Rajiv yuva kiranalu
-
ఉపాధికి..చేటుకాలం
‘ముందుంది మంచికాలం’ అంటూ గత ‘ముఖ్య’ నేత హడావుడి చేశారు. రాజీవ్ యువకిరణాలు పేరుతో యువతకు ఉపాధి శిక్షణ ఇచ్చి, ఏటా లక్ష ఉద్యోగాలిస్తామని చెప్పారు. అది మొక్కుబడి తంతుగానే ముగిసింది. ఆ కాలంలో శిక్షణ ముగించుకొని, గౌరవప్రదమైన జీతాలు పొందినవారు చాలా తక్కువే. ఆయన తరువాత ‘బాబు వస్తేనే జాబు’ అంటూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ, ఆయన హయాంలో.. ఉన్న ఉపాధి శిక్షణ కేంద్రాలు కూడా ఒక్కొక్కటిగా మూత పడుతున్నాయి. సాక్షి, రాజమండ్రి :ఇంటర్, డిగ్రీ చదివిన యువకులకు సాంకేతిక శిక్షణ ఇచ్చి, ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించేందుకు 2005-06లో అప్పటి ప్రభుత్వం ఎంప్లాయిమెంట్ జనరేషన్ మార్కెటింగ్ మిషన్(ఈజీఎంఎం) పేరుతో వృత్తి శిక్షణ కేంద్రాలు ప్రారంభించింది. యువతకు ఉపాధి శిక్షణ ఇచ్చి, కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగావ కాశాలు కల్పించడం ప్రారంభించారు. పేద, మధ్య తరగతి యువతలో ఈ పథకం ఆత్మవిశ్వాసం నింపింది. కానీ తర్వాత ఈ పథకానికి రాజకీయ రంగు పులిమారు. గత కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఈ పథకానికి ‘రాజీవ్ యువకిరణాలు’గా పేరు మార్చింది. ఏటా లక్ష ఉద్యోగాలన్న నినాదంతో పథకాన్ని కొనసాగించింది. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా 45 శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. కానీ శిక్షణ పొందిన ఏ ఒక్కరికీ రూ.10 వేలు వేతనం వచ్చే ఉద్యోగాలు కూడా కల్పించలేకపోయారు. సుమారు ఐదు వేల మంది రూ.8 వేల లోపు వేతనం వచ్చే ఉద్యోగాలే పొందారు. కానీ, నానాటికీ పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయం చాలకపోవడంతో చాలామంది మధ్యలోనే ఉద్యోగాలు వదులుకున్నారని తెలుస్తోంది. అంకెల్లో పథకం.. రాజీవ్ యువకిరణాల్లో భాగంగా 2012-13లో జిల్లాలో 155 శిక్షణ కేంద్రాలు పెట్టేందుకు ప్రతిపాదించగా, 45 మాత్రమే ఏర్పడ్డాయి. 2012 నుంచి 2014 తొలి త్రైమాసికం వరకూ మొత్తం 1.45 లక్షల మంది శిక్షణకు పేర్లు నమోదు చేయించుకున్నారు. వీరిలో 13,676 మందికి శిక్షణ ఇవ్వగా ఉపాధి పొందినవారు కేవలం 5 వేల మంది మాత్రమే. 2012-13లో 265 బ్యాచ్‌ల్లో 7,725 మందికి శిక్షణ ఇవ్వగా 2,686 మందికి మాత్రమే ఉపాధి కల్పించారు. 2013-14లో 211 బ్యాచ్‌ల ద్వారా 5,710 మందికి శిక్షణ ఇవ్వగా వీరిలో 2,151 మంది మాత్రమే ఉపాధి పొందారు. 2014-15 తొలి త్రైమాసికంలో కేవలం మూడు సెంటర్ల ద్వారా మూడు బ్యాచ్‌లలో కేవలం 241 మందికి మాత్రమే శిక్షణ ఇచ్చారు. ఆరంభం మాత్రం అదుర్సే 2006-09 మధ్య సుమారు 15 వేల మందికి శిక్షణ ఇవ్వగా, వీరిలో 12 వేల మంది ఉపాధి పొందారు. తర్వాత 2010-11లో 1500 మందికి శిక్షణ ఇవ్వగా, వారిలో 1250 మంది ఉపాధి పొందారు. 2011-12లో 4800 మంది శిక్షణ పొందగా, వారిలో 3850 మందికి ఉపాధి లభించింది. అంటే శిక్షణ పొందినవారిలో సుమారు 82 శాతం ఉపాధి పొందారు. ఆ తర్వాత 2012-14 మధ్యకాలంలో శిక్షణ పొందినవారిలో 35 శాతం మందికి కూడా ఉపాధి దక్కలేదు. కుంటుబడిన శిక్షణ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉపాధి శిక్షణ కార్యక్రమాలు పూర్తిగా కుంటుబడ్డాయి. పథకం దాదాపు మూలన పడింది. ఒకటొకటిగా శిక్షణ కేంద్రాలు మూత పడడంతో వాటి సంఖ్య 45 నుంచి మూడుకు పడిపోయింది. యువతకు జాబు రావాలంటే బాబు అధికారంలోకి రావాలని స్వయంగా చంద్రబాబునాయుడే ప్రచారం చేసుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి శిక్షణలను మూలనపడేశారు. ఇలాగైతే జాబు వచ్చేదెలా అని విద్యావంతులైన నిరుద్యోగ యువత ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. -
మమ్ములను కూడా మోసం చేసిండ్లు
శాయంపేట : రాజీవ్ యువకిరణాలు, తక్కువ ధరకు ల్యాప్‌టాప్‌లు, వాషింగ్‌మిషన్ల స్కీమ్‌తో ఓ ముఠా మహిళలను మోసగించిన వైనంపై ‘మహిళా సంఘాలకు కుచ్చుటోపి’ శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం కథనం ప్రచురితం కావడంతో బాధిత మహిళలు ఐకేపీ కార్యాలయానికి చేరుకున్నారు. వీరిలో మండలంలోని మైలారం, పత్తిపాక, వసంతాపూర్, శాయంపేటకు చెందిన సుమారు 50 మంది ఉన్నారు. తమను కూడా ఇలాగే మోసగించి.. డబ్బులు తీసుకెళ్లారని తమ గోడు వెల్లబోసుకున్నారు. అందులో ఒక్కొక్కరిది ఒక్కో గాథ. కొంతమంది భర్తలకు తెలియకుండా తమ ఇంట్లో దాచుకున్న డబ్బులు చెల్లించగా.. మరికొంత మంది తమ కుమారులు పనిచేసి తీసుకొచ్చిన జీతాలను వారికి ముట్టజెప్పారు. కాగా అందరు కలిసి తమకు జరిగిన అన్యాయాలను ఒకరికొకరు చెప్పుకున్నారు. -
కిరణాలు మాయం
రాజీవ్ యువకిరణాలపై నీలినీడలు ఉద్యోగాలొచ్చింది 36 శాతం మందికే అదీ రోజు కూలీ కంటే తక్కువ జీతాలు కొత్త ఉద్యోగాలు కలే! ‘‘లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు..కార్పొరేట్ కంపెనీల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ కార్యక్రమాలు.. కోట్లు వెచ్చించి శిక్షణ భాగస్వాములతో ట్రైనింగ్‌లు..’ ఇవీ ‘రాజీవ్ యువ కిరణాలు’ పథకం ప్రవేశపెట్టిన నాటి ఉద్దేశ్యాలు. అయితే ఈ కిరణాలు పెద్దగా ఎవరికీ వెలుగునిచ్చింది లేదు. భవిష్యత్తులోనూ ఈ పథకంపై నీలినీడలే గోచరిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం ప్రాధాన్యతేమిటో తెలియకపోవడంతో అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదు...’’ విశాఖ రూరల్ : ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగం ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. కనీసం ప్రస్తుతం అమలవుతున్న యువకిరణాలు పథకం అమలు తీరుతెన్నులు పట్టించుకోవడం లేదు. దీంతో నిరుద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రతి ఇంట్లోను ఒకరికి ఉద్యోగం కల్పిస్తామంటూ ఊదరగొట్టి.. నిరుద్యోగ యువతకు ఆశలు కల్పించిన ప్రభుత్వం చివరకు ఉసూరుమనిపించింది. నిరుద్యోగ యువతకు శిక్షణ కార్యక్రమాల పేరుతో ప్రైవేటు సంస్థలను పెంచి పోషించి.. కోట్లు ముట్టజెప్పి.. యువతకు ఉద్యోగాలు కల్పించే విషయంలో లక్ష్యానికి కనీసం చేరుకోలేక చతికిలపడింది. లక్ష్యంలో కేవలం 36 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు చూపించి చేతులు దులుపుకొంది. లక్ష్యాలు ఘనం... నిరుద్యోగ యువతకు వారి అర్హత, ఆసక్తి మేరకు ఆయా రంగాల్లో శిక్షణనిచ్చి ఉద్యోగాలు కల్పిస్తామంటూ ప్రభుత్వం 2011లో ఆగస్టు 20న రాజీవ్ యువకిరణాలు పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా జిల్లాలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు లక్ష్యాలను నిర్ధేశిస్తూ వస్తోంది. దీని ప్రకారం జిల్లాలో 2013, ఏప్రిల్ నుంచి 2014, మార్చి 31వ తేదీ వరకు 26,417 మందికి ఉద్యోగాలు కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్(ఈజీఎంఎం- దీన్ని డీఆర్డీఏ పర్యవేక్షిస్తుంటుంది), మెప్మా, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ శాఖల ద్వారా వీరికి శిక్షణనిచ్చి ఉద్యోగాలు కల్పించాల్సి ఉంది. కానీ ఇప్పటిదాకా 9,636 మందికి మాత్రమే ఉద్యోగాలు చూపించారు. ఇంకా 16,781 మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. రోజు కూలి కన్నా తక్కువ జీతం జిల్లాలో నిర్ధేశిత లక్ష్యంలో 36 శాతం మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభించాయి. ఇందులో 25 శాతం మంది వరకు అసంఘటిత రంగ సంస్థల్లోనే పనిచేస్తున్నారు. ఉద్యోగ భద్రత లేక, కనీస వేతనం కూడా అందక అవస్థలు పడుతున్నారు. దీంతో దాదాపుగా 15 శాతం మంది ఉద్యోగాలను మానేసినట్టు అధికారులే చెబుతున్నారు. ఈ పథకం ద్వారా చెప్పుకోదగ్గ ఉద్యోగాలు వచ్చిన వారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. కొత్త ఉద్యోగాలు కలే! టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగాల కల్పనపై కనీసం దృష్టి సారించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీకాలంలో 60 ఏళ్లకు పెంచడంతో ఇప్పట్లో ప్రభుత్వ కొలువులు దక్కే అవకాశం లేదని నిరుద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలు చూపించాల్సిన ప్రభుత్వం కనీసం ఆ విషయాన్నే పట్టించుకోవడం లేదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ అధికారంలోకి వచ్చిన తరువాత గాలికొదిలేసిందని నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు. -
అరకొర శిక్షణ .. పనికి రాని ఉపాధి
అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : ‘శిక్షణతో కూడిన ఉపాధి అంటే ఎంతో ఆశతో వెళ్లాం.. అక్కడ శిక్షణ ఏమాత్రం సరిగా లేదు. వారు చూపించిన ఉద్యోగం ఒక్క రోజు కూడా చేయలేక పోయాం. దీంతో ఉద్యోగం మానేసి సొంతూళ్లకు వచ్చాం. అయితే మా సర్టిఫికెట్లు ఇవ్వకుండా శిక్షణ సంస్థల నిర్వాహకులు ఇబ్బందులు పెడుతున్నారు’ అంటూ పలువురు నిరుద్యోగ అభ్యర్థులు డీఆర్డీఏ పీడీ నీలకంఠారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లాలో వివిధ గ్రామాలకు చెందిన కవిత, భాను, అనూషా, అంజలి, హరిత, సులోచన, త్రివేణి, నాగజ్యోతి, నారప్పరెడ్డి, నాగప్ప, తదితరులు డీఆర్డీఏ కార్యాలయంలో పీడీని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఏడాది క్రితం నగరంలోని స్పందన ట్రైనింగ్ సెంటర్లో రాజీవ్ యువకిరణాలు పథకం కింద కంప్యూటర్ కోర్సులు పూర్తి చేశామని, అనంతరం హైదరాబాద్‌లో పెళ్లి సంబంధాలు చూపే ఓ సంస్థలో ఉద్యోగం చూపించారని చెప్పారు. కానీ నెలకు 50 సంబంధాలు కుదిర్చితే తప్ప జీతం ఇవ్వబోమని ఆ సంస్థ నిర్వాహకులు చెప్పారని, జీతం కూడా చాలక పోవడంతో తిరిగొచ్చేశామని వాపోయారు. తాము కోర్సు పూర్తి చేసినట్లుగా స్పందన ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు సర్టిఫికెట్లు ఇవ్వక పోగా, తమ 10వ తరగతి ఒరిజనల్ సర్టిఫికెట్ కూడా వారే తీసుకుని వాటిని ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్టిఫికెట్లు ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, గతంలో ఉద్యోగాల కోసం తమను తీసుకెళ్లినపుడు కూడా ఒక్కొక్కరి నుంచి రూ.500 వసూలు చేశారని వారు ఫిర్యాదు చేశారు. సర్టిఫికెట్లు వారి దగ్గర ఉండడంతో వేరే ఉద్యోగాలకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవే దన వ్యక్తం చేశారు. దీంతో పీడీ నీలకంఠారెడ్డి స్పందిస్తూ.. రాజీవ్ యువ కిరణాలు సిబ్బందిని వెంట పంపి సదరు కంప్యూటర్ సెంటర్ నిర్వాహకుల నుంచి బాధిత విద్యార్థులకు సర్టిఫికెట్లను ఇప్పించారు. నిరుద్యోగ అభ్యర్థులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లాలోని కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ నిర్వాహకులను ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. -
యువ కిరణాలపై ఆంక్షల మబ్బులు
సీతంపేట, న్యూస్‌లైన్: రాజీవ్ యువకిరణాలతో ఉపాధి వెలుగులు పంచుతున్నామని ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం.. మరోవైపు ఆ కిరణాలను మసకబార్చే చర్యలకు ఒడిగడుతోంది. ఈ పథకం కింద ఎంపికయ్యే అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే కేంద్రాలను ఒక్కొక్కటిగా మూసి వేస్తోంది. ఇందులో భాగంగా సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఆరు కేంద్రాలకు నెల రోజుల కిందటే మంగళం పాడారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఐకేపీ ద్వారా నిర్విహ స్తున్న హిరమండలంలోని బీపీవో (బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్),పాతపట్నంలోని అకౌంటింగ్ ప్యాకేజీ కేంద్రాన్ని, సరుబుజ్జిలి, పలాసల్లోని కంప్యూటర్ అసిస్టెంట్ శిక్షణ కేంద్రాలను, సోంపేటలోని అకౌంట్స్ శిక్షణ కేంద్రాన్ని,పాలకొండలోని డాటాప్రో కంప్యూటర్ కేంద్రాన్ని ఎత్తివేశారు. గత రెండే ళ్లుగా పని చేస్తున్న ఈ కేంద్రాలను మూసివేయడంతో శిక్షణ కార్యక్రమాలు మూలన పడ్డాయి. ప్రస్తుతం సీతంపేటలోని పీఎంఆర్సీలో ఈజీఎంఎం, సూయింగ్ మెషిన్, హడ్డుబంగిలోని తాపీ శిక్షణ, అడ్డాకులగూడలోని నాక్, ఎచ్చెర్లలోని హోమ్‌కేర్ నర్సింగ్ కేంద్రాల్లోనే శిక్షణ ఇస్తున్నారు. వీటిలో 200 మందికి మించి నిరుద్యోగులు లేరు. ఉపాధి అవకాశాలు అంతంత మాత్రమే మరోవైపు శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఆయా సంస్థలు చూపిస్తున్న ఉపాధి అవకాశాలు అరకొరగానే ఉంటున్నాయి. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఎంవోయూ ప్రకారం ఈజీఎంఎంలో భాగస్వాములైన స్కైలార్క్, శ్రీటెక్నో వంటి ప్రైవేటు సంస్థలు సబ్‌ప్లాన్ మండల కేంద్రాల్లో నిరుద్యోగులకు శిక్షణ ఇస్తున్నాయి. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి నిబంధనల ప్రకారం ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలి. ప్రతి వంద మందిలో కనీసం 75 మందికైనా ఉద్యోగవకాశాలు కల్పించాల్సిన బాధ్యత శిక్షణ ఇచ్చే సంస్థలదే. అయితే ఈ విషయంలో సదరు సంస్థలు ఆసక్తి చూపించడం లేదు. ఆయా సంస్థలపై ఇతర మార్గాల్లో ఒత్తిడి తెచ్చి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, అలా చేయకుండా శిక్షణ కేంద్రాల ఏర్పాటుపై ఆంక్షలు విధించింది. గతంలో ఒక సంస్థకు రాష్ట్రంలో ఎన్ని శిక్షణ కేంద్రాలైనా నెలకొల్పే వెసులుబాటు ఉండగా, ప్రస్తుతం ఒక సంస్థ రాష్ట్రంలో ఐదు కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఈ ఆంక్షల కారణంగానే సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఆరు కేంద్రాలను ఎత్తి వేసిన ట్లు తెలిసింది. తగ్గిన నిరుద్యోగుల సంఖ్య ప్రతి ఏటా కనీసం వెయ్యి మంది వరకు వివిధ కేంద్రాల్లో మార్కెటింగ్, తాపీ పని, కంప్యూటర్ అసిస్టెంట్, నర్సింగ్, అకౌంటింగ్ ప్యాకేజీ, బీపీవో, హోటల్ మేనేజ్మెంట్ తదితర కోర్సుల్లో శిక్షణ పొందేవారు. ఇప్పుడు వారి సంఖ్య 200 లోపే ఉండటం గమనార్హం. కాగా ఉపాధి అవకాశాల పేరుతో శిక్షణ పూర్తి చేసుకున్న వారిని చైన్నై, హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపూర్ వంటి ప్రాంతాలకు పంపిస్తున్నా అక్కడి యాజమాన్యాలు జీతాలు సరిగా చెల్లించకపోవడం, శ్రమకు తగ్గ వేతనం లభించకపోవడం వంటి కారణాలతో వెనుదిరుగుతున్నారు. దీంతో గ్రామీణ నిరుద్యోగులు శిక్షణ పొందడానికే అయిష్టత చూపుతున్నారు. అధికారులు జాబ్‌మేళాలు పెడుతున్నప్పటకీ ఫలితం లేకపోతోంది. శిక్షణలకు ఢోకాలేదు: శ్రీనివాసరావు, జాబ్స్ జేడీఎం నిరుద్యోగుల శిక్షణ కార్యక్రమాలకు ఎటువంటి ఢోకాలేదు. సీఈవో రివ్యూ చేసిన తర్వాతే ఐటీడీఏ పరిధిలో ఉన్న కేంద్రాలను ఎత్తివేశాం. వీటి స్థానంలో కొత్త కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఏర్పాటు చేస్తాం. -
పారని ‘పథకం’
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: అనూహ్య పరిస్థితుల్లో పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో తనదైన ముద్రను కనబర్చలేకపోయారు. మూడేళ్లు పూర్తి చేసుకున్నారనే మాటే తప్పిస్తే.. ఒక్కటంటే ఒక్క పథకం కూడా ప్రజలకు చేరువ కాలేకపోయింది. కొత్త పథకాలకు రూపకల్పన చేయడంతో పని అయిపోయినట్లుగా భావించడం.. లబ్ధిదారుల్లో అధికార పార్టీ అనుయాయులకే పెద్దపీట వేస్తున్నారనే అపవాదు.. పారదర్శకత లోపించడం ఇతరత్రా కారణాలతో మెరుగైన పాలనను అందించలేకపోయారనేది విశ్లేషకులు అభిప్రాయం. ముఖ్యమంత్రి హోదాలో కిరణ్‌కుమార్‌రెడ్డి పదిసార్లు జిల్లాలో పర్యటించినా ఇక్కడి ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేకపోయారు. అమ్మహస్తం.. బంగారుతల్లి.. రాజీవ్ యువకిరణాలు.. ఇందిర జలప్రభ.. అమృతహస్తం.. రైతులు, స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు.. తదితర పథకాలను సీఎం ఆర్భాటంగా ప్రవేశపెట్టినా ప్రచారానికే పరిమితమయ్యాయి. అమలు అస్తవ్యస్తంగా మారడంతో వినియోగదారులు, లబ్ధిదారుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన ఇచ్చిన హామీలు కూడా అమలుకు నోచుకోకపోవడం గమనార్హం. 2011 సెప్టెంబర్ మొదటి వారంలో జిల్లాలో ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా కిరణ్‌కుమార్‌రెడ్డి మూడు రోజులు పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు 36 హామీలు గుప్పించారు. ఇందులో ఐదారు మినహా మిగిలినవేవీ పరిష్కారానికి నోచుకున్న దాఖలాల్లేవు. శ్రీశైలం ముంపు బాధితుల్లో కొందరికి ఉద్యోగావకాశాలు కల్పించినా మిగిలిన వారికి ఆరు నెలల్లో ఉద్యోగాలిస్తామని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించినా ఇప్పటికీ అతీగతీ లేకపోయింది. కొన్ని హామీలకు పరిష్కారం లభించినా నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఇందిరమ్మ బాటలో వివిధ వర్గాల ప్రజలు సీఎంకు పలు సమస్యలపై వినతులు అందజేశారు. దాదాపు 360 దరఖాస్తులు అందగా.. పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు పంపడంతో చేతులు దులిపేసుకున్నారు. వీటిలో ఒక్క సమస్యా పరిష్కారానికి నోచుకోకపోవడంతో బాధితులు ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజాదర్బార్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇక నీటి పారుదల రంగం కూడా అస్తవ్యస్తంగా మారింది. హంద్రీనీవా ప్రాజెక్టును రెండేళ్ల క్రితం ఆడంబరంగా ప్రారంభించినా జిల్లాలో ఒక్క ఎకరాకూ సాగునీరు అందకపోవడం గమనార్హం. హంద్రీనీవా పరిధిలోని చెరువుల్లో నీటిని నింపి ఆయా ప్రాంతాల ప్రజల దాహార్తి తీర్చాలని ప్రజలు కోరుతున్నా చెవికెక్కించుకునే నాథుడే కరువయ్యాడు. -
మైనార్టీలకూ ‘యువకిరణాలు’
నల్లగొండ, న్యూస్‌లైన్: మైనార్టీ యువతకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న రాజీవ్ యువకిరణాల తరహాలోనే మైనార్టీ యువతీ, యువకుల కోసం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. మైనార్టీలకు యువ కిరణాలు పథకం కింద రాష్ట్ర మెనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రస్తుత సంవత్సరం నుంచే జిల్లాలో ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, జైనులు, బౌద్ధ తదితర మైనార్టీ విభాగాలకు చెందిన యువతీ యువకులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇప్పించడంతో పాటు ఉద్యోగావకాశాలు కల్పించాలని, స్వయం ఉపాధి కోరే వారికి రుణాలిప్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు కార్పొరేషన్ అధికారులు కార్యక్రమ నిర్వహణ, ఏజెన్సీల ఎంపికలో తలమునకలవుతున్నారు. 25రంగాల్లో ఉచిత శిక్షణ గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు పలు రంగాల్లో ఉచిత వసతితో కూడిన శిక్షణ ఇప్పించి వారికి ఉద్యోగావకాశాలు కల్పించేం దుకు రాష్ట్ర ప్రభుత్వం 2011లో రాజీవ్ యువకిరణాల పథకాన్ని ప్రారంభించిన విషయం విదితమే. అయితే ఇప్పుడు మైనార్టీ విద్యార్థులకు ప్రత్యేకించి విద్యార్హత మేరకు కోర్సులు నిర్వహించాలని నిర్ణయించింది. పదో తరగతి నుండి ఎంటెక్ చేసిన అభ్యర్థులకు విద్యార్హతనుబట్టి సాఫ్ట్వేర్ రంగంలో, ఇంజినీరింగ్, టెక్స్టైల్స్, పారామెడికల్, టూరిజం, ఆటోమోబైల్స్, ఫైర్ అండర్ సెఫ్టీ, సెక్యూరిటీ గార్డు వంటి 25 రంగాల్లో ఉచిత శిక్షణ ఇప్పించి ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. ఉద్యోగావకాశాలపైనే అనుమానం.. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే శిక్షణ విషయాన్ని పక్కనబెడితే ఉద్యోగవకాశాల కల్పన విషయంలో మాత్రం అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రస్తుతం రాజీవ్ యువ కిరణాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఏజెన్సీలు నిరుద్యోగులకు శిక్షణ ఇప్పించినా, ఉద్యోగావకాశాలు కల్పించడంలో విఫలమయ్యాయయన్న విమర్శను మూటకట్టుకున్నాయి. కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొనసాగనున్న ఏజెన్సీ నిర్వాహకులు శిక్షణ పొందిన విద్యార్థులకు ఉద్యోగం కల్పించే అవకాశాలు చాలావరకు తక్కువే. డివిజన్లలో శిక్షణ కేంద్రాలు శిక్షణ కేంద్రాలు డివిజన్ కేంద్రాలతో పాటు ముఖ్య కేంద్రాల్లో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. కోర్సు మేరకు నెల నుండి మూడు నెలల కాల పరిమితితో శిక్షణ ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా శిక్షణ కేంద్రాలు డివిజన్, ముఖ్య కేంద్రాల్లోనే నిర్వహించనుండడంతో పరిసర ప్రాంత, గ్రామాల విద్యార్థులకు ప్రతిరోజూ రాకపోకలు ఇబ్బంది కలుగనుంది. దీన్ని ఏవిధంగా పరిష్కరిస్తారో వేచిచూడాల్సి ఉంది. -
మైనార్టీలకూ యువ కిరణాలు
సాక్షి, మంచిర్యాల : జిల్లా మైనార్టీ యువతకు శుభవార్త. ప్రస్తుతం కొనసాగుతున్న రాజీవ్ యువకిరణాల మాదిరిగానే ప్రభుత్వం మైనార్టీ యువతీ యువకుల కోసం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ ఏడాది నుంచే జిల్లాలో ముస్లింలు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీ యువతీయువకులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇప్పించి, వారికి ఉద్యోగాలు కల్పించడంతోపా టు స్వయం ఉపాధి కోరే వారికి రుణాలిప్పించాలని నిర్ణయించింది. కార్యక్రమ నిర్వహణ కోసం ఇప్పటికే రూ.45 లక్షలు విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా సుమారు లక్షకు పైగా మందికి లబ్ధి చేకూరనుంది. ఈ మేరకు కార్పొరేషన్ అధికారులు కార్యక్రమ నిర్వహణ, ఏజెన్సీల ఎంపికలో నిమగ్నమయ్యారు. 25 రంగాల్లో ఉచిత శిక్షణ గామీణ ప్రాంతాల నిరుద్యోగులకు పలు రంగాల్లో ఉచిత వసతితో కూడిన శిక్షణ ఇప్పించి వారికి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం 2011లో రాజీవ్ యువకిరణాల పథకాన్ని ప్రారంభించింది. డీఆర్డీఏ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కొనసాగిన 16 కేంద్రాల ద్వారా ఎక్కువగా గ్రామీణ యువతీ, యువకులకే లబ్ధి చేకూరింది. అదే సమయంలో మెప్మా ఆధ్వర్యంలో పట్టణాల్లోనూ స్థానిక యువతీ యువకుల కోసం మంచిర్యాల, మందమర్రి, నిర్మల్, ఆదిలాబాద్, కాగజ్‌నగర్‌లో అర్బన్ కేంద్రాలు ప్రారంభించారు. వీటిలో మైనార్టీలు స్వల్ప సంఖ్యలో హాజరుకావడంతో వీరి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. వీరి విద్యార్హతను బట్టి కోర్సులు నిర్వహించాలని నిర్ణయించింది. శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి కోసం రుణాలు ఇప్పించేందుకు ముందుకువచ్చింది. వసతి మాత్రం కల్పించ లేదు. పదో తరగతి నుంచి ఎంటెక్ చేసిన అభ్యర్థులకు విద్యార్హతను బట్టి సాఫ్ట్వేర్ రంగంలో, ఇంజినీరింగ్, టెక్స్టైల్స్, పారామెడికల్, టూరిజం, ఆటోమోబైల్స్, ఫైర్ అండ్ సేఫ్టీ, సెక్యూరిటీగార్డ్ వంటి 25 రంగాల్లో ఉచిత శిక్షణ ఇప్పించి ఉద్యోగవకాశాలు కల్పించనుంది. ఐదో తరగతి నుంచి పదో తరగతి చదివిన వారికి ఇంజినీరింగ్, ప్రొడక్షన్, ఫ్యాషన్స్ అండ్ బ్యూటీషియన్, ఇంటీరియర్ డెకొరేషన్, ఎంబ్రాయిడరీ అండ్ జార్దోజి వర్క్స్, కలంకారి వర్క్స్ రంగాల్లో శిక్షణతోపాటు ఆయా రంగాల్లో షాపులు నిర్వహించుకుంనేందుకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించనుంది. మరోపక్క.. శిక్షణ కేంద్రాలు డివిజన్ కేంద్రాలతోపాటు ముఖ్య కేంద్రాల్లో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. కోర్సును బట్టి నెల నుంచి మూడు నెలల వరకు కాల పరిమితితో శిక్షణ ఇవ్వనుంది. అయితే.. శిక్షణ కేంద్రాలు డివిజన్, ముఖ్య కేంద్రాల్లోనే నిర్వహిస్తుండడంతో పరిసర గ్రామాల విద్యార్థులు ప్రతి రోజూ వచ్చి వెళ్లడం ఇబ్బందిగా ఉంటుందని.. ప్రభుత్వం శిక్షణతోపాటు వసతి సౌకర్యం కూడా కల్పిస్తే అక్కడే ఉండి మెరుగైన శిక్షణ పొందే వీలుంటుందని మంచిర్యాల సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అధ్యక్షుడు అబ్దుల్ఖాలీఖ్ కోరారు. ఉద్యోగావకాశాలపైనే అనుమానం మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే శిక్షణ విషయాన్ని పక్కన బెడితే ఉద్యోగవకాశాల కల్పన విషయంలో మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రాజీవ్ యువ కిరణాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఏజెన్సీలు నిరుద్యోగులకు శిక్షణ ఇప్పించి ఉద్యోగావకాశాలు కల్పించడంలో మాత్రం విఫలమయ్యాయి. కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొనసాగనున్న ఏజెన్సీ నిర్వాహకులు శిక్షణ పొందిన విద్యార్థులకు ఉద్యోగం కల్పించే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఈ విషయమై స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ జిల్లా ఎగ్జిక్యూటీవ్ డెరైక్టర్ వి. సుబ్రమణ్యశాస్త్రి వివరణ ఇస్తూ.. ‘మెరుగైన శిక్షణతో పాటు ఉద్యోగవకాశాలు కల్పించే స్థాయి ఉన్న ఏజెన్సీలకే కాంట్రాక్టు అప్పగిస్తాం. కేంద్రాల నిర్వహణపై పూర్తి అధ్యయనం చేసి.. ఏజెన్సీలను ఎంపిక చేస్తాం. అవసరమైతే వారి ద్వారా ఉద్యోగవకాశాలు కల్పిస్తున్నట్లు ఒప్పంద పత్రం రాయించుకుంటాం. అర్హులైన, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జిల్లా కేంద్రంలోని మైనార్టీ కార్యాలయంలో సంప్రదించాలని చెప్పారు. -
‘కిరణాల’ పేరిట దగా !
నిరుద్యోగులను నిండా ముంచుతున్న బోగస్ సంస్థలు అధికారుల సమక్షంలో ఇంటర్వ్యూలు.. ఆనక భారీగా డిపాజిట్ల వసూలు సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య పరిరక్షణ పేర పుట్టుకొచ్చిన స్వచ్ఛంద సంస్థలవి... యువకులకు ఉద్యోగాల ఆశ ఎరచూపి డబ్బులు దండుకోవటం వాటి పన్నాగం. ఇలాంటి సంస్థల గుట్టు రట్టు చేసి నిర్వాహకులను కటకటాల వెనక్కు నెట్టాల్సిన అధికారులు, వాటితో జతకట్టారు. రాజీవ్ యువకిరణాల కింద నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చేస్తామని అధికారులు బొంకేసరికి అభ్యర్థులు ఎగబడ్డారు. ఇంకేముంది.. ఆ సంస్థల నిర్వాహకులు కోరినంత ముట్టజెప్పారు. ధనదాహం తీరాక.. ఓ మంచి ముహూర్తం చూసుకుని అవి బోర్డు తిప్పేశాయి. ఇదేం దారుణమంటూ అభ్యర్థులు నిలదీస్తే ‘మాకు సంబంధం లేదు, డబ్బులెవరికిచ్చారో వారిని అడుక్కోండి’ అంటూ అధికారులు చావు కబురు చల్లగా చెప్పారు. ఇలా వందలాది మంది యువజనులు దగా పడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మానస పుత్రిక ‘రాజీవ్ యువకిరణాలు’ పేరిట జరుగుతున్న నిలువు దోపిడీ ఇది! ఉద్యోగాల పేరు చెప్పి అమాయక యువత నుంచి డబ్బు దండుకొని ఉడాయించే దగాకోరులకు ఈ పథకం అండగా మారింది. వీరికి అధికారుల అండదండలు పుష్కలంగా ఉండటంతో నిరుద్యోగుల ఆశలు అడియాసలవుతున్నాయి. విచిత్రమేమిటంటే... ఉద్యోగాలు కల్పించినట్టుగా రాజీవ్ యువకిరణాలు వెబ్సైట్లో అధికారులు చేర్చిన జాబితాలలో ఇలా దగాపడ్డ యువకుల పేర్లు ఉండడం! సీఎం మెప్పు కోసం అధిక ఉద్యోగాలు కల్పించామని చెప్పుకోవడానికి అధికారుల నిర్వాకాలు ఇవి. నిండాముంచిన స్వచ్ఛంద సంస్థ కర్నూలు జిల్లాలో రూరల్ హెల్త్ ఇండియా సర్వీస్ ఆర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సంస్థ నిరుద్యోగులను నిండా ముంచింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి రక్తపోటు, మధుమేహం పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు ఇచ్చే ఉద్యోగాలను కల్పిస్తామంటూ ఆశలు రేపింది. రకరకాల ఉద్యోగాల్లో ఉపాధి చూపనున్నట్లు యువతకు ఎర వేసింది. వేల సంఖ్యలో యువకులు దరఖాస్తు చేసుకోగా.. డీఆర్డీఓ అధికారుల సమక్షంలో ఇంటర్వ్యూలు, శిక్షణ కార్యక్రమాల తంతు జరిపారు. ఎంపికైన వారి నుంచి సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో గుట్టుచప్పుడు కాకుండా ఒక్కొక్కరి నుంచి రూ. 20 వేల చొప్పున వసూలు చేశారు. భంగపడిన ఉద్యోగార్థుల గగ్గోలుతో ఈ అక్రమం వెలుగు చూసింది. కొద్దిరోజులకే ఆ సంస్థ బోర్డు తిప్పేసింది. మోసపోయిన బాధితులు అధికారులకు మొరపెట్టుకున్నారు. అధికారుల సమక్షంలో ఎంపికలు జరగడంతో ఇవి ప్రభుత్వ పక్షాన జరిగే నియామకాలుగానే భావించి అడిగినంత డబ్బు ఇచ్చామని అభ్యర్థులు వాపోతున్నారు. మోసపోయిన విషయం గ్రహించి డీఆర్డీఓ అధికారులను నిలదీస్తే... డబ్బు వసూలుతో తమకు సంబంధం లేదని చేతులు దులిపేసుకున్నారని బాధితులు వాపోయారు. జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదంటూ ‘రాజీవ్ యువకిరణాల’ బాధిత అభ్యర్థులు రోడ్డెక్కారు. దీంతో అధికారులు రాజీవ్ యువకిరణాలు వెబ్సైట్ నుంచి ఆయా అభ్యర్థుల పేర్లను తొలగించి చేతులు దులి పేసుకున్నారు. దీంతో యువకులు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. బోర్డు తిప్పేసిన ‘ఆరోగ్యదాత’ శ్రీకాకుళం జిల్లాలో ‘ఆరోగ్యదాత’ అనే సంస్థ పేరిట ఇలాంటి మోసమే చేసింది. అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన తర్వాత ఈ సంస్థ కూడా బోర్డు తిప్పేసింది. ఉద్యోగాల పేర అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్య తీసుకునే వారే కరువయ్యారు. దీంతో ఇలాంటిదే ఓ సంస్థ విశాఖపట్టణంలో తాజాగా దుకాణం తెరిచింది. ఇది కూడా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య పరీక్షలు చేసే ఉద్యోగాలిస్తామంటూ అభ్యర్థులకు గాలం వేస్తోంది. వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనూ ఇలాంటి బోగస్ సంస్థలు అధికారుల అండతో నిరుద్యోగులకు శఠగోపం పెట్టే పనుల్లో నిమగ్నమయ్యాయని వినికిడి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే సంగతి దేవుడెరుగు.. ‘రాజీవ్ యువకిరణాలు’ పేరిట నిరుద్యోగులను నిండా ముంచుతున్న వారికి చెక్ పెట్టలేకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనంగా చెప్పవచ్చు. ముఖ్యమంత్రి గొప్పగా చెప్పుకుంటున్న ఈ పథకంలో చీకటి కోణంపై ప్రభుత్వం దృష్టిసారించకపోవటం విమర్శలకు తావిస్తోంది.