ముసురేసింది | The rains are abundant in the state | Sakshi
Sakshi News home page

ముసురేసింది

Published Mon, Aug 13 2018 3:57 AM | Last Updated on Mon, Aug 13 2018 3:57 AM

The rains are abundant in the state - Sakshi

ప్రకాశం బ్యారేజీ వద్ద 40 గేట్లు ఎత్తివేయడంతో దిగువకు వస్తున్న వరద నీరు

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/నెట్‌వర్క్‌: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడం, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో శనివారం అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి వరకూ శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ వర్షం కురిసింది. రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది. విజయవాడ నగరంలో శని, ఆదివారాల్లో భారీ వర్షం పడింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లోని వాగులు, వంకలు వర్షం నీటితో జోరుగా ప్రవహిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ముఖ్యంగా ఏజెన్సీలోని వాగులు ఉగ్రరూపం దాల్చడంతో గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. గడచిన 24 గంటల్లో పాలకొండ, కూనవరం, వేలేరుపాడుల్లో 7, వీఆర్‌పురం, కుకునూరు, పాతపట్నంలలో 6, విశాఖపట్నం, తిరువూరుల్లో 5, మెరకముడిదాం, బొండపల్లి, గజపతినగరం, చింతూరుల్లో 4, మందస, విజయనగరం, చీపురుపల్లి, నెల్లిమర్లలో 3 సెం.మీల చొప్పున వర్షపాతం రికార్డయింది.

నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం...
ఉత్తర కోస్తా, ఒడిశా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. ఈ ఆవర్తనం బలపడి సోమవారం నాటికి వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ తెలిపింది. అల్పపీడనం, నైరుతి రుతుపవనాలతో సోమవారం కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న రెండు రోజులు కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశ నుంచి బలమైన గాలులు వీస్తాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. సముద్రం అలజడిగా ఉన్నందున మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. బాపట్ల సూర్యలంక సముద్ర తీరంలో అలలు ఉధృతంగా ఉండటంతో బీచ్‌ రోడ్డు మూసివేశారు. కృష్ణా జిల్లా హంసలదీవిలోని సాగరతీరం వద్ద సముద్ర అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.

పంటలకు జీవం..
గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు పలు జిల్లాల్లో పంటలకు జీవం పోశాయి. గుంటూరు జిల్లాలో పత్తి, వరి ఎండు దశకు చేరుకున్న సమయంలో ఈ వర్షాలు రైతులకు ఊరటనిచ్చాయి. పశ్చిమ డెల్టా ప్రాంతంలో రైతులు వరి నాట్లు వేసేందుకు పొలాలను సిద్ధం చేస్తున్నారు. పల్నాడు ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో రైతులు మిర్చి పంట సాగులో నిమగ్నమయ్యారు. కృష్ణా జిల్లాలోని ఎగువ ప్రాంతాల్లో వరినాట్లు ఊపందుకున్నాయి. ప్రస్తుత వర్షాలకు ఈ జిల్లాలో సుమారు ఆరువేల ఎకరాల్లో నారుమళ్లు నీట మునిగినట్లు అంచనావేస్తున్నారు. అయితే రాయలసీమలో జల్లులు మాత్రమే పడ్డాయి. వ్యవసాయ పనులకు ఈ జల్లులు సరిపోవని వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల రైతులు చెబుతున్నారు. ఎండిపోకుండా ఉన్న పైర్లకు మాత్రం ఈ వర్షంతో ఊరట కలిగిందని చెబుతున్నారు.

ఆగస్టు 15 వేడుకల ఏర్పాట్లకు విఘాతం
శ్రీకాకుళంలోని ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో ఈ ఏడాది ఆగస్టు 15 వేడుకలు నిర్వహించడానికి నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రెండు రోజులుగా పడుతున్న వర్షాలకు మైదానం చిత్తడిగా మారిపోయింది. ఆదివారం ఉదయం నీటి ఇంజిన్లతో నీటిని బయటకు తోడినా ఎడతెరిపిలేని వర్షంతో మైదానాన్ని ఆరబెట్టడం సాధ్యం కావడంలేదు.  

పులిచింతల దిగువన కృష్ణమ్మ పరవళ్లు
రాష్ట్రంలో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో.. తెలంగాణలో ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో ఉపనదులైన మున్నేరు, వైరా, కట్టలేరు వాగు పొంగి ప్రవహిస్తుండటంతో పులిచింతల ప్రాజెక్టుకు దిగువన కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ప్రకాశం బ్యారేజీలోకి ఆదివారం సాయంత్రం 6 గంటలకు 26 వేల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. కాలువలకు విడుదల చేయగా మిగిలిన 14,500 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో సోమవారం ప్రకాశం బ్యారేజీకి వచ్చే వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక జూరాల, తుంగభద్ర నుంచి శ్రీశైలం జలాశయంలోకి 78,338 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 869.7 అడుగుల్లో 140.31 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.

నాగార్జునసాగర్‌కు శ్రీశైలం జలాశయం నుంచి 31,186 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో 520.5 అడుగుల్లో 150.19 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి ఉపనదులు పొంగి పొర్లుతుండటంతో వరద ఉధృతి గంటగంటకూ పెరుగుతోంది. ఆదివారం ధవళేశ్వరం బ్యారేజీలోకి 3,97,792 క్యూసెక్కులు ప్రవాహం వచ్చింది. డెల్టా కాలువలకు విడుదల చేయగా మిగిలిన 3,91,726 క్యూసెక్కులను కడలిలోకి వదిలారు. వంశధార నదిలో వరద ప్రవాహం నిలకడగా ఉంది. ఆదివారం వంశధార బ్యారేజీలోకి 6978 క్యూసెక్కులు రాగా.. కాలువలకు విడుదల చేయగా మిగిలిన 4354 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement