మహా రణసభ | protests, dharna attudikina govada | Sakshi
Sakshi News home page

మహా రణసభ

Published Thu, Oct 1 2015 12:41 AM | Last Updated on Sun, Sep 3 2017 10:15 AM

మహా రణసభ

మహా రణసభ

నిరసనలు, ధర్నాలతో  అట్టుడికిన గోవాడ
వేదికపైకి కుర్చీలు విసిరిన రైతులు
మహాజన సభలో తీవ్ర ఉద్రిక్తత
 

చోడవరం: గోవాడ చక్కెరమిల్లు మహాజన సభ బుధవారం రణరంగమైంది. నిరసనలు,ధర్నాలు, రాస్తారోకోలు, అరెస్టులు, లాఠీ ఛార్జీలతో అట్టుడికిపోయింది. నెలరోజులుగా రైతుల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న నిరసన ఒక్కసారిగా పెల్లుబికింది. మునుపెన్నడూలేని విధంగా చెరకు రైతుల మహాజనసభ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. తమకు జీవనాధారమైన సుగర్ ఫ్యాక్టరీని అధికార టీడీపీ నాయకులు దోచుకుతింటున్నారంటూ అన్నదాతలు ఊగిపోయారు. భోజనాలు ముగిశాక రైతులంతా సమావేశం ప్రాంగణంలో ప్రశాంతంగా కూర్చున్నారు. చెరకు సరఫరా చేసిన రైతులకు చెల్లింపులు పూర్తిచేశామంటూ ఫ్యాక్టరీ చైర్మన్  చైర్మన్ మల్లునాయుడు మాట్లాడగానే రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మహాజన సభ రసాభాసగా మారిపోయింది. అబద్ధాలు చెప్పి రైతులను మోసం చేస్తే ఊరుకోమంటూ హెచ్చరించారు.  కోట్ల రూపాయలు పందికొక్కుల్లా దోచుకున్నారని, వెంటనే చైర్మన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు.  చైర్మన్ పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని కొనసాగించడంతో రైతులు  కుర్చీలను వేదిక పైకి విసిరారు. స్పెషల్  పోలీసులు  వేదికపై ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పాలకవర్గ సభ్యులకు రక్షణ కల్పించారు.

అప్పటికీ శాంతించని రైతులు నాయకులంతా వేదిక దిగేవరకు కుర్చీలు, చెప్పులు, రాళ్లు విసిరి తమ నిరసన తెలిపారు. ఈ క్రమంలో  పోలీసులపై కూడా రైతులు కుర్చీలు విసిరారు. ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. దొరికినవారిని దొరికినట్టుగా రైతులకు చితక బాదారు. కొట్టొద్దంటూ కాళ్లావేళ్లా పడినా పట్టించుకోలేదు. లాఠీ దెబ్బలకు రైతులు పరుగులు తీయడంతో భయానక వాతావరణం నెలకొంది.

 చైర్మన్‌ను నిలదీసిన బలిరెడ్డి: వేదికపైకి వచ్చిన మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావును సైతం పోలీసులు అడ్డుకోవడంతో శాంతిమూర్తి అయిన ఆయన కూడా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది రైతు సభా? పోలీసుల సభా?అంటూ చైర్మన్ చేతిలోని మైకు లాక్కొని సభకు పోలీసు బందోబస్తు ఎందుకు పెట్టారంటూ చైర్మన్‌ను ప్రశ్నించారు. వేలాదిగా సభ్య రైతులు రావడంతో సభాప్రాంగణం కిక్కిరిసిపోయింది. చాలామంది బయటే ఉండిపోయారు. అడుగడునా పోలీసులు పహారాతో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వేదికపై చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు కెఎస్‌ఎన్‌ఎస్ రాజు, బూడిముత్యాలనాయుడు, మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతోపాటు పాలకవర్గ సభ్యులు ఎవరూ ప్రసంగించకుండానే సభ ముగిసిపోయింది. ఇటువంటి సంఘటన ఫ్యాక్టరీ చరిత్రలోనే మొదటిసారని సీనియర్ రైతులు అంటున్నారు.  

  వైఎస్సార్‌సీపీ, అఖిలపక్షాల ఆందోళన: సభ జరగకుండా పోలీసులను, కొందరు సభ్యులు కానివారిని లోపలికి ముందస్తుగా రప్పించారని, ఫ్యాక్టరీలో చోటుచేసుకున్న లోపాలను నిలదీసిన రైతులను లాఠీలతో కొట్టించారంటూ వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, వామపక్షాలు, రైతు సంఘాలు బిఎన్‌రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశాయి. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఫ్యాక్టరీ వద్ద రైతులకు మద్దతుగా ఆందోళన చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు అరెస్టును నిరశిస్తూ చోడవరం పోలీసు స్టేషన్ వద్ద అఖిలపక్షాల నాయకులు, రైతులు ధర్నాకు దిగారు.

 ఇది అధికార పార్టీ కుట్ర: రైతులకు మద్దతు నిలిచిన తమను అరెస్టు చేయడం అధికార పార్టీ అధికార దుర్వినియోగమేనని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, మాడుగుల ఎమ్మెల్యే బూడిముత్యాలనాయుడు, మాజీ ఎమ్మెల్యే మిలట్రీనాయుడు, సీపీఎం కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు, కాంగ్రెస్ నాయకుడు సీడీసీ చైర్మన్ దొండారాంబాబు, గోవాడ సుగర్స్ మాజీ చైర్మన్ దొండా కన్నబాబు ధ్వజమెత్తారు. పంచదారఅమ్మకాల్లో అవినీతికి పాల్పడటమే కాకుండా రైతుల సమస్యలు చర్చింకుండా సభ రసాభాస కావడానికి స్థానిక ఎమ్మెల్యే, ఫ్యాక్టరీ చైర్మనే కారణమని వారు ఆరోపించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టి మహాజన సభను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
 విపక్షాల వల్లే గందరగోళం: ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొట్టడం వల్లే సభలో గందరగోళం నెలకొందని ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజు అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. సభను సజావుగా నడిపి చైర్మన్ ప్రసంగం తర్వాత ప్రతిపక్ష పార్టీల నాయకులు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలనుకున్మాని, ఇంతలోనే రైతులు ఆందోళన చేయడం సరికాదన్నారు. ఈ క్రషింగ్ సీజన్‌లో టన్నుకు రూ.2375 మద్దతు ధర ఇవ్వాలని భావిస్తున్నామని తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement