నల్లగొండ, న్యూస్‌లైన్: మైనార్టీ యువతకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న రాజీవ్ యువకిరణాల తరహాలోనే మైనార్టీ యువతీ, యువకుల కోసం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. మైనార్టీలకు యువ కిరణాలు పథకం కింద రాష్ట్ర మెనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రస్తుత సంవత్సరం నుంచే జిల్లాలో ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, జైనులు, బౌద్ధ తదితర మైనార్టీ విభాగాలకు చెందిన యువతీ యువకులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇప్పించడంతో పాటు ఉద్యోగావకాశాలు కల్పించాలని, స్వయం ఉపాధి కోరే వారికి రుణాలిప్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు కార్పొరేషన్ అధికారులు కార్యక్రమ నిర్వహణ, ఏజెన్సీల ఎంపికలో తలమునకలవుతున్నారు.
25రంగాల్లో ఉచిత శిక్షణ
గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు పలు రంగాల్లో ఉచిత వసతితో కూడిన శిక్షణ ఇప్పించి వారికి ఉద్యోగావకాశాలు కల్పించేం దుకు రాష్ట్ర ప్రభుత్వం 2011లో రాజీవ్ యువకిరణాల పథకాన్ని ప్రారంభించిన విషయం విదితమే. అయితే ఇప్పుడు మైనార్టీ విద్యార్థులకు ప్రత్యేకించి విద్యార్హత మేరకు కోర్సులు నిర్వహించాలని నిర్ణయించింది. పదో తరగతి నుండి ఎంటెక్ చేసిన అభ్యర్థులకు విద్యార్హతనుబట్టి సాఫ్ట్‌వేర్ రంగంలో, ఇంజినీరింగ్, టెక్స్‌టైల్స్, పారామెడికల్, టూరిజం, ఆటోమోబైల్స్, ఫైర్ అండర్ సెఫ్టీ, సెక్యూరిటీ గార్డు వంటి 25 రంగాల్లో ఉచిత శిక్షణ ఇప్పించి ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు.
ఉద్యోగావకాశాలపైనే అనుమానం..
మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే శిక్షణ విషయాన్ని పక్కనబెడితే ఉద్యోగవకాశాల కల్పన విషయంలో మాత్రం అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రస్తుతం రాజీవ్ యువ కిరణాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఏజెన్సీలు నిరుద్యోగులకు శిక్షణ ఇప్పించినా, ఉద్యోగావకాశాలు కల్పించడంలో విఫలమయ్యాయయన్న విమర్శను మూటకట్టుకున్నాయి. కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొనసాగనున్న ఏజెన్సీ నిర్వాహకులు శిక్షణ పొందిన విద్యార్థులకు ఉద్యోగం కల్పించే అవకాశాలు చాలావరకు తక్కువే.
డివిజన్‌లలో శిక్షణ కేంద్రాలు
శిక్షణ కేంద్రాలు డివిజన్ కేంద్రాలతో పాటు ముఖ్య కేంద్రాల్లో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. కోర్సు మేరకు నెల నుండి మూడు నెలల కాల పరిమితితో శిక్షణ ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా శిక్షణ కేంద్రాలు డివిజన్, ముఖ్య కేంద్రాల్లోనే నిర్వహించనుండడంతో పరిసర ప్రాంత, గ్రామాల విద్యార్థులకు ప్రతిరోజూ రాకపోకలు ఇబ్బంది కలుగనుంది. దీన్ని ఏవిధంగా పరిష్కరిస్తారో వేచిచూడాల్సి ఉంది.
మైనార్టీలకూ ‘యువకిరణాలు’
Published Sat, Nov 9 2013 3:59 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement