రచ్చబండ టెన్షన్! | Racchabanda programme tension | Sakshi
Sakshi News home page

రచ్చబండ టెన్షన్!

Published Mon, Nov 4 2013 1:07 AM | Last Updated on Sat, Sep 2 2017 12:15 AM

Racchabanda programme tension

ఏలూరు, న్యూస్‌లైన్ :  ఎన్నికల సీజన్ తరుముకొస్తుండటంతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ దిశగా 11వ తేదీ నుంచి నెలాఖరు వరకు మూడవ విడత రచ్చబండ నిర్వహించాలని నిర్ణయించింది. ఇటీవల సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమంతో రెండు నెలలుపాటు పాలన స్తంభించింది. దీనికితోడు భారీ వర్షాలు, వరదలతో జిల్లా అతలాకుతలమైంది. భారీగా పంట నష్టపోయిన రైతులను సత్వరం ఆదుకునే చర్యలు ఏమాత్రం కానరాలేదు. ఇంకా నష్టం అంచనాలు తయారీకి యంత్రాంగం సన్నద్ధం కాలేదు. ఈ తరుణంలో రచ్చబండ ప్రకటన అధికారులకు నిద్రలేకుండా చేస్తోంది.
 
 ప్రజల నుంచి నిలదీతలపర్వం తప్పదన్న భయాందోళన వారిలో వ్యక్తమవుతోంది. రేషన్‌కార్డుల పంపిణీ, కొత్త పెన్షన్లు, ఇళ్లస్థలాలు అందజేత తదితర అంశాల అజెండాగా రచ్చబండ సాగుతుందని ప్రభుత్వం సూత్రప్రాయంగా ప్రకటించింది తప్ప పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు విడుదల కాలేదు. కలెక్టర్లతో ఈనెల 6న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, మంత్రుల ఉపసంఘం వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించనున్నారు. అప్పుడు రచ్చబండ షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశాలున్నాయి.
 
 అక్కరకురాని కిరణ్ పథకాలు
 మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన  అమలుచేసి  పలు పథకాలను పూర్తిస్థాయిలో కొనసాగించలేని కిరణ్ సర్కార్ ఇందిరమ్మ కలలు (ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్), బంగారు తల్లి వంటి పథకాలను అట్టహాసంగా ప్రారంభించింది. ప్రచార ఆర్భాటం తప్ప ఇవి ప్రజలకు ఏ మాత్రం చేరువకాలేదు. ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్‌లో భాగంగా 50 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లబ్ధిదారులకు అందటం లేదు. మరోవైపు ఈ వర్గాల ఇళ్ల నిర్మాణాలకు పెంచిన రూ.1.05 లక్షల రుణ పరిమితి జీవోలు విడుదలైనా అమలైన దాఖలాలు లేవు. జిల్లాలో బంగారు తల్లి పథకంలో 4 వేల మందిని అర్హులుగా గుర్తించినా ఇప్పటికీ 2 వేల మందికి మాత్రమే మంజూరు పత్రాలు ఇచ్చారు. వీరిలో ఇటీవల 9 మందికి కలెక్టర్ ఆర్థికసాయం అందజేశారు. ఈ నేపథ్యంలో ఆయా పథకాల అమలుపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. 
 
 ప్రజాప్రతినిధుల అంతర్మథనం
 రచ్చబండలో తమకు సమైక్య సెగ తప్పదన్న ఆందోళన ప్రజాప్రతినిధులను వెంటాడుతోంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను సమైక్యవాదులు నిలదీశారు. కొందరు పాలకులు ప్రజలకు అందుబాటులో లేకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రచ్చబండ పేరుతో గ్రామగ్రామానా నిర్వహించే సభల్లో ఎలా పాల్గొనాలని ప్రజాప్రతినిధులు అంతర్మథనం చెందుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement