సాక్షి, మంచిర్యాల : జిల్లా మైనార్టీ యువతకు శుభవార్త. ప్రస్తుతం కొనసాగుతున్న రాజీవ్ యువకిరణాల మాదిరిగానే ప్రభుత్వం మైనార్టీ యువతీ యువకుల కోసం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ ఏడాది నుంచే జిల్లాలో ముస్లింలు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీ యువతీయువకులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇప్పించి, వారికి ఉద్యోగాలు కల్పించడంతోపా టు స్వయం ఉపాధి కోరే వారికి రుణాలిప్పించాలని నిర్ణయించింది. కార్యక్రమ నిర్వహణ కోసం ఇప్పటికే రూ.45 లక్షలు విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా సుమారు లక్షకు పైగా మందికి లబ్ధి చేకూరనుంది. ఈ మేరకు కార్పొరేషన్ అధికారులు కార్యక్రమ నిర్వహణ, ఏజెన్సీల ఎంపికలో నిమగ్నమయ్యారు.
25 రంగాల్లో ఉచిత శిక్షణ
గామీణ ప్రాంతాల నిరుద్యోగులకు పలు రంగాల్లో ఉచిత వసతితో కూడిన శిక్షణ ఇప్పించి వారికి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం 2011లో రాజీవ్ యువకిరణాల పథకాన్ని ప్రారంభించింది. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కొనసాగిన 16 కేంద్రాల ద్వారా ఎక్కువగా గ్రామీణ యువతీ, యువకులకే లబ్ధి చేకూరింది. అదే సమయంలో మెప్మా ఆధ్వర్యంలో పట్టణాల్లోనూ స్థానిక యువతీ యువకుల కోసం మంచిర్యాల, మందమర్రి, నిర్మల్, ఆదిలాబాద్, కాగజ్‌నగర్‌లో అర్బన్ కేంద్రాలు ప్రారంభించారు. వీటిలో మైనార్టీలు స్వల్ప సంఖ్యలో హాజరుకావడంతో వీరి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. వీరి విద్యార్హతను బట్టి కోర్సులు నిర్వహించాలని నిర్ణయించింది. శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి కోసం రుణాలు ఇప్పించేందుకు ముందుకువచ్చింది. వసతి మాత్రం కల్పించ లేదు. పదో తరగతి నుంచి ఎంటెక్ చేసిన అభ్యర్థులకు విద్యార్హతను బట్టి సాఫ్ట్‌వేర్ రంగంలో, ఇంజినీరింగ్, టెక్స్‌టైల్స్, పారామెడికల్, టూరిజం, ఆటోమోబైల్స్, ఫైర్ అండ్ సేఫ్టీ, సెక్యూరిటీగార్డ్ వంటి 25 రంగాల్లో ఉచిత శిక్షణ ఇప్పించి ఉద్యోగవకాశాలు కల్పించనుంది.
ఐదో తరగతి నుంచి పదో తరగతి చదివిన వారికి ఇంజినీరింగ్, ప్రొడక్షన్, ఫ్యాషన్స్ అండ్ బ్యూటీషియన్, ఇంటీరియర్ డెకొరేషన్, ఎంబ్రాయిడరీ అండ్ జార్దోజి వర్క్స్, కలంకారి వర్క్స్ రంగాల్లో శిక్షణతోపాటు ఆయా రంగాల్లో షాపులు నిర్వహించుకుంనేందుకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించనుంది. మరోపక్క.. శిక్షణ కేంద్రాలు డివిజన్ కేంద్రాలతోపాటు ముఖ్య కేంద్రాల్లో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. కోర్సును బట్టి నెల నుంచి మూడు నెలల వరకు కాల పరిమితితో శిక్షణ ఇవ్వనుంది. అయితే.. శిక్షణ కేంద్రాలు డివిజన్, ముఖ్య కేంద్రాల్లోనే నిర్వహిస్తుండడంతో పరిసర గ్రామాల విద్యార్థులు ప్రతి రోజూ వచ్చి వెళ్లడం ఇబ్బందిగా ఉంటుందని.. ప్రభుత్వం శిక్షణతోపాటు వసతి సౌకర్యం కూడా కల్పిస్తే అక్కడే ఉండి మెరుగైన శిక్షణ పొందే వీలుంటుందని మంచిర్యాల సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అధ్యక్షుడు అబ్దుల్‌ఖాలీఖ్ కోరారు.
ఉద్యోగావకాశాలపైనే అనుమానం
మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే శిక్షణ విషయాన్ని పక్కన బెడితే ఉద్యోగవకాశాల కల్పన విషయంలో మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రాజీవ్ యువ కిరణాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఏజెన్సీలు నిరుద్యోగులకు శిక్షణ ఇప్పించి ఉద్యోగావకాశాలు కల్పించడంలో మాత్రం విఫలమయ్యాయి. కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొనసాగనున్న ఏజెన్సీ నిర్వాహకులు శిక్షణ పొందిన విద్యార్థులకు ఉద్యోగం కల్పించే అవకాశాలు తక్కువ ఉన్నాయి.
ఈ విషయమై స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ జిల్లా ఎగ్జిక్యూటీవ్ డెరైక్టర్ వి. సుబ్రమణ్యశాస్త్రి వివరణ ఇస్తూ.. ‘మెరుగైన శిక్షణతో పాటు ఉద్యోగవకాశాలు కల్పించే స్థాయి ఉన్న ఏజెన్సీలకే కాంట్రాక్టు అప్పగిస్తాం. కేంద్రాల నిర్వహణపై పూర్తి అధ్యయనం చేసి.. ఏజెన్సీలను ఎంపిక చేస్తాం. అవసరమైతే వారి ద్వారా ఉద్యోగవకాశాలు కల్పిస్తున్నట్లు ఒప్పంద పత్రం రాయించుకుంటాం.
అర్హులైన, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జిల్లా కేంద్రంలోని మైనార్టీ కార్యాలయంలో సంప్రదించాలని చెప్పారు.