ఉపాధికి..చేటుకాలం
‘ముందుంది మంచికాలం’ అంటూ గత ‘ముఖ్య’ నేత హడావుడి చేశారు. రాజీవ్ యువకిరణాలు పేరుతో యువతకు ఉపాధి శిక్షణ ఇచ్చి, ఏటా లక్ష ఉద్యోగాలిస్తామని చెప్పారు. అది మొక్కుబడి తంతుగానే ముగిసింది. ఆ కాలంలో శిక్షణ ముగించుకొని, గౌరవప్రదమైన జీతాలు పొందినవారు చాలా తక్కువే. ఆయన తరువాత ‘బాబు వస్తేనే జాబు’ అంటూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ, ఆయన హయాంలో.. ఉన్న ఉపాధి శిక్షణ కేంద్రాలు కూడా ఒక్కొక్కటిగా మూత పడుతున్నాయి.
సాక్షి, రాజమండ్రి :ఇంటర్, డిగ్రీ చదివిన యువకులకు సాంకేతిక శిక్షణ ఇచ్చి, ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించేందుకు 2005-06లో అప్పటి ప్రభుత్వం ఎంప్లాయిమెంట్ జనరేషన్ మార్కెటింగ్ మిషన్(ఈజీఎంఎం) పేరుతో వృత్తి శిక్షణ కేంద్రాలు ప్రారంభించింది. యువతకు ఉపాధి శిక్షణ ఇచ్చి, కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగావ కాశాలు కల్పించడం ప్రారంభించారు. పేద, మధ్య తరగతి యువతలో ఈ పథకం ఆత్మవిశ్వాసం నింపింది. కానీ తర్వాత ఈ పథకానికి రాజకీయ రంగు పులిమారు. గత కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఈ పథకానికి ‘రాజీవ్ యువకిరణాలు’గా పేరు మార్చింది. ఏటా లక్ష ఉద్యోగాలన్న నినాదంతో పథకాన్ని కొనసాగించింది. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా 45 శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. కానీ శిక్షణ పొందిన ఏ ఒక్కరికీ రూ.10 వేలు వేతనం వచ్చే ఉద్యోగాలు కూడా కల్పించలేకపోయారు. సుమారు ఐదు వేల మంది రూ.8 వేల లోపు వేతనం వచ్చే ఉద్యోగాలే పొందారు. కానీ, నానాటికీ పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయం చాలకపోవడంతో చాలామంది మధ్యలోనే ఉద్యోగాలు వదులుకున్నారని తెలుస్తోంది.
అంకెల్లో పథకం..
రాజీవ్ యువకిరణాల్లో భాగంగా 2012-13లో జిల్లాలో 155 శిక్షణ కేంద్రాలు పెట్టేందుకు ప్రతిపాదించగా, 45 మాత్రమే ఏర్పడ్డాయి. 2012 నుంచి 2014 తొలి త్రైమాసికం వరకూ మొత్తం 1.45 లక్షల మంది శిక్షణకు పేర్లు నమోదు చేయించుకున్నారు. వీరిలో 13,676 మందికి శిక్షణ ఇవ్వగా ఉపాధి పొందినవారు కేవలం 5 వేల మంది మాత్రమే. 2012-13లో 265 బ్యాచ్‌ల్లో 7,725 మందికి శిక్షణ ఇవ్వగా 2,686 మందికి మాత్రమే ఉపాధి కల్పించారు. 2013-14లో 211 బ్యాచ్‌ల ద్వారా 5,710 మందికి శిక్షణ ఇవ్వగా వీరిలో 2,151 మంది మాత్రమే ఉపాధి పొందారు. 2014-15 తొలి త్రైమాసికంలో కేవలం మూడు సెంటర్ల ద్వారా మూడు బ్యాచ్‌లలో కేవలం 241 మందికి మాత్రమే శిక్షణ ఇచ్చారు.
ఆరంభం మాత్రం అదుర్సే
2006-09 మధ్య సుమారు 15 వేల మందికి శిక్షణ ఇవ్వగా, వీరిలో 12 వేల మంది ఉపాధి పొందారు. తర్వాత 2010-11లో 1500 మందికి శిక్షణ ఇవ్వగా, వారిలో 1250 మంది ఉపాధి పొందారు. 2011-12లో 4800 మంది శిక్షణ పొందగా, వారిలో 3850 మందికి ఉపాధి లభించింది. అంటే శిక్షణ పొందినవారిలో సుమారు 82 శాతం ఉపాధి పొందారు. ఆ తర్వాత 2012-14 మధ్యకాలంలో శిక్షణ పొందినవారిలో 35 శాతం మందికి కూడా ఉపాధి దక్కలేదు.
కుంటుబడిన శిక్షణ
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉపాధి శిక్షణ కార్యక్రమాలు పూర్తిగా కుంటుబడ్డాయి. పథకం దాదాపు మూలన పడింది. ఒకటొకటిగా శిక్షణ కేంద్రాలు మూత పడడంతో వాటి సంఖ్య 45 నుంచి మూడుకు పడిపోయింది. యువతకు జాబు రావాలంటే బాబు అధికారంలోకి రావాలని స్వయంగా చంద్రబాబునాయుడే ప్రచారం చేసుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి శిక్షణలను మూలనపడేశారు. ఇలాగైతే జాబు వచ్చేదెలా అని విద్యావంతులైన నిరుద్యోగ యువత ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు.