
వర్ష బీభత్సం
సాక్షి, గుంటూరు:
జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకూ కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. వాగులు, వంకలు పొంగి పొర్లటంతో వేలాది ఎకరాల్లోని పంటలు నీట మునిగారుు. కాలువలు, చెరువులకు గండ్లు పడటంతోపాటు రోడ్లపై వరద నీరు ప్రవహించటంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. బాపట్ల, పల్నాడు ప్రాంతంలోని గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో వందలాది గ్రామాలు జలమయమయ్యాయి. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు పస్తుంలుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. శనివారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనం అవస్థలు పడ్డారు.
మాచర్ల, గురజాల, బాపట్ల పట్టణాల్లో డ్రైనేజి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో మురుగునీరు పొంగి ఇళ్లలోకి చేరింది. దుర్గంధాన్ని భరించలేక ప్రజలు అల్లాడి పోయూరు. మాచర్ల పట్టణంలోని 13, 14 వార్డుల్లోని ఇళ్లలోకి వరదనీరు చేరడంతో ప్రజలు కట్టుబట్టలతో బయటకురావాల్సి వచ్చింది. ఇళ్లలోని వస్తువులు, బియ్యం తడిసి ముద్దయ్యాయి.
పల్నాడులోని వేల ఎకరాల్లో పత్తి, మిర్చి పంటలు నీటమునిగి ఉరకెత్తి పోయాయి.
గురజాల మండలం మాడుగుల వద్ద ఒద్దులవాగు పొంగి ప్రవహించటంతో గురజాల నుంచి మాడుగుల, శ్యామరాజుపురాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఒద్దులవాగు దాటి మాడుగుల వెళ్లేందుకు ప్రయత్నించిన వల్లపు రాధ(48), బత్తుల అనసూర్య(50) అనే అక్కాచెల్లెళ్ళు నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయూరు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యం కాగా మరొకరి మృతదేహం కోసం గాలిస్తున్నారు. అదే మండలంలోని దైద గ్రామం వద్ద దండెవాగు పొంగి ప్రవహిస్తుండటంతో దైద, తేలుకుట్ల, గొట్టిముక్కల, సమాధానం పేట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
రెంటచింతల సమీపంలోని గోళివాగు ఉద్ధృతికి గుంటూరు-మాచర్ల రోడ్డులో రాకపోకలు స్తంభించాయి. వెల్దుర్తి మండలం రచ్చమాలపాడు వద్ద కానుగవాగు పొంగి ప్రవహించటంతో రచ్చమాలపాడు, శ్రీరాంపురం తండాలకు రాకపోకలు నిలిచిపోయూరుు.
జమ్మలమడక వద్ద చంద్రవంక వాగు ఉధృతంగా ప్రవహించటంతో మాచర్ల నుంచి జమ్మలమడక, లింగాపురం, తుమృకోట గ్రామాలకు రాకపోకలు స్తంభించారుు.
గురజాల, మాచర్ల పట్టణాల్లో నీటమునిగిన కాలనీల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వారికి భోజన సదుపాయం కల్పించటం, ఇతర సహాయ చర్యలపై గురజాల ఆర్డీ మురళి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
జిల్లా సగటు వర్షపాతం 7. 31 సెం.మీ.
జిల్లాలో ఆదివారం ఉదయం వరకు అత్యధికంగా మాచర్ల మండలంలో 29.30 సెంటీమీటర్ల వర్షం పడగా అత్యల్పంగా కాకుమాను మండలంలో 0.05 సెం.మీ. వర్షం కురిసింది. జిల్లా సగటు వర్షపాతం 7.31 సెం.మీ.గా నమోదైంది. వె ల్దుర్తి మండలంలో 15.82 సెం.మీ., గురజాల 15.24, రెంటచింతల 14.62, బాపట్ల 14.46, దుర్గి 12.56, దాచేపల్లి 12.44, బొల్లాపల్లి 12.40, నకరికల్లు 10.74, పెదకూరపాడు 10.52, మాచవరం మండలంలో 10.38 సెం.మీ.ల వంతున వర్షం పడింది.