
మునిగిన పంటల్ని కాపాడుకోండిలా
గోదావరి వరద లంక భూముల్లోని పంటలతోపాటు నదీ పరివాహక ప్రాంతాల్లోని వివిధ పంటలను ముంచెత్తింది. ముంపు తగ్గటంతో తోటల్లో ఒండ్రు మట్టి, ఇసుక మేటలు వేశారుు. మరోవైపు పంటలు దెబ్బతిన్నారుు. ఈ పరిస్థితుల్లో పంటల్ని ఎలా కాపాడుకోవాలనే విషయూలను కొవ్వూరులోని వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ బీవీకే భగవాన్ ఇలా వివరించారు.
కొవ్వూరు : ముంపు బారిన పడిన ఉద్యాన పంటలను కాపాడుకునేందుకు రైతులు వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కంద తోటలో 24 గంటల కంటే ఎక్కువ సమయం నీరు నిల్వ ఉంటే దుంప కుళ్లే ప్రమాదం ఉంటుంది. ఈ దృష్ట్యా భూమిలోని కందను వెంటనే తవ్వి తీసుకోవడం మంచిది. మొక్కలపై బురద పేరుకుపోరుు ఉంటే మంచినీటిని స్ప్రే చేయాలి.
అరటి తోటల్లో ఈ జాగ్రత్తలు తీసుకోండి
24గంటలపాటు నీటి ముంపులో ఉండిపోరుున అరటి తోటల్లో 19-19-19 కాంప్లెక్స్ ఎరువును లీటరు నీటికి ఐదు గ్రాముల చొప్పున కలిపి అరటి మొక్క అంతా తడిచేలా పిచికారీ చేయాలి. ఈ ద్రావణంలో 0.5 మిల్లీ గ్రాముల జిగురు మందును కలపాలి.
24 గంటల కంటే ఎక్కువ సమయం నీరు నిల్వ ఉన్న అరటి తోటలకు బోర్డో మిశ్రమాన్ని ఒక శాతం గాని, కాపర్ ఆక్సీక్లోరైడ్‌ను మూడు గ్రాముల చొప్పున గాని లీటరు నీటిలో కలిపి మొక్క మొదళ్లలో వేర్లలోకి ఇంకిపోయేలా పోయూలి. ఆ తరువాత 19-19-19 ఎరువును పైన చెప్పిన విధంగా నీటిలో కలిపి ఆకులు తడిచేలా పిచికారీ చేసుకోవాలి.
పైన పేర్కొన్న విధంగా మందును పిచికారీ చేసిన వారం పది రోజుల వ్యవధిలో 13-0-45 (పొటాషియం నైట్రేట్) మందును లీటరు నీటికి ఐదు గ్రాముల చొప్పున జిగురు మందుతో కలిపి మొక్క అంతా తడిచేలా పిచి కారీ చేసుకోవాలి. ఇలా వారం పదిరోజుల వ్యవధిలో మూడునుంచి నాలుగుసార్లు పిచికారీ చేయూలి.
మూడు నెలలకన్నా తక్కువ వయసున్న అరటి మొక్కలు మూడు అడుగుల పైబడి నీటిలో మునిగి ఉంటే.. నేల ఆరిన తరువాత తిరిగి మొక్కల్ని నాటుకోవడం మంచిది. సగం తయారైన (75 శాతం పక్వానికి వచ్చిన) గెలలను ఎండిన ఆకులతో కప్పి 15 రోజుల్లోపు కోసి మార్కెట్‌కు తరలించడం మంచిది.
కూర, కంద, పూల తోటల్లో...
తక్కువ సమయం నీటిలో మునిగిన కూరగాయ, కంద, పూల తోటల్లో మొదటి విడతగా 19-19-19 మందును లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కలుపుకుని పిచికారీ చేయాలి. వారం వ్యవధిలో 13-0-45 మందును లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పడిపోయిన మొక్కలను నిలబెట్టి మొదలు దగ్గర మట్టిని ఎగదోయాలి. కొత్తగా విత్తిన కూరగాయ తోటలైతే.. వాటిని పూర్తిగా తొలగించి మరలా నాటుకోవడం మంచిది.