంగానే ఆన్‌లైన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.