
మురళీధర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్
సాక్షి, కాకినాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో జరిగే తొలి సమీక్షా సమావేశానికి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి సిద్ధమయ్యారు. అజెండాలో పేర్కొన్న ప్రకారం జిల్లాకు సంబంధించిన పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే సంబంధిత శాఖల నుంచి నోట్ రప్పించుకుని, నివేదిక తయారు చేశారు. కొత్త ప్రభుత్వం..కొత్త ముఖ్యమంత్రి..కొత్త కలెక్టర్..తొలి సమీక్షా సమావేశం..అంటే తప్పకుండా ప్రత్యేకత ఉంటుంది. ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రావడమే తరువాయి సంక్షేమ కార్యక్రమాలపై సంతకాలు పెడుతున్నారు.
నవరత్నాలను అమల్లోకి తెస్తున్నారు. బాధ్యతలు స్వీకరించి నెల రోజులు కాకముందే చాలా హామీలను అమలు చేశారు. ఒకవైపు సంక్షేమం చూస్తూనే మరోవైపు అభివృద్ధి, పాలనపై దృష్టిసారించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగా కలెక్టర్లతో తొలి సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అజెండా అంశాలను తెలిపారు. ఆరోగ్య శ్రీ, 108, 104, వ్యవసాయం, నవరత్నాల అమలు, తాగునీటి అంశాలకు ప్రాధాన్యమిచ్చారు.
ప్రాథమ్యాల ప్రకారం అమలుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక, కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన మురళీధర్‌రెడ్డి ఏజెన్సీపై ప్రత్యేక దృష్టి సారించారు. అక్కడ రెండు రోజుల పాటు పర్యటించి జనం కష్టాలను తెలుసుకున్నారు. వైద్యం, పోలవరం తదితర సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఏజెన్సీకి ఏమి అవసరమో గుర్తించారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వ ప్రాధాన్యాంశాలు కూడా దాదాపు అవే కావడంతో అనుభవ పూర్వక నోట్ తయారు చేసుకున్నారు.
ఎటపాక సబ్ డివిజన్ పరిధిలోని నాలుగు విలీన మండలాల్లో వ్యవసాయ అధికారుల కొరత ఉంది. ప్రస్తుతం ముగ్గురు మండల వ్యవసాయాధికారులు మాత్రమే ఉన్న నేపథ్యంలో కొత్తగా ఒక అసిస్టెంట్ డైరెక్టర్, ఒక వ్యవసాయ అధికారి పోస్టులను మంజూరు చేయవల్సిందిగా సీఎంను కోరనున్నారు.
మత్స్యకార సంక్షేమం
- వేట నిషేధ సమయంలో మత్స్యకా రులకు ఒక్కొక్క కుటుంబానికి రూ.10 వేల చొప్పున జిల్లాలో 23,190 మందికి రూ. 23.19 కోట్లు రావాల్సి ఉంది. నవరత్నాల్లో భాగంగా మత్స్యకారులకు భృతి మంజూ రు చేయవల్సిందిగా విజ్ఞప్తి చేయనున్నారు.
- సాగరమాల ప్రాజెక్టులో భాగంగా ఉప్పాడ కొత్తపల్లి ఇంటిగ్రేటెడ్ ఫిషింగ్ హార్బర్‌కు మత్స్యశాఖ అధికారులు 2018 ఆగస్టు 16న రూ.280.40 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. కేంద్రప్రభుత్వంతో మాట్లాడి అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నారు.
వైద్య, ఆరోగ్యం
- జిల్లాలోని ఇంజరం, ఎర్రిపాక, లింగంపర్తి, జి.కొత్తపల్లి, మురమండ, నరేంద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కొత్త భవనాల అవసరం ఉంది. వాటిని మంజూరు చేయవల్సిందిగా కోరనున్నారు.
- వైఎస్సార్ ఆరోగ్యశ్రీని పటిష్టంగా అమలు చేసేందుకు జిల్లాలో ఖాళీగా ఉన్న 64 ఆరోగ్య మిత్ర పోస్టులను భర్తీ చేయాలని కోరనున్నారు.
- జిల్లాలోని ఏరియా ఆసుపత్రుల్లో సీటీ స్కానర్స్ లేక రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రంపచోడవరం, తుని, రామచంద్రపురం, అమలాపురం ఏరియా ఆసుపత్రులకు సీటీ స్కానర్స్ మంజూరు చేయవల్సిందిగా కోరనున్నారు. .
- రోగుల తాకిడి దృష్ట్యా పిఠాపురం, గోకవరం, రౌతులపూడి, ముమ్మిడివరం, తాళ్లరేవు, మండపేట కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలను 30 నుంచి 50 పడకలకు; కొత్తపేట, రాజోలు, పెద్దాసుపత్రి కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలను 50 నుంచి 100 పడకలకు అప్‌గ్రేడ్ చేయాలని, రాజానగరం నియోజకవర్గ పరిధిలోని సీతానగరం పీహెచ్‌సీని వందపడకల కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంగా అప్‌గ్రేడ్ చేయాలని కోరనున్నారు.
- జిల్లాలో 108 వాహనాల కొరత ఉంది. తొమ్మిది వాహనాల అవసరం ఉంది. కూనవరం, కోరుకొండ, గొల్లప్రోలుకు ఒక్కొక్కటి చొప్పున, ఐటీడీఏ పరిధిలోని ప్రాంతాలకు ఆరు వాహనాలు మంజూరు చేయవల్సిందిగా విజ్ఞప్తి చేయనున్నారు.
- జిల్లాలోని కూనవరం, పిఠాపురం ప్రాంతాలకు 104 వాహనాల్లేవు. ఆ రెండు ప్రాంతాలకు రెండు 104 వాహనాలు మంజూరు చేయాలని కోరనున్నారు.
గృహ నిర్మాణం
- ఏజెన్సీలో 2071 ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. సకాలంలో చెల్లింపులు జరగకపోవడం, యూనిట్ ఖరీదు తక్కువగా ఉండటం, రవాణా, బిల్డింగ్ మెటీరియల్ వ్యయం పెరగడంతో నిర్మాణం మందకొడిగా సాగుతోంది. వీటిని వేగవంతం చేసేందుకు, యూనిట్ ఖరీదు పెంచేందుకు, సకాలంలో చెల్లింపులకు అవసరమైన రూ.15.53 కోట్లు సబ్ ప్లాన్ నిధుల నుంచి మంజూరు చేయాలని కోరనున్నారు. పీవీటీజీ (కొండరెడ్ల) లబ్ధిదారులకు అదనంగా రూ.లక్ష, మిగతా ఎస్టీలకు అదనంగా రూ.75వేలు మంజూరు చేస్తే నిర్మాణాలు వేగవంతం కానున్నాయని తెలపనున్నారు. పోలవరం ఆర్ అండ్ ఆర్ హౌసింగ్‌లో భాగంగా నాన్ షెడ్యూల్డ్ లబ్ధిదారులకు రూ.3.55 లక్షలకు, షెడ్యూల్డ్ లబ్ధిదారులకు రూ.4.55 లక్షలకు యూనిట్ చేయాల్సిందిగా కోరనున్నారు.
చేనేతని జౌళి శాఖ
జిల్లాలోని 37 చేనేత సహకార సంఘాలకు ఆప్కో రూ.10.02 కోట్ల బకాయి పడింది. 2018 ఏప్రిల్ నుంచి చెల్లింపులు చేయలేదు. 2019 జనవరి నుంచి ఆప్కో కొనుగోలు చేయక సహకార సంఘాల వద్ద 2019 మే చివరి నాటికి రూ.9.06 కోట్ల విలువైన వస్త్రాలు నిల్వ ఉండిపోయాయి. ఈ సమస్యను పరిష్కరించాలని కోరనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment