ప్రశ్నించడమంటే ఇదేనా..! | Prutviraj Fires On Pavan Kalyan | Sakshi
Sakshi News home page

ప్రశ్నించడమంటే ఇదేనా..!

Published Mon, Apr 8 2019 8:50 AM | Last Updated on Mon, Apr 8 2019 9:14 AM

Prutviraj Fires On Pavan Kalyan - Sakshi

ఉండి సెంటర్‌లో మాట్లాడుతున్న సినీనటుడు, వైఎస్సార్‌ సీపీ నాయకుడు పృథ్విరాజ్, చిత్రంలో ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్‌ నర్సింహరాజు, సర్రాజు తదితరులు

సాక్షి, ఉండి : గత ఎన్నికల ముందు చంద్రబాబుకు మద్దతు ఇచ్చిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తప్పు చేస్తే ప్రశ్నిస్తానని చెప్పారని, ప్రశ్నించడమంటే ఇదేనా అని సినీనటుడు, వైఎస్సార్‌ సీపీ నేత పృథ్విరాజ్‌ ఎద్దేవా చేశారు. ఐదేళ్లూ అధికారంలో ఉండి రాష్ట్రాన్ని దోచుకుతిన్న చంద్రబాబును పల్లెత్తుమాట అనకుండా ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై పవన్‌ కల్యాణ్‌ నిత్యం నిందలేస్తున్నారని, ఇదేనా ప్రశ్నంచడమంటే అని ఆయన నిలదీశారు. ఆదివారం ఉండిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్‌ నర్సింహరాజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో పృథ్విరాజ్‌ సినీనటుడు జోగినాయుడు తదితరులతో కలిసి రోడ్‌ షో నిర్వహించారు.

అనంతరం ఉండి సెంటర్‌లో జరిగిన సభలో పృథ్విరాజ్‌ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఏకమై వచ్చిన దొంగలు ఇప్పుడు మళ్లీ కొత్త అవతారంలో అధికారం కోసం వస్తున్నారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత ఎన్నికల్లో  చంద్రబాబు సీనియర్‌ కనుక ఆయనే రాష్ట్రాన్ని బాగా పాలిస్తాడని ఆయనను మద్దతు తెలిపానని పవన్‌ కల్యాణ్‌ చెప్పారని, చంద్రబాబు తప్పు చేసిన ప్రతిసారి ప్రశ్నిస్తానని చెప్పి ఓట్లు అడిగారని గుర్తు చేశారు. ఐదేళ్లుగా జరిగిన అవినీతిపై పవన్‌ కల్యాణ్‌ ఎందుకు ప్రశ్నించడం లేదని పృథ్విరాజ్‌ నిలదీశారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు తొత్తుగా మారిన జనసేన పార్టీ వైఎస్సార్‌ సీపీ ఓట్లు చీల్చేందుకు పన్నాగం పన్నిందని విమర్శించారు. చంద్రబాబును గానీ, పవన్‌కల్యాణ్‌ను గానీ ఎవరు నమ్మి ఓట్లు వేసినా వారిని నట్టేట ముంచేయడం ఖాయమన్నారు. మాట చెప్పినా, సహాయం చేస్తామని ముందుకొచ్చినా చెప్పిన మాట కోసం ప్రాణాలిచ్చే వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబం నుంచి వచ్చిన జగనన్నే ఈ రాష్ట్రానికి దశదిశనిర్ధేశమని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం ప్రజల కోసం తాపత్రయపడే నాయకుడు అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటారన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి నర్సింహరాజు, నరసాపురం ఎంపీ అభ్యర్థి కనుమూరి రఘరామకృష్ణంరాజు, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు మాట్లాడుతూ చంద్రబాబు లాంటి నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ప్రజల దురదృష్టమన్నారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా జగన్‌ ప్రకటించిన పార్టీ మ్యానిఫెస్టోకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.

రాష్ట్రంలో అన్ని కులాల సంక్షేమానికి పెద్దపీట వేసింది ఒక్క జగన్‌ మాత్రమే అని చెప్పారు. గెలుపే తమకు ముఖ్యమని ఎవరు ఏమైపోయినా ఫరవాలేదని టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారన్నారు. చంద్రబాబు దుర్మార్గ అవినీతి పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు యర్రా నవీన్, పాతపాటి వాసు, పాతపాటి వర్మ, మండల పార్టీ అధ్యక్షుడు గులిపల్లి అచ్చారావు, రాష్ట్ర నాయకులు కరిమెరక చంద్రరావు, జి.సుందర్‌కుమార్, జిల్లా నాయకుడు యేడిద వెంకటేశ్వరరావు, అల్లూరి వెంకట్రాజు, చిక్కాల జగదీష్, దాకి మూర్తి, బడుగు బాలాజీ అంగర రాంబాబు, శేషాద్రి శ్రీను, రాయి సతీష్, మునుకోలు సింహాచలం, గలావిల్లి ధనుంజయ, రణస్తుల మహంకాళి, కొర్రపాటి అనిత, కమతం బెనర్జీ, నిమ్మల కేశవకుమార్‌(బాబు), రుద్దర్రాజు గాంధీరాజు, అల్లూరి రామరాజు(ఉప్మారాజు), ఇందుకూరి శ్రీహరిరాజు, చిన్నోడు, కెఎన్‌ఎన్‌ రాజు, పి.సత్యనారాయణరాజు, కరిమెరక మల్లిఖార్జున తదితరులు పాల్గొన్నారు.
 



 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement