కృపాకర్ ల్యాప్‌టాప్ స్వాధీనం
కడప అర్బన్ :కృపాకర్ ఐజాక్ కుటుంబ సభ్యుల హత్య కేసులో నిందితులైన పి.రత్నాకర్‌రెడ్డి (22), సి.కిశోర్‌రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 21వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కడప నగరంలోని జెడ్పీ గెస్ట్‌హౌస్ వద్ద వీరిని అరెస్టు చేసినట్లు కేసు ప్రత్యేక అధికారి, ప్రొద్దుటూరు అర్బన్ సీఐ టీవీ సత్యనారాయణ తెలిపారు. రత్నాకర్‌రెడ్డి నుంచి కృపాకర్‌కు చెందిన ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నామన్నారు.
రత్నాకర్‌రెడ్డి కృపాకర్‌కు చెందిన జియోన్ హైస్కూలులో పదవ తరగతి వరకు చదువుకున్నాడన్నారు. కిశోర్‌రెడ్డి కృపాకర్ ఇంటిలో పనిచేసే వాడన్నారు. కృపాకర్‌తో పాటు కుటుంబ సభ్యుల మృతదేహాలను పూడ్చేందుకు రత్నాకర్‌రెడ్డి, కిశోర్‌రెడ్డి ఇరువురు గుంత తవ్వారన్నారు. గుంత తీసి మృతదేహాలను పూడ్చి పెట్టేందుకు సహకరించినందుకు వీరివురికి కేసులో ప్రధాన నిందితుడైన రామాంజులరెడ్డి సొమ్ము ముట్టజెప్పాడన్నారు.
రత్నాకర్‌రెడ్డికి రూ. 90 వేలు, కిశోర్‌రెడ్డికి రూ. 50 వేలు చెల్లించాడన్నారు. వీరిద్దరిని బుధవారం రెండవ అదనపు మున్సిఫ్ కోర్టులో మెజిస్ట్రేట్‌ఎదుట హాజరు పరచగా 15 రోజులపాటు రిమాండు విధించారన్నారు. ఈ కేసులోని ప్రధాన నిందితుడు రామాంజులరెడ్డిని కస్టడీలోకి తీసుకోవడంతో వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి.