చవితి ప్రత్యేక రైళ్లు
విశాఖపట్నం : వినాయక చవితి సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా బెంగళూరు, సికింద్రాబాద్‌లకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. కామాఖ్య-బెంగళూర్(02552) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 29వ తేదీ శుక్రవారం రాత్రి 8.30 గంటలకు కామాఖ్యలో బయల్దేరి 31వ తేదీ తెల్లవారుజామున 2.10 గంటలకు విశాఖకు చేరుకుని తిరిగి 2.30 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 10.30 గంటలకు బెంగళూరు చేరుతుంది.
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ(02727/02728) ఎక్స్‌ప్రెస్‌ను మరో రెండు ట్రిప్పులు పొడిగించినట్టు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎం. ఎల్వేందర్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్-విశాఖపట్నం(02728) ప్రత్యేక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 5, 12 తేదీల్లో ప్రతి శుక్రవారం రాత్రి 10.10 గంటలకు బయల్దేరి శనివారం ఉదయం 10.35 గంటలకు విశాఖకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో విశాఖ నుంచి02727 నంబర్‌తో ప్రయాణించే ఈ రైలు సెప్టెంబర్ 6, 13 తేదీల్లో ప్రతి శనివారం రాత్రి 7.05 గంటలకు బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు చేరుతుంది. దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, వరంగల్, కాజీపేట స్టేషన్లలో ఆగుతుంది.
విశాఖ మీదుగా చెన్నైకు ప్రీమియం రైళ్లు
విశాఖ మీదుగా చెన్నైకు రెండు ఏసీ ప్రీమియం రైళ్లను నడుపుతున్నారు.
హౌరా-చెన్నై వీక్లీ ఏసీ ప్రీమియం ఎక్స్‌ప్రెస్(22839), చెన్నై-వీక్లీ ఏసీ ప్రీమియం ఎక్స్‌ప్రెస్(22840), కామాఖ్య-చెన్నై(12528), చెన్నై-కామాఖ్య(12527) ఏసీ ప్రీమియం రైళ్లున్నాయి. వీటి వివరాలు రైల్వే వెబ్‌సైట్ నుంచి పరిశీలించి బెర్తులు బుక్ చేసుకోవచ్చు.
గుణుపూర్‌కు రోజూ ప్యాసింజర్ రైలు
విశాఖపట్నం-గుణుపూర్ మధ్య నడిచే ప్యాసింజర్ రాకపోకల వేళలను తూర్పు కోస్తా రైల్వే గురువారం ప్రకటించింది. ఇటీవల బడ్జెట్‌లో ప్రకటించిన ఈ రైలును రోజూ న డిపేందుకు రైల్వే పచ్చజెండా ఊపింది. కొత్త రేక్ మంజూరయితే అప్పటి నుంచి పట్టాలెక్కుతుంది. ఈ ప్యాసింజర్‌కు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి వచ్చే రైల్వే టైంటేబుల్‌లో రాకపోకలు ప్రకటించారు.
విశాఖ-గుణుపూర్(58506) డైలీ ప్యాసింజర్ రోజూ ఉదయం 7 గంటలకు విశాఖలో బయల్దేరి నౌపడ జంక్షన్‌కు 10.20 గంటలకు చేరుకుంటుంది. తిరిగి 10.50 గంటలకు బయల్దేరి గుణుపూర్‌కు మధ్యాహ్నం 1.55 గంటలకు చేరుతుంది.
గుణుపూర్-విశాఖ ప్యాసింజర్(58506) రోజూ మధ్యాహ్నం 2.25కు బయల్దేరి నౌపడ జంక్షన్‌కు సాయంత్రం 5 గంటలకు చేరుతుంది. తిరిగి 5.25 గంటలకు బయల్దేరి రాత్రి 9.40 గంటలకు విశాఖకు చేరుతుంది.