సొంత డబ్బుతో కార్మికులకు వేతనాలు | Rachamallu Shiva Prasad Reddy Pay Wages to Municipal Workers | Sakshi
Sakshi News home page

సొంత డబ్బుతో కార్మికులకు వేతనాలు

Published Fri, Dec 7 2018 1:40 PM | Last Updated on Fri, Dec 7 2018 1:40 PM

Rachamallu Shiva Prasad Reddy Pay Wages to Municipal Workers - Sakshi

కార్మికులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి

వైఎస్‌ఆర్‌ జిల్లా, ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు మండలంలోని గోపవరం మేజర్‌ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న 37 మంది కాంట్రాక్టు కార్మికులకు ఒక్కొక్కరికి రూ.42వేల చొప్పున ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తన సొంత డబ్బు రూ.16లక్షలు చెల్లించారు. గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో మాజీ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ దేవీ ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. పంచాయతీలో పారిశుద్ధ్య, నీటి సరఫరా వీధి లైట్లు తదితర విభాగాల్లో పనిచేసే 37 మంది కాంట్రాక్టు కార్మికులకు నిబంధనల ప్రకారం ప్రతి నెలా వేతనాలు చెల్లించాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోలేదన్నారు. కేవలం రూ.7,200 వేతనంతో ప్రతి నెలా వీరు నెట్టుకురావడమే కష్టమని, అలాంటిది నెలల తరబడి వేతనాలు ఇవ్వకుంటే వీరి ఇంటి అద్దెలు, పాలు, కరెంటు బిల్లులు, డిష్‌ బిల్లు ఎలా చెల్లిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.

దీని వల్ల కుటుంబ పోషణ భారంగా మారిందని తెలిపారు. మానవీయ కోణంలో ఇది సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. వీరి పరిస్థితిని తెలుసుకుని సోమవారం మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య కార్మికుల కోసం ధర్నా చేయడాన్ని అభినందిస్తున్నానన్నారు. ధర్నా సందర్భంగా రెండు నెలల వేతనాలు శుక్రవారం చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారన్నారు. కేవలం రెండు నెలలు వేతనాలు ఇస్తే తమ కష్టాలు తీరవని, బకాయిలు చెల్లించేందుకు తాము ఇబ్బంది పడాల్సి వస్తుందని కార్మికులు తన ఇంటి వద్దకు వచ్చి సంప్రదించారన్నారు. సహజ సిద్ధంగా పేదరికం నుంచి వచ్చిన తనకు వారి శ్రమ విలువ తెలిసిందన్నారు. వారి దయనీయ పరిస్థితిని గమనించి ప్రస్తుతం తాను డబ్బు చెల్లించానన్నారు. రెండు నెలల వేతనం చెల్లించేందుకు కూడా వీలు కాదని అధికారులు తెలిపారన్నారు. కొత్తపల్లె గ్రామ పంచాయతీ నుంచి అప్పుగా తీసుకోవాలంటే డీపీఓ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, ఇందుకు చాలా సమయం పడుతుందన్నారు.

పండుగల పూట పస్తులుంటే ఎలా..
సమీపంలో క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలు వరుసగా వస్తున్నాయని, ఇలాంటి సందర్భంలో పేదలు పస్తులు ఉంటే ఎలా అని ఎమ్మెల్యే అన్నారు. అందరూ సంతోషంతో సమానంగా పండుగ చేసుకోవాలనే కారణంతో ఈ డబ్బు చెల్లించామని తెలిపారు. తమను కూడా కార్మికులకు డబ్బు ఇవ్వొద్దని ఒక వేళ ఇచ్చినా తమకు సంబంధం లేదని అధికారులు చెప్పడం సరి కాదన్నారు. ఎవరి ఒత్తిడి మేరకు అధికారులు ఇలా చెబుతున్నారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అధికారులతో సంబంధం లేకుండా పార్టీ కార్యకర్తలతో చర్చించి సొంతంగా కార్మికులకు డబ్బు ఇచ్చామని వారు ఇచ్చినప్పుడు తిరిగి తీసుకుంటామన్నారు. మాజీ సర్పంచ్‌ దేవీ ప్రసాదరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు కాచన చంద్ర ఓబుళరెడ్డి, ఆసం దస్తగిరిరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు దొంతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, ఆదినారాయణరెడ్డి, గోకుల సుధాకర్, కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, వెంకటరాముడు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఓబయ్య యాదవ్, న్యాయవాది జింకా విజయలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి సోములవారిపల్లె శేఖర్, ఇర్ఫాన్, జిల్లా సహాయ కార్యదర్శి షాపీర్‌ఆలీ, మైనార్టీసెల్‌ మండల కన్వీనర్‌ ఖాదర్‌బాషా, నాయకులు కేశవరెడ్డి, తిరుపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక ఇబ్బందులతో చితికిపోయాం
ఆర్థిక ఇబ్బందులతో చితికిపోయాం. గోపవరం గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్నాం. గతంలో రూ.6వేలు మాత్రమే వేతనం ఇచ్చేవారు. ప్రస్తుతం రూ.7,200 పెంచారు. చేతిలో చిల్లి గవ్వ లేని కారణంగా పొద్దున్నే అల్పాహారం చేసుకునే ఆర్థిక స్తోమత లేక ఇతరుల ఇళ్ల వద్దకు వెళ్లి అన్నం తీసుకొచ్చి పిల్లలకు పెడుతున్నాం. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి చేసిన సహాయాన్ని మరువలేం.    – విజయరాణి, బాలవెంకటమ్మ, ఓబుళమ్మ, రేణుక,లక్ష్మీనారాయణమ్మ, రాములమ్మ మహిళా కార్మికులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement