రైల్వే సేవలు మరింత ‘స్మార్ట్’
- త్వరలో అధునాతన ఎగ్జిక్యూటివ్ లాంజ్ నిర్మాణం
- జ్ఞానాపురం వైపు స్థలాన్ని గుర్తించిన రైల్వే
- ప్రయాణికులకు ఎంతో హాయి
విశాఖపట్నం సిటీ : రైళ్ల కోసం ఇక ఉసూరుమని నిరీక్షించాల్సిన పనిలేదు. ఏ రైలు ఎక్కడుందో తెలుసుకునేందుకు విచారణ కార్యాలయం వరకూ వెళ్లాల్సిన అవసరం లేదు. తమ కార్యాలయానికి అవరమైన సమాచారం ఇచ్చేందుకు రైల్వేస్టేషన్ నుంచి నెట్ సెంటర్‌కు పరుగులు తీయనక్కరలేదు. మీరు కూర్చున్నచోటే ఎంచక్కా ఆన్‌లైన్ పనులన్నీ చేసేయొచ్చు. అదెలా అంటారా! విశాఖ రైల్వేస్టేషన్‌లో ఇలాంటి అనేక సదుపాయాలుండే అధునాతన ఎగ్జిక్యూటివ్ లాంజ్‌ను భారతీయ రైల్వే త్వరలో ఏర్పాటు చేయనుంది. మూడేళ్ల కిందటే ఈ ప్రాజెక్టును విశాఖ స్టేషన్‌కు కేటాయించినా ఆచరణలో ఎలాంటి పురోగతి లేదు. ఈ ప్రాజెక్టును దాదాపుగా అంతా మరిచిపోతున్న తరుణంలో భారతీయ రైల్వే మరొకసారి ఈ ప్రాజెక్టు ఆశలు సజీవంగా ఉన్నట్టు ప్రకటించి రైల్వే ప్రయాణికుల్లో ఆశలు రేపింది. జ్ఞానాపురం వైపు ఖాళీగా వున్న రెండు ఎకరాల విస్తీర్ణంలో ఈ అధునాతన లాంజ్‌ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలోనే ఈ ప్రాజెక్టు అమలుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న వాల్తేరు రైల్వే ఈసారి మరింత వేగంగా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించనుంది. వచ్చే ఏడాది నుంచి పనులు ప్రారంభించవచ్చని రైల్వే వర్గాల అంచనా. తక్కువ ధరకే ఎక్కువ సదుపాయాలు కల్పించాలన్నది లక్ష్యం. లాంజ్ నిర్మాణం, సదుపాయాల కల్పనను ఐఆర్‌సీటీసీ చేపట్టనుంది.
లాంజ్‌లో ఏమేం ఉంటాయంటే..!
మూడు నాలుగు అంతస్తుల్లో అధునాతన ఎగ్జిక్యూటివ్ లాంజ్ నిర్మాణం.
ఈ మొత్తం భవన పరిసరాల్లో వైఫై ఉచితం
ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేందుకు అవసరమైన ఏసీ గదులు
లైవ్ టీవీ కార్యక్రమాల ద్వారా ప్రయాణికులకు వినోదం
టీవీల ద్వారా ఎప్పటికప్పుడు వార్తల అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్‌ల ప్రచారం
ప్రయాణికులకు నచ్చే నోరూరించే అన్ని ప్రాంతాల వంటకాలతో అధునాతన రెస్టారెంట్
దూర ప్రాంత ప్రయాణికులకు ఆన్‌లైన్‌లో వసతి, పర్యాటక ఏర్పాట్ల బుకింగ్ సదుపాయం ఠిరైల్వే సమాచారాన్ని తెలుసుకునేందుకు అక్కడికక్కడే ఆన్‌లైన్ ఏర్పాట్లు
సమాచార సదుపాయాలతో ఏయే రైళ్లలో బెర్తులు ఖాళీగా ఉన్నాయో తెలుసుకోవచ్చు.