సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): సాంస్కృతిక రాజధానిగా ఉన్న రాజమహేంద్రవరం నగరం స్పోర్ట్స్ రాజధానిగా అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో యెనెక్స్, సన్‌రైజ్ డాక్డర్ వైఎస్సార్– జక్కంపూడి రామ్మోహనరావు మెమోరియల్ 44వ ఇంటర్ స్టేట్, ఇంటర్ జోనల్, జూనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్–2019 పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి క్రీడల అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేస్తున్నారని తెలిపారు. రాజమహేంద్రవరంలో ప్రతిభావంతులైన క్రీడాకారులున్నారని, వారికి సరైన ప్రోత్సాహం ఇస్తే మరింత మెరుగ్గా రాణిస్తారని అన్నారు. మూడు రాజధానుల అంశంపై తెలుగుదేశం పార్టీ లేనిపోని రాద్ధాంతం చేస్తోందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అభివృద్ధి అనేది ఒకే చోట కేంద్రీకృతం కాకూడదన్నారు.
మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే ఇటు విజయవాడ, అటు వైజాగ్ అభివృద్ధి చెంది, మధ్యలో ఉభయ గోదావరి జిల్లాలు కూడా బాగా అభివృద్ధి చెందుతాయన్నారు. ఎంపీ మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం సిటీ స్పోర్ట్స్ హబ్‌గా మారడానికి అన్ని సౌకర్యాలున్నాయన్నారు. కార్యక్రమంలో అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు, బాయ్ కార్యదర్శి ఉమర్ రషీద్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి సీహెచ్ రఘు కిరణ్, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషిక్త్ కిశోర్, తూర్పు గోదావరి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షురాలు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొడాలి తనూజ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 30వ తేదీ వరకూ జరిగే ఈ పోటీల్లో పాల్గొనడానికి దేశంలోని 29 రాష్ట్రాల క్రీడాకారులు హాజరయ్యారు. జిల్లాలో జాతీయ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించడం ఇదే తొలిసారి.
Comments
Please login to add a commentAdd a comment