ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే రాచమల్లు, ఆయన సతీమణి రమాదేవి
సాక్షి, ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆయన నియోజకవర్గంలోని అంగన్‌వాడీ వర్కర్లపై వరాల జల్లు కురిపించారు. స్థానిక కేహెచ్‌ఎం స్ట్రీట్‌లోని ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో సోమవారం ఐసీడీఎస్ అధికారులు, అంగన్‌వాడీ సిబ్బంది ఎమ్మెల్యే దంపతులను సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే టీడీపీ ప్రభుత్వం అంగన్‌వాడీ సిబ్బందికి రెండు నెలలుగా జీతాలు ఇవ్వలేదని, తమ నియోజకవర్గంలో ఉన్న అంగన్‌వాడీ వర్కర్లలో 150 మందికి పైగా ముస్లింలు ఉన్నారని, జీతాలు ఇవ్వకుంటే మరో రెండు రోజుల్లో రానున్న రంజాన్ పండుగను ఎలా జరుపుకుంటారని ప్రశ్నించారు. వీరంతా ఆనందంగా రంజాన్ జరుపుకోవడానికి తన సొంత నిధులతో వారికి ఒక నెల జీతాన్ని ఇస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు.
అలాగే ప్రతి ఏడాది అంగన్‌వాడీలకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజైన డిసెంబర్ 21న కొత్త బట్టలు పంపిణీ చేస్తానని, ఈ సంవత్సరం జగన్ సీఎం అయ్యారు కనుక డిసెంబర్ వరకు ఆగకుండా మరో 15 రోజుల్లో బట్టల పంపిణీ చేస్తానని ఆయన అన్నారు. అంగన్‌వాడీ సిబ్బంది కుటుంబ ఆర్థిక భద్రత కోసం నియోజకవర్గంలోని 800 మంది వర్కర్లకు సొంత డబ్బుతో రూ. 1 లక్ష ఇన్సూరెన్స్ పాలసీని కడతానని చెప్పారు. ఎమ్మెల్యే రాచమల్లు వరాలు ప్రకటించడం పట్ల అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాచమల్లు సతీమణి రాచమల్లు రమాదేవి, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment