తెప్ప బోల్తాపడి మత్స్యకారుడి మృతి
Published Sat, Sep 28 2013 2:57 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
ఇద్దివానిపాలెం(కవిటి), న్యూస్‌లైన్: మండలంలోని ఇద్దివానిపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు కర్రి నీల య్య (38) సముద్రంలో చేపల వేటకెళ్లి శుక్రవారం వేకువజామున జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం... మృతుడు నీలయ్యతో పాటు ఇద్ది పున్నాలు, జోగి హేమారావు కలిసి నాటుపడవపై శుక్రవారం వేకువజామున 2 గంటల సమయంలో ఇద్దివానిపాలెం తీరం నుంచి వేటకు వెళ్లారు. ఉదయం నాలుగు గంటల సమయంలో సముద్రపు అలల ధాటికి తెప్ప బోల్తాపడడంతో సముద్రంలో పడిపోయారు. ఈ ఘటనలో మృతుడు నీలయ్యకు తీవ్ర గాయం కావడంతో ఈతకొట్టుకుని ఒడ్డుకుచేరుకోలేక తనువుచాలిం చాడు.
మిగిలిన ఇద్దరు అతికష్టం మీద ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ప్రమాద విషయూన్ని తెలుసుకున్న మత్స్యకారులు నీలయ్యకోసం బోట్లపై వెళ్లి వెతికినా ఫలితం లేకపోయింది. చివరకు ఆయన మృతదేహం సీహెచ్ కపాసుకుద్ది తీరంలో ఒడ్డుకు చేరింది. నీలయ్య మరణంతో భార్య రూపవతి, ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలారు. రూపవతి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ ఎం.చిన్నంనాయుడు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement