రాజారత్నం ఐజాక్ అరెస్టు
కొడుకు, అతని కుటుంబం హత్య కేసులో కీలక నిందితుడు
కడప : కడప నడిబొడ్డున ఉన్న జియోన్ హైస్కూలు ఆవరణంలో తన కొడుకు కృపాకర్ ఐజాక్ కుటుంబాన్ని హత్య చేసి ఖననం చేసిన కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న శాంతి సంఘం జిల్లా అధ్యక్షుడు రాజారత్నం ఐజాక్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈనెల 7వ తేదీన పాఠశాల ఆవరణంలో దాదాపు ఏడా ది కిందట పూడ్చిపెట్టిన మృతదేహాలను వెలికి తీసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇందుకు సంబంధించి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రాజారత్నం ఉండగా పోలీసు సిబ్బంది వెళ్లి అరెస్టు చేసినట్లు డీఎస్పీ రాజేశ్వరరెడ్డి వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. ఐజాక్‌ను కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నామన్నారు.
తొలుత రామాంజనేయులురెడ్డిని అరెస్టు చేశామని, విచారణలో భాగంగా రాజారత్నంను కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు. హత్యలకు సంబంధించి అన్ని విషయాలు ఆయనకు తెలుసని, కేవలం పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుందని ఎవరికీ చెప్పకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.