టీడీపీ ఎమ్మెల్యే నుంచి రక్షణ కల్పించండి
- పోలీసులనుఆశ్రయించిన వైద్యుడు
సీతంపేట : దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ చెప్పిన విధంగా ఆయన మనుషులకు డబ్బులు ఇవ్వకుంటే ఆసుపత్రి లేపేస్తానని బెదిరించారని కళా ఆసుపత్రి ఎండీ డాక్టర్ పి.వి.రమణమూర్తి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి సమీపంలో జీవీఎంసీ అధికారులు కూల్చివేసిన అక్రమ కట్టడానికి పరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారని ఆయన తెలిపారు. అందుకు ఆక్రమణదారులకు తాను రూ.9 లక్షలు చెల్లిం చాలని లేకపోతే అంతు చూస్తానని ఎమ్మెల్యే హెచ్చరించారని పేర్కొన్నారు.
మంగళవారం రాత్రి 15వ వార్డు మాజీ కార్పొరేటర్ భర్త టాక్సీ రాజు మరో కొంతమంది అనుచరులతో ఎమ్మెల్యే గణేష్‌కుమార్ ద్వారకానగర్‌లోని తన ఆసుపత్రికి వచ్చి ఆందోళన చేశారన్నారు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా ఆయన తన మాటలను వెనక్కి తీసుకుంటారని గురువారం వరకు వేచిచూశానన్నారు. తనకు, తన ఆసుపత్రి సిబ్బందికి రక్షణ కల్పించాలని పోలీసులను కోరినట్టు తెలిపారు.
ఎమ్మెల్యేపై ఫిర్యాదు వాపసు
దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌పై కళా ఆసుపత్రి ఎండీ డాక్టర్ రమణమూర్తి చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు. తన నియోజకవర్గం ఎమ్మెల్యేపై అభిమానం, గౌరవించాలనే ఫిర్యాదును వాపసు తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయమై ద్వారకాజోన్ సీఐ పి.వి.వి నరసింహారావును సంప్రదించగా ఎమ్మెల్యే బెదిరించారని రక్షణ కల్పించాలని గురువారం ఫిర్యాదు చేసిన డాక్టర్ రమణమూర్తి అదే రోజు రాత్రి ఫిర్యాదును వాపసు తీసుకున్నట్లు తెలిపారు.