సీమాంధ్రలో ఆగ్రహ జ్వాల
మిన్నంటిన ఆందోళనలు
ఎక్కడికక్కడ బిల్లు ప్రతుల దహనాలు
సాక్షి నెట్‌వర్క్: తెలంగాణ బిల్లు అసెంబ్లీకి చేరిన నేపథ్యంలో సీమాంధ్ర జిల్లాల్లో సమైక్య ఆందోళనలు మిన్నంటాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఎక్కడికక్కడ టీ బిల్లు ప్రతులను దహనం చేశారు. అనంతపురంలోని టవర్ క్లాక్ సర్కిల్‌లో, విజయవాడలో తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను దహనం చేశారు. కైకలూరులో పార్టీ కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. విభజన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా తిరుచానూరు సమీపంలోని బైపాస్‌రోడ్డులో రాస్తారోకో చేపట్టారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలపై తెలంగాణకు ప్రాంత ఎమ్మెల్యేలు దాడి చేయడాన్ని ఖండిస్తూ సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక జిల్లా ప్రతినిధులు శ్రీకాకుళంలో మానవహారం నిర్వహించారు. పట్టణంలోని కేంద్రమంత్రి కిల్లి కృపారాణి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. వైఎస్సార్ కూడలిలో తెలంగాణ బిల్లు నమూనా ప్రతులను దగ్ధం చేశారు. టీబిల్లు అసెంబ్లీకి వచ్చిన కీలక తరుణంలో సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు సభకు డుమ్మా కొట్టడంపై సమైక్యవాదులు మండిపడ్డారు.అనంతపురంలో ఎస్కేయూ విద్యార్థి, ఉద్యోగ జేఏసీ నేతలు రహదారిని దిగ్బంధించారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ప్రతినిధులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. విజయవాడలో సమైక్యాంధ్ర విద్యార్ది జేఏసీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించారు.
సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద ఎన్జీవోలు, కోర్టుల వద్ద సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో టీ నోట్‌ను దహనం చేశారు. అవనిగడ్డలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. గుడివాడలో రోడ్లపై టైర్లను తగులబెట్టారు. నూజివీడులో సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మైలవరం బోసుబొమ్మసెంటర్‌లో జేఏసీ ఆధ్వర్యంలో బిల్లు ప్రతిని తగలబెట్టారు. కాంగ్రెస్ అధిష్టానంతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చీకటి ఒప్పందం చేసుకుని డ్రామాలాడుతున్నారని సమైక్యాంద్ర విద్యార్థి జేఏసీ ఆరోపించింది. విశాఖ ఏయూ గ్రంధాలయం వద్ద కిరణ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యార్థి యువజన జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఆరేటి మహేష్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు వత్తాసు పాడే విధంగా కిరణ్ వ్యవహరిస్తున్నారన్నారు. అసెంబ్లీలో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టే సమయంలో అనారోగ్య కారణాలతో ముఖ్యమంత్రి గైర్హాజరు కావడం ముమ్మాటికీ బూటకమన్నారు.
నేడు, రేపు విద్యాసంస్థలు బంద్
తెలంగాణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టినందుకు నిరసనగా మంగళ, బుధవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డీవీ కృష్ణయాదవ్ ప్రకటించారు. ఈ మేరకు నెల్లూరులో ఆయన ఒక ప్రకటన చేశారు. తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా సీమాంధ్రలో 14 యూనివర్సిటీల పరిధిలోగల అన్ని యాజమాన్యాల విద్యాసంస్థలు బంద్‌లో పాల్గొని సమైక్యవాదాన్ని చాటి చెప్పాలని కోరారు.