సాక్షి ప్రతినిధి, కర్నూలు: తెలంగాణ రాష్ట్ర ప్రకటనను నిరసిస్తూ... సమైక్యరాష్ట్రం కోసం సీమాంధ్రలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న పరిస్థితుల్లో జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బెరైడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక వాదంతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ప్రత్యేక రాయలసీమ సాధనే లక్ష్యంగా గురువారం ఆయన ‘రాయలసీమ పరిరక్షణ సమితి’ పార్టీని తిరుపతిలో ప్రారంభించారు.
సీమలోని నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలుపుతూ ‘గ్రేటర్ రాయలసీమ’ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ‘రాయలసీమ హక్కుల ఐక్య వేదిక’ పేరుతో గతంలో ఉద్యమాలు చేసిన ప్రస్తుత రాష్ట్ర మంత్రి టి.జి. వెంకటేశ్ కూడా ఇప్పుడు తన రూటు మార్చారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా సమైక్యాంధ్ర నినాదాన్ని ఎత్తుకున్న నేపథ్యంలో... బెరైడ్డి అదే వాదంతో కొత్త పార్టీ ఏర్పాటు చేయ డం చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీలో రెండుసార్లు ఎమ్మెల్యేగా, జిల్లా పార్టీ అధ్యక్షుడుగా, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆయన గత అక్టోబర్‌లో టీడీపీని వీడారు. అయితే ఆయన వెంట చెప్పుకోదగ్గ నాయకులెవ్వరూ కలిసిరాలేదు. అయినా రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో ఉద్యమ సంస్థను ఏర్పాటు చేసిన బెరైడ్డి అక్టోబర్ 2 నుంచి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ‘వస్తున్నా... మీకోసం ’ యాత్రకు పోటీగా నాలు గు జిల్లాల్లో పాదయాత్ర చేపట్టారు. దానికి అంతంత మా త్రంగానే స్పందన రావడంతో కొద్దికాలం మౌనంగా ఉన్న ఆయన ట్రాక్టర్ యాత్ర పేరుతో మరోసారి జనం ముం దుకు వెళ్లే ప్రయత్నం చేశారు. అప్పుడే రాయలసీమ పరిరక్షణ సమితి సంస్థను రాజకీయ పార్టీగా మార్చనున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగానే గురువారం తిరుపతి వేదికగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
నందికొట్కూరు నియోజకవర్గానికే పరిమితమా..?: 1993లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన బెరైడ్డి రాజశేఖర్ రెడ్డి 1994, 1999లలో నందికొట్కూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గౌరు చరిత చే తిలో ఓడిపోయిన బెరైడ్డి 2009 ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో పాణ్యం నుంచి పోటీ చేసి కాటసాని రాంభూపాల్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి టీడీపీ పట్ల అసంతృప్తితో ఉన్న ఆయన ప్రత్యేక రాయలసీమ హక్కులపై గళం విప్పడం ఆరంభించారు. చివరికి గత ఏడాది అక్టోబర్‌లో టీడీపీని వీడి చివరికి కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. అయితే పార్టీ ఏర్పాటు చేయకముందు జరిగిన సహకార , పంచాయితీరాజ్ ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో పోటీ చేసి, నామమాత్రపు ఫలితాలే సాధించారు. ప్రస్తుతం బెరైడ్డి ఏర్పాటు చేసిన పార్టీలో ఆయన మినహా పేరున్న నాయకులు ఎవరూ లేరు.
నినాదంతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి, ఎన్నికల్లో అభ్యర్థులను బరిలోకి దింపడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. అదీగాక... ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెలువడడం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించే దిశలో వేగం పెంచినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో సమైక్య ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. మన జిల్లాతో పాటు అనంతపురం, చిత్తూరు, వైఎస్‌ఆర్ జిల్లాల్లో వాడవాడల్లో, మారుమూల పల్లెల్లో సైతం ప్రజలు ముక్తకంఠంతో సమైక్యాంధ్ర కోసం ఉద్యమ బాట పట్టారు. ఈ పరిస్థితుల్లో అరిగిపోయిన ప్రత్యేక రాయలసీమ నినాదాన్ని భుజాన వేసుకొని ఎన్నికల్లో వెళ్లాలని నిర్ణయించుకోవడం ఎంత మేర ఫలితం ఇస్తుందో వేచి చూడాల్సిందే.
పాతపాట కొత్త బాణీ
Published Fri, Aug 9 2013 2:25 AM | Last Updated on Fri, Sep 1 2017 9:44 PM
Advertisement
Advertisement