రాజధాని రైల్వేస్టేషన్‌పై ప్రత్యేక దృష్టి
మంగళగిరి: రాజధాని రైల్వేస్టేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించి ప్రయాణికులకు వసతులు కల్పిస్తామని డీఆర్‌ఎం ఎన్‌వీ ప్రసాద్ తెలిపారు. డిసెంబర్ 12న దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ మంగళగిరి రైల్వేస్టేషన్‌ను పరిశీలించనున్న నేపథ్యంలో డీఆర్‌ఎం ప్రసాద్ నేతృత్వంలో సుమారు 40 మంది రైల్వే అధికారులు, సిబ్బంది బుధవారం గుంటూరు నుంచి ప్రత్యేక రైలులో ఇక్కడకు వచ్చారు.
ఈ సందర్భంగా డీఆర్‌ఎం విలేకరులతో మాట్లాడారు. స్టేషన్‌లో నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లను కాంట్రాక్ట్‌పై తీసుకోవడానికి ఎవరు ముందుకురాకపోవడంతో నిరుపయోగంగా పడివున్నాయన్నారు. రైల్వేస్టేషన్ విస్తరణ, ప్లాట్‌ఫారాలు తదితర అంశాలపై వచ్చేనెలలో పర్యటించనున్న ఉన్నతాధికారులు బృందం నిర్ణయం తీసుకుంటుందన్నారు.
తొలుత అధికార బృందం రైల్వేస్టేషన్ ఆవరణను పరిశీలించి, ప్లాట్‌ఫారాలు, తాగునీరు, టాయిలెట్స్, ఎలక్ట్రికల్ గూడ్స్, సేఫ్టీ చైన్స్‌తోపాటు స్టేషన్ ఆవరణలోని సైకిల్‌స్టాండ్‌ను పరిశీలించారు. సైకిల్‌స్టాండ్‌కు మరో 50 మీటర్ల స్థలం కేటాయించి విస్తరించాలని ఆదేశించారు. స్వఛ్చభారత్ సందర్భంగా నాటిన మొక్కలను పరిశీలించారు. తాగునీటి పంపుల లీకవుతుండడంతో వెంటనే వాటిని మార్చాలని చెప్పారు. స్టేషన్‌లో ఫస్ట్‌ఎయిడ్ బాక్స్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
నిడమర్రు రైల్వేగేటు వద్ద త్వరలో రెయిలింగ్..
నిడమర్రు రైల్వేగేటు వద్ద రెయిలింగ్ ఏర్పాటుకు త్వరలో చర్యలు తీసుకుంటామని డీఆర్‌ఎం ప్రసాద్ తెలిపారు. ఈ నెల ఐదో తేదీన సాక్షిలో ‘ప్రాణాలు పోతేకాని పట్టించుకోరా?’ శీర్షికన రైల్వే అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహంపై కథనం ప్రచురితమైం ది. ఈ కథనాన్ని ఓ ప్రయాణికుడు డీఆర్‌ఎం ప్రసాద్‌కు చూపించారు.
స్పందించిన డీఆర్‌ఎం.. వివరాలు తీసుకుని నిడమర్రు గేటు వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తిరుగుప్రయాణంలో తనకు ఆ గేటును చూపించాలని అధికారులతో అన్నారు. డీఆర్‌ఎం వెంట సీనియర్ డీసీఎం శ్రీరాములు, కోఆర్డినేషన్ డీఎం సైమన్, సీనియర్ డీఎస్టీ ఐజాక్, ఎలక్ట్రికల్ డీఈఈ ఏఎంఎస్ రెడ్డి, డీఈఈ సత్యనారాయణ, మెడికల్ సూపరింటెండెంట్ డి.సత్యనారాయణ, మెకానికల్ డీఈ శ్రీకాంత్, స్టేషన్ మేనేజర్‌లు డి.ఏలియాబాబు, ఎన్.విజయ్‌ప్రవీణ్, బాబు,శ్రీలక్షి తదితరులు ఉన్నారు.