ధరలు కొండెక్కుతుంటే బాబుకు పట్టదా?
Published Tue, Aug 8 2017 4:36 PM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM
విజయవాడ: కూరగాయల ధరలపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరా తీశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నాణ్యత లేని కూరగాయలను రైతు బజార్లలో విక్రయిస్తున్నా ప్రభుత్వం, అధికారులు పట్డించుకోవడం లేదని విమర్శించారు. రైతుబజార్లలో కనీస సౌకర్యాలు లేకున్నా లాభాలు వస్తున్నాయని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కూరగాయల ధరలు కొండెక్కుతుంటే వాటిని నియంత్రించాలన్న ఊసే చంద్రబాబుకు పట్టడం లేదన్నారు. ఉల్లి, టమాటా ధరలు సామాన్యులకు అందుబాటులో లేవన్నారు. మహారాష్ట్ర, కర్నూలులో ఉల్లి బాగా ఉన్నా ఇక్కడ ఎందుకు సరఫరా లేదని ప్రశ్నించారు.
దళారీలతో ప్రభుత్వం చేతులు కలిపి రైతుబజార్లను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. స్వచ్ఛ భారత్ అనే ప్రతి ఒక్కరూ రైతుబజారుకు వస్తే ఇక్కడి పరిస్ధితి అర్ధం అవుతుందన్నారు. రైతుబజార్ లో తాగునీరు, మరుగుదొడ్లు లేక స్టాళ్ళ యజమానులు, వినియోగదారులు అల్లాడిపోతున్నారన్నారు. రైతుల కన్నా బినామీలే ఎక్కువగా ఉన్నారని, బినామీలను నియంత్రించకపోవడం దారుణమని అన్నారు.
Advertisement