ఈ వారం దేశవ్యాప్తంగా భారీ వర్షాలు | Heavy to very heavy rainfall in large parts of India this week | Sakshi
Sakshi News home page

ఈ వారం దేశవ్యాప్తంగా భారీ వర్షాలు

Published Tue, Jul 3 2018 2:14 AM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM

Heavy to very heavy rainfall in large parts of India this week - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో ఈ వారం జమ్మూ కశ్మీర్, తమిళనాడు, అస్సాం, గుజరాత్‌ రాష్ట్రాలతో సహా అత్యధిక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. రుతుపవనాలు సాధారణ సమయాని కంటే 17 రోజుల ముందే దేశవ్యాప్తంగా ప్రవేశించాయని ఐఎండీ గత వారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో తాజా హెచ్చరికలు చేసింది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్‌ వంటి ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురియవచ్చని తెలిపింది. ఈ మేరకు సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుల వారీగా ఏయే ప్రాంతాల్లో ఎంత మేరకు వర్షాలు కురుస్తాయనేది వివరించింది.  

సోమవారం
హిమాలయ పర్వతాల పరిధిలో ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బిహార్, అస్సాం, మేఘాలయ తదితర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కుండపోత వర్షాలు కురుస్తాయి. హిమాచల్‌ప్రదేశ్, పశ్చిమ ఉత్తర ప్రదేశ్, అరుణాచల్‌ ప్రదేశ్‌లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉత్తర హరియాణా, చండీగఢ్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, కొంకణ్, గోవా, రాయలసీమ, తమిళనాడు, లక్షద్వీప్, కర్ణాటకలోని కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.  

మంగళవారం
అస్సాం, మేఘాలయ తదితర రాష్ట్రాల్లోని సుదూర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కుండపోత వర్షాలు, ఉత్తర ప్రదేశ్‌ తూర్పు, పశ్చిమబెంగాల్, సిక్కిం, బిహార్‌లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, జమ్మూ కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తర హరియాణా, ఛండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, కొంకణ్, గోవా, రాయలసీమ, కోస్టల్‌ కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియవచ్చు.

బుధవారం  
అస్సాం, మేఘాలయ, కొంకణ్, గోవా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, హిమాలయ పర్వత ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, సిక్కిం, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, కర్ణాటకలోని కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.

గురువారం
కొంకణ్, గోవా, కర్ణాటక కోస్తా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, అస్సాం, మేఘాలయ, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా, కర్ణాటక, కేరళ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.

శుక్రవారం  
ఒడిశా, కొంకణ్, గోవా, కర్ణాటకలోని కోస్తా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, విదర్భ, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌ తీరప్రాంతం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, మరట్వాడా, ఆంధ్ర ప్రదేశ్‌లోని కోస్తా, తెలంగాణ, కర్ణాటక, కేరళ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. నాలుగు నెలల పాటు సాగే వర్షాకాలం సాధారణంగా జూన్‌ ఒకటిన ప్రారంభమై సెప్టెంబర్‌ 30 నాటికి ముగుస్తుంది. అయితే ఈ ఏడాది రుతుపవనాలు మూడు రోజులు ముందుగా మే 29వ తేదీనే కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించాయి.  


               సోమవారం అహ్మదాబాద్‌లో కురుస్తున్న వర్షం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement