దిగొచ్చిన ప్రభుత్వం | Raithu Barosa Yatra | Sakshi
Sakshi News home page

దిగొచ్చిన ప్రభుత్వం

Published Thu, Jul 30 2015 1:57 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

Raithu Barosa Yatra

అనంతపురం : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో చేపట్టిన మూడోవిడత రైతు భరోసాయాత్రతో ప్రభుత్వం దిగొచ్చింది. జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 33 మంది రైతుల కుటుంబాలకు మధ్యంతర పరిహారం కింద రూ.49.50 లక్షలు విడుదల చేస్తూ బుధవారం జీవో జారీ చేసింది. వైఎస్ జగన్ ఈ నెల 21 నుంచి 27 వరకు ఏడు రోజుల పాటు జిల్లాలో యాత్ర సాగించారు. కళ్యాణదుర్గం, పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల్లో 17 రైతు కుటుంబాలను పరామర్శించారు. యాత్ర ఆసాంతం ప్రభుత్వ తీరును తూర్పారబట్టారు. రైతులు, చేనేతలు కష్టాల్లో ఉన్నా, అప్పుల బాధతో ఆత్మార్పణం చేస్తున్నా సర్కారుకు చీమకుట్టినట్లు కూడా లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం మెడలు వంచైనా బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానన్నారు.
 
 ఈ సందర్భంగా రైతులు, కూలీలు, ఇతర అన్ని వర్గాల ప్రజలు కూడా జగన్ వద్ద తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ప్రభుత్వం తమ ఇబ్బందులను ఏమాత్రమూ పట్టించుకోని వైనాన్ని వివరించారు. జగన్ రైతు భరోసా యాత్రకు విశేష స్పందన లభించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది. రైతు కుటుంబాలకు పరిహారం కోసం నిధులను విడుదల చేసింది. కాగా.. అనంతపురం జిల్లాలో రైతు ఆత్మహత్యలు లేవంటూ జగన్ రైతు భరోసా యాత్రపై రాష్ట్రమంత్రులు విమర్శలు చేసిన విషయం విదితమే. తాజాగా 33 కుటుంబాలకు పరిహారం విడుదల చేయడం ద్వారా జిల్లాలో ఆత్మహత్యలు ఉన్నట్లు ప్రభుత్వమే ఒప్పుకుంది.
 
 ప్రతిసారీ ఇలాగే..
 కరువు కోరల్లో చిక్కుకుని ‘అనంత’ అన్నదాత విలవిల్లాడుతుంటే ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదు. అసెంబ్లీ మొదటి సమావేశంలో ‘అనంత రైతు ఆత్మహత్యలపై  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తావించినప్పుడు సీఎంతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి ‘అసలు అనంతలో రైతు ఆత్మహత్యలే జరగలేదు’ అన్నారు. దీంతో వైఎస్ జగన్ బాధిత కుటుంబాల పరిస్థితి తెలుసుకుని రైతు భరోసా యాత్ర చేస్తానని ప్రకటించారు. ఈ ప్రకటన చేయగానే పాలకులకు ముచ్చెమటలు పట్టాయి. అసలు ఆత్మహత్యలే లేవన్న వారు... 29 మంది రైతులు, 11 మంది చేనేతలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రెండోసారి జిల్లాలో రైతు భరోసాయాత్ర ప్రారంభించగానే ప్రభుత్వ యంత్రాంగం హడావుడిగా రైతు ఆత్మహత్యలపై వివరాలు సేకరించింది. మొత్తం మూడు విడతల్లో వైఎస్ జగన్ 42 రైతు కుటుంబాలను పరామర్శించి.. భరోసా కల్పించారు.  ఈ యాత్ర ద్వారా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తేవడమే కాకుండా రైతుల నుంచి కూడా పెద్దఎత్తున వ్యతిరేకత రావ డంతో ప్రభుత్వం స్పందించక తప్పడం లేదు.
 
 ద్వంద్వ వైఖరి :    అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం ఇంకా ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు అప్పుల బాధతో 85 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ప్రతిఒక్కరికీ ఎంతో కొంత పొలం ఉందన్న విషయం అధికారుల విచారణలో తేటతెల్లమైంది. ఈ రైతులందరూ వివిధ బ్యాంకుల్లో రుణాలు పొందినవారే. అయితే ప్రభుత్వం కొంతమందికే పరిహారం ప్రకటించడం విమర్శలకు దారితీస్తోంది. మిగిలిన వారు రైతులు కాదా? వారికి అప్పులు లేవా? అనే విమర్శలు ప్రభుత్వాన్ని చుట్టుముడుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement