
సోంపేట ఎస్‌ఐకి వినతిపత్రం అందజేస్తున్న లక్కవరం గ్రామస్తులు
సోంపేట : తమ ప్రాంతంలో సైకో సంచరిస్తున్నట్టు వస్తున్న వార్తలతో ఆందోళన చెందుతున్నామని తగు చర్యలు తీసుకోవాలని పలాసపురం పంచాయతీ లక్కవరం గ్రామస్తులు ఎస్‌ఐ కె.భాస్కరరావును కోరారు. ఈ మేరకు అదృశ్య వ్యక్తి సంచారంపై వారు శుక్రవారం ఆయన్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
అదృశ్య వ్యక్తి సంచరిస్తూ వికృత చేష్టలకు పాల్పడుతున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామంలో పాఠశాల విద్యార్థుల వినియోగ వస్తువులను తస్కరించడం, వాటిని దూరంగా విసిరేయడం, విద్యార్థులు వినియోగించే చెప్పులు కత్తిరించడం, సైకిల్ సీట్లు కోసేయడం వంటి చర్యలకు పాల్పడుతూ భయపెడుతున్నాడని అందులో పేర్కొన్నారు. ఈ సంఘటనలు కొద్ది రోజులుగా జరుగుతున్నాయని, ఈ నెల 21న వికృత చేష్టలు మరింత పెరిగాయని తెలిపారు.
దీంతో ప్రశాంతంగా ఉండే లక్కవరంలో ఆందోళన చెందుతున్నామని పేర్కొన్నారు. పోలీసు అధికారులు స్పందించి గ్రామంలో పర్యటించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్‌ఐను కలిసి వినతిపత్రం అందజేసిన వారిలో బావన శ్రీకాంత్, మార్పు కృష్ణారావు, సనపల విశ్వనాధం, తేజేశ్వరరావు తదితరులు ఉన్నారు.