రైల్వే అభివృద్ధికి నిధులు తెస్తా
రాజమండ్రి సిటీ : గోదావరి పుష్కరాలు సక్రమంగా నిర్వహించేందుకు.. రైల్వే ప్రయాణికులకు అన్నివిధాల సౌకర్యాలు క ల్పించేందుకు అవసరమైన సప్లమెంటరీ నిధులు తీసుకొస్తానని.. అందుకు రైల్వే మంత్రి సదానందగౌడ్‌తో సమావేశమై చర్చిస్తానని రాజమండ్రి ఎంపీ మురళీమొహన్ అన్నారు. రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో గాంధీ జయంతిని పురష్కరించుకుని బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గురువారం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రత పాటించాలని ప్లాట్ ఫాం శుభ్రం చేశారు. రోడ్‌కం రైల్వే వంతెన శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేయడానికి నిధులు సమకూర్చుతాని చెప్పారు. పుష్కరాల భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఖాళీ ప్రదేశాలలో షెల్టర్లు, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామన్నారు.
తర్వాత విద్యార్థులు, ఉద్యోగులతో కలసి రైల్వేస్టేషన్‌లో ర్యాలీ నిర్వహించారు. విజయవాడ డివిజన్ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ ఎస్‌కే గుప్తా ఉద్యోగులతో స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ చేయించారు. రాజమండ్రి సిటీఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, స్టేషన్‌మేనేజర్ బీఎస్‌ఆర్‌శాస్త్రి పాల్గొన్నారు. మధురపూడి : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతంలో ప్రవేశపెట్టిన క్లీన్‌అండ్ గ్రీన్ కార్యక్రమం ప్రస్తుతం దేశమంతటా ప్రధాని నరేంద్రమోడీ అమలుచేస్తున్న స్వచ్ఛభారత్ ఒక్కటేనని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ వ్యాఖ్యానించారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి జెట్ ఎయిర్‌వేస్ విమానంలో ఇక్కడకు విచ్చేసిన ఆయన ఎయిర్‌పోర్టు ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. స్వచ్ఛ భారత్ విజయం సాధిస్తుందన్నారు. కాలికి దెబ్బతగిలినా ఢిల్లీకి వెళ్లి కార్యకలాపాలు నిర్వహించానని.. తాను అందుబాటులో లేనని కొన్ని ఛానళ్లు తప్పుడు కథనాలు ప్రసారం చేయడం దురదృష్టకరమన్నారు.