బకాయిల గుదిబండతో ఆర్టీసీ విలవిల | Public transportation system in TDP service | Sakshi
Sakshi News home page

బకాయిల గుదిబండతో ఆర్టీసీ విలవిల

Published Sun, May 12 2019 4:12 AM | Last Updated on Sun, May 12 2019 4:12 AM

Public transportation system in TDP service - Sakshi

సాక్షి, అమరావతి: మూలిగే నక్కపై తాటిపండులా అసలే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆర్టీసీని పోలవరం విహార యాత్రలు, సీఎం చంద్రబాబు సభలకు బస్సుల తరలింపు ద్వారా టీడీపీ సర్కారు కోలుకోలేని విధంగా నష్టాల్లోకి నెట్టేసింది. ఆ బకాయిలను రాబట్టుకోలేక ఆర్టీసీ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. సీఎం సభలకు డ్వాక్రా మహిళల తరలింపు, పోలవరం సందర్శన కోసం బస్సులను సమకూర్చిన ఆర్టీసీకి రూ.225 కోట్ల దాకా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందులో సీఎం సభలకే రూ.150 కోట్ల బకాయిలు ఉండగా, పోలవరం యాత్రలకు చెల్లించాల్సింది రూ.75 కోట్ల దాకా ఉంది. కలెక్టర్లు ఇచ్చిన ఇండెంట్ల ప్రకారమే బస్సులను సిద్ధం చేసినట్లు ఆర్టీసీ చెబుతోంది. ఇప్పటివరకు పైసా కూడా రాకపోవడంతో నిర్వహణ భారమై ఆర్టీసీ ఆర్ధిక పరిస్థితి దయనీయంగా మారింది.  

సీఎం సభల కోసం 5 వేల బస్సులు 
రాష్ట్రంలోని పలు గ్రామీణ ప్రాంతాలకు బస్సు సదుపాయం లేకపోయినా ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికుల ఇబ్బందులను ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వ పెద్దల సేవలో తరించింది. రాష్ట్రంలో 3,669 గ్రామాలకు పల్లెవెలుగు సర్వీసులు అందుబాటులో లేవు. పల్లెవెలుగు బస్సుల వల్ల ఏటా రూ.740 కోట్ల నష్టాలు వస్తున్నట్లు చెబుతున్న ఆర్టీసీ సీఎం ప్రచార కార్యక్రమాలు, సభలకు పెద్ద ఎత్తున సమకూర్చింది. ముఖ్యమంత్రి సేవలో నిమగ్నమై లక్షల మంది ప్రయాణికులను అవస్థల పాల్జేసింది. ఎన్నికలకు ముందు విశాఖ, గుంటూరు, కడపలో డ్వాక్రా మహిళలతో సీఎం చంద్రబాబు సభలు నిర్వహించారు. దీనికి ఆర్టీసీ 5 వేల బస్సులను ఏర్పాటు చేసింది. గత ఏడాది నుంచి పోలవరం సందర్శన పేరిట కూడా ఆర్టీసీ పెద్ద సంఖ్యలో బస్సులను తిప్పుతోంది.  

ధర్మపోరాట దీక్షలు, జ్ఞానభేరికి కూడా... 
టీడీపీ సర్కారు నిర్వహించిన ధర్మపోరాట దీక్షలు, జ్ఞానభేరి తదితర కార్యక్రమాల కోసం కూడా పెద్దఎత్తున ఆర్టీసీ బస్సులను మళ్లించారు. డబ్బులు చెల్లించకుండా ప్రజా రవాణా వ్యవస్థను సర్కారు అడ్డగోలుగా వినియోగించుకుంది. విజయనగరం, విజయవాడ, నెల్లూరు, కడప ఆర్టీసీ జోన్ల పరిధిలో నిత్యం 72 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. కానీ సీఎం చంద్రబాబు సభలు నిర్వహించిన రోజు సగటున 15 లక్షల మంది ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొన్నట్లు అంచనా. సీఎం సభలకు సమకూర్చే ఒక్కో ఆర్టీసీ బస్సుకు కిలోమీటరుకు రూ.25 నుంచి రూ.30 వరకు చెల్లించాలి. అయితే బస్సులను వాడుకున్న టీడీపీ సర్కారు ఆర్టీసీకి నయాపైసా కూడా చెల్లించడం లేదు.    

విహార యాత్రలకు పైసా విదల్చ లేదు.. 
టీడీపీ కార్యకర్తలను ప్రభుత్వ ఖర్చులతో పోలవరం విహార యాత్రలకు పంపడం గత ఏడాది మొదలైంది. ఇందుకోసం అమరావతి, ఇంద్ర, సూపర్‌ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేశారు. గత ఏడాదిగా వివిధ ప్రాంతాల నుంచి సుమారు వెయ్యి బస్సులను తిప్పారు. పోలవరం సందర్శనకు ఇరిగేషన్‌ శాఖ నిధులు చెల్లిస్తుందని చెప్పి నెలలు గడుస్తున్నా ఆర్టీసీకి ఇంతవరకు పైసా కూడా చెల్లించలేదు.

- రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల సంఖ్య  : 11,687 
గత ఆర్నెల్ల వ్యవధిలో సీఎం చంద్రబాబు సభలు, దీక్షలకు మళ్లించిన బస్సులు : 2,620 
డ్వాక్రా సభలకు వినియోగించుకున్న బస్సులు : 5,000 
ప్రతి కిలోమీటరుకు చెల్లించాల్సింది : రూ.25  30 వరకు 
ప్రభుత్వ కార్యక్రమాలు, పోలవరం యాత్రలకు ఆర్టీసీకి బకాయి పడ్డ సొమ్ము : సుమారు రూ.225 కోట్లు 
ఇందులో పోలవరం విహార యాత్రల బకాయిలు : రూ.75 కోట్లు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement